భారతదేశం ఏనాడూ సామ్రాజ్యవాదాన్ని ప్రోత్సహించలేదు:ఉపరాష్ట్రపతి

- August 20, 2021 , by Maagulf
భారతదేశం ఏనాడూ సామ్రాజ్యవాదాన్ని ప్రోత్సహించలేదు:ఉపరాష్ట్రపతి
బెంగళూరు: భారతదేశ చరిత్రలో సామ్రాజ్యవాదాన్ని ప్రోత్సహించిన దాఖలాలు లేవని, భారతీయ రక్షణరంగ ఉత్పత్తులు రక్షణ కోసమే తప్ప దాడుల కోసం కాదని ఉపరాష్ట్రపతి  ముప్పవరపు వెంకయ్యనాయుడు తెలిపారు. భారతదేశం సనాతన కాలం నుంచి వసుధైవ కుటుంబకం, సర్వేజనా సుఖినోభవన్తు భావనలను బలంగా నమ్ముతోందన్న ఆయన, మన దేశం ప్రపంచ వ్యాప్తంగా అన్నిదేశాలతో స్నేహాన్నే కోరుకుంటోందని తెలిపారు. అదే సమయంలో దేశ రక్షణ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదన్న ఉపరాష్ట్రపతి, మన రక్షణ అవసరాలకు తగిన ఉత్పత్తులు దేశీయంగా రూపొందడం, ఇతర దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి ఎదుగుతుండటం ఆనందదాయకమని తెలిపారు.
 
బెంగళూరులోని హెచ్.ఏ.ఎల్. కాంప్లెక్స్ ను సందర్శించిన ఉపరాష్ట్రపతి, అక్కడి హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ మరియు ఏరోనాటికల్ డెవలప్ మెంట్ ఏజెన్సీకి చెందిన శాస్త్రవేత్తలు మరియు ఇంజనీర్లను ఉద్దేశించి ప్రసంగించారు. రాబోయే కాలంలో భారతదేశాన్ని వైమానిక మరియు రక్షణ రంగాల్లో శక్తికేంద్రంగా తీర్చిదిద్దడంలో దేశీయ ఉత్పత్తులు కీలకపాత్ర పోషించనున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
 
భారతదేశం అతిపెద్ద రక్షణ రంగ ఎగుమతిదారుగా ఎదగాలనేదే తమ ఆకాంక్ష అని తెలిపిన ఉపరాష్ట్రపతి, రక్షణ సాంకేతికతలో స్వయం ఆధారిత దేశంగా బారతదేశాన్ని నిలబెట్టేందుకు అత్యాధునిక సాంకేతికతను అభివృద్ధి చేయాలని భారతీయ శాస్త్రవేత్తలకు పిలుపునిచ్చారు. ఆత్మనిర్భరతను సాధించటంతో పాటు ఆధునిక సైనిక సాంకేతిక పరికరాల ఎగుమతుల కేంద్రంగా ఎదగాలని దిశానిర్దేశం చేశారు.
అత్యాధునిక క్షిపణులు, ఉపగ్రహాలు మరియు అంతరిక్ష వాహనాలను తయారు చేయగల భారతదేశ సామర్థ్యం గురించి ప్రస్తావించిన ఉపరాష్ట్రపతి, భారతదేశం మొన్నటి వరకూ ప్రపంచంలో అతిపెద్ద ఆయుధాల దిగుమతి దేశంగా ఉందని, ప్రస్తుతం ఈ పరిస్థితి క్రమంగా మారుతోందని, భవిష్యత్ లో క్లిష్టమైన సాంకేతికతల స్వదేశీ అభివృద్ధిని వేగవంతం చేయడం ద్వారా ఈ పరిస్థితిని మార్చాలని పిలుపునిచ్చారు. 
 
అత్యంత క్లిష్టమైన భౌగోళిక, రాజకీయ వాతావరణం కారణంగా భారతదేశం ఎదుర్కొంటున్న అనేక రకాలైన భద్రతా సవాళ్ళను ప్రస్తావించిన ఉపరాష్ట్రపతి, భద్రతాదళాల ధైర్యం, నైపుణ్యాలను ప్రశంసించారు. భారత సాయుధదళాలు, సవాళ్ళను ఎదుర్కొనేందుకు, అదే సమయంలో భద్రతాసవాళ్ళను గట్టిగా తిప్పికొట్టడానికి పూర్తి సన్నద్ధంగా ఉండేలా వారి నైపుణ్యాలను పెంచాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. రక్షణ తయారీలో దేశీయీకరణ, స్వయం ఆధారిత విధానాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చేపడుతున్న అనేక కార్యక్రమాలను ప్రస్తావించిన ఆయన, మంచి ఫలితాల కోసం రక్షణ రంగ ప్రాజెక్టుల్లో ప్రైవేట్ భాగస్వామ్యాన్ని తప్పనిసరి చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అత్యుత్తమైన వాటికి ధీటైన ఉత్పత్తులను భారతదేశం తయారు చేస్తోందని, ఈ దిశగా వ్యూహాత్మక భాగస్వామ్యాలు, సాంకేతిక భాగస్వామ్యాలు మరియు బృంద కృషిని మరింత పెంచార్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. 
 
