రివ్యూ: రాజ రాజ చోర

- August 19, 2021 , by Maagulf
రివ్యూ: రాజ రాజ చోర

హీరో శ్రీ విష్ణు తాజాగా ఇప్పుడు "రాజరాజ చోర" అనే క్రైమ్ కామెడీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మేఘ ఆకాష్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు దర్శకుడు హసిత్ గోలి. రవిబాబు, తనికెళ్ల భరణి, అజయ్ గోస్ గంగవ్వ ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమా పోస్టర్లు మరియు ట్రైలర్ ఇప్పటికే ప్రేక్షకుల అంచనాలను విపరీతంగా పెంచాయి. పైగా సినిమా అంతా ప్రేక్షకులు నవ్వుతూనే ఉంటారు అంటూ దర్శక నిర్మాతలు ఈ సినిమాని బాగానే ప్రమోట్ చేశారు. ఈ సినిమా ఇవాళ అనగా ఆగస్టు 19, 2021 న విడుదలైంది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకూ మెప్పించిందో చూసేద్దామా..

చిత్రం: రాజ రాజ చోర నటీనటులు: శ్రీ విష్ణు, మేఘా ఆకాష్, సునైనా, రవి బాబు, తనికెళ్ళ భరణి, శ్రీకాంత్ అయ్యాంగర్ తదితరులు సంగీతం: వివేక్ సాగర్ సినిమాటోగ్రఫీ: వేద రామన్ శంకరన్ ఎడిటింగ్‌: విప్లవ్ నిర్మాతలు: అభిషేక్ అగర్వాల్, టి జీ విశ్వ ప్రసాద్ దర్శకత్వం: శ్రీధర్ గాదె బ్యానర్: అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ

విడుదల: 19/08/2021 కథ: భాస్కర్ (శ్రీ విష్ణు) ఒక జిరాక్స్ షాప్ లో పని చేస్తూ ఉంటాడు. అతను సంజన (మేఘా ఆకాష్) తో ప్రేమలో పడతాడు. తాను సాఫ్ట్వేర్ ఇంజనీర్ ని అని చెప్పుకుని భాస్కర్ ఆమె తో పరిచయం పెంచుకుంటాడు. అయితే సరిగ్గా అదే సమయంలో భాస్కర్ కి ఇదివరకే పెళ్లి అయిందని అతనికి ఒక కొడుకు కూడా ఉన్నాడని తెలుస్తుంది. భాస్కర్ కి నిజంగానే పెళ్లి అయిందా? విద్యా (సునైనా) ఎవరు? ఆమెకి భాస్కర్ కి మధ్య ఉన్న సంబంధం ఏంటి? భాస్కర్ అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

నటీనటులు: శ్రీ విష్ణు పర్ఫామెన్స్ ఈ సినిమాకి హైలైట్ గా మారిందని చెప్పుకోవచ్చు. గతంలో తను చేసిన పాత్రలన్నిటిలోనూ ఈ సినిమాలో తనకి ఒక విభిన్నమైన పాత్ర దొరికింది. అయినప్పటికీ శ్రీ విష్ణు తన కామెడీ టైమింగ్ మరియు హావభావాలతో తన పాత్రకు పూర్తి స్థాయిలో న్యాయం చేసాడు. ముఖ్యంగా ఇంటర్వెల్ సీన్స్ మరియు ఫస్ట్ హాఫ్ లో కొన్ని రొమాంటిక్ సీన్స్ లో శ్రీ విష్ణు నటన చాలా బాగుంది. హీరోయిన్ మేఘ ఆకాష్ తన స్క్రీన్ ప్రెజెన్స్ తో బాగానే ఆకట్టుకుంది. తనికెళ్ల భరణి పాత్ర స్క్రీన్ప్లే ను చాలా బాగా ముందుకు తీసుకెళ్తుంది. గంగవ్వ కూడా తన నటనతో బాగానే మెప్పించింది. మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలలో బాగానే నటించారు.

సాంకేతికవర్గం: దర్శకుడు హాసిత్ గోలి మొదటి సినిమా అయినప్పటికీ కథను నేరెట్ చేయడంలో సఫలం అయ్యాడు అని చెప్పుకోవాలి. ఫస్టాఫ్ మొత్తం చాలా సరదా సరదాగా గడిచిపోతుంది. కామెడీ సీన్లు మాత్రమే కాకుండా ఎమోషనల్ సీన్లను కూడా దర్శకుడు బాగానే పండించాడు. అయితే సెకండ్ హాఫ్ మాత్రం కొంచెం స్లోగా అనిపించడంతో ప్రేక్షకులకు బోర్ కొట్టే అవకాశాలు ఉన్నాయి. ఎమోషనల్ సన్నివేశాలలో కూడా ప్రాధాన్యత ఇచ్చి ఉంటే బాగుండేది అనిపించింది. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ మరియు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అందించిన నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. వివేక్ సాగర్ సంగీతం ఈ సినిమాకి చాలా బాగా ప్లస్ అయ్యింది. దాదాపు ప్రతి సీన్ ను నేపథ్య సంగీతం ఎలివేట్ చేస్తూ ఉంటుంది. ఛాయాగ్రహణం మరియు ఎడిటింగ్ కూడా పర్వాలేదనిపించాయి. బలాలు: ఫస్ట్ హాఫ్ ఎంటర్టైన్మెంట్ నటీనటులు డైలాగులు బలహీనతలు: సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లే ఎమోషనల్ సన్నివేశాలు చివరి మాట: ఎమోషనల్ కామెడీ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ "రాజ రాజ చోర' సినిమాలో కామెడీ మరియు లవ్ సీన్లు చాలా బాగా పండాయి కానీ ఎమోషనల్ సన్నివేశాలు అంతగా ఆకట్టుకోలేకపోయాయి. అయితే దర్శకుడు చెప్పాలనుకున్న మెసేజ్ ను మాత్రం సినిమా ద్వారా చాలా బాగా చెప్పారు. బాటమ్ లైన్: కామెడీ టైమింగ్ తో కడుపుబ్బా నవ్వించే "రాజ రాజ చోర".

--మాగల్ఫ్ రేటింగ్: 2.75/5

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   
Copyrights 2015 | MaaGulf.com