రక్షణ రంగానికి ఎఫ్.డి.ఐ. పరిమితి పెంపు, ఉత్తరప్రదేశ్ – తమిళనాడుల్లో రెండు రక్షణ నడవాల ఏర్పాటు నిర్ణయం, రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి రెండు సానుకూల స్వదేశీకరణ జాబితాల నోటిఫికేషన్ వంటి చర్యలు భారతదేశ రక్షణ రంగానికి గొప్ప అవకాశమన్న ఉపరాష్ట్రపతి, భారత వైమానిక రంగం ఇటీవల హెచ్.ఏ.ఎల్.తో చేసుకున్న 83 తేజస్ ఫైటర్ జెట్ ఒప్పందాన్ని ప్రస్తావించారు. పెద్ద సంఖ్యలో భారతీయ కంపెనీల ప్రమేయాన్ని అభినందించిన ఆయన, అంటువంటి ప్రాజెక్టుల ద్వారా భారతీయ వైమానిక రంగ తయారీ పర్యావరణ వ్యవస్థను తనకాళ్ళ మీద తాను నిలబడే శక్తివంతమైన ఆత్మనిర్భర్ గా మార్చే అవకాశం ఉందని పేర్కొన్నారు.
 
వైమానిక పరిశ్రమల ఆవిష్కరణ ప్రక్రియల్లో అధిక స్థాయిలో ప్రమాదాలు, మరియు ఖరీదైన పెట్టుబడులు ఉంటాయన్న ఉపరాష్ట్రపతి, పరిశ్రమలు మరియు పరిశోధకుల మధ్య క్రియాశీల సహకారం ద్వారా ఈ ప్రక్రియను వేగవంతం చేయవచ్చని అభిప్రాయపడ్డారు. వైమానిక మరియు రక్షణ రంగాల్లో ఆర్ అండ్ డిలలో ఆకర్షించాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పిన ఆయన, ఏరోస్పేస్ హబ్ అభివృద్ధి కోసం విద్యాసంస్థలు మరియు పరిశ్రమల మధ్య సమన్వయాన్ని సృష్టించాల్సిన అవసరాన్ని తెలియజేశారు. ఈ చొరవ ఆవిష్కరణలకు ప్రోత్సాహాన్ని అందించడమే గాక, ఈ కీలక రంగంలో నైపుణ్యాల కొరత సమస్యను పరిష్కరిస్తుందని పేర్కొన్నారు.
 
అంతకు ముందు ఉపరాష్ట్రపతి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఆధ్వర్యంలోని ఎల్.సి.ఏ. తేజస్ తయారీ కేంద్రాన్ని సందర్శించారు. అత్యాధునిక ఆధునిక యుద్ధవిమానాన్ని తయారు చేసిన శాస్త్రవేత్తలు, ఇంజనీర్లను అభినందించారు. 4ప్లస్ తరం విమానాలు భారత వైమానికదళ అవసరాలను తీర్చేందుకు ఇదో శక్తివంతమైన వేదిక అని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
స్వదేశీ సాంకేతికత ద్వారా అభివృద్ధి చేసిన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వారి అధునాతన తేలికపాటి హెలికాఫ్టర్, ధ్రువ్, తేలికపాటి కంబాట్ హెలికాఫ్టర్, చీతా/చేతక్ హెలికాఫ్టర్ ల స్థానంలో ఉండే తేలికపాటి యుటిలిటీ హెలికాఫ్టర్ వంటివి ఉపరాష్ట్రపతిని విశేషంగా ఆకట్టుకున్నాయి.
 
జాతీయ భద్రతకు హెచ్.ఏ.ఎల్ మరియు డి.ఆర్.డి.ఓ. ప్రయోగశాలల అద్భుతమైన సహకారాన్ని ప్రశంసించిన ఉపరాష్ట్రపతి, ఎల్.సి.ఏ. ఎం.కె-2, అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ (ఎ.ఎం.సి.ఏ), ట్విన్ ఇంజిన్ డెక్ బేస్డ్ ఫైటర్ (టి.ఈ.డి.బి.ఎఫ్) వంటి మరింత శక్తివంతమైన విమానాల రూపకల్పన పట్ల విశ్వాసం వ్యక్తం చేశారు. యుద్ధవిమానాల అవసరాల కోసం ఇకపై భారతదేశం విదేశీ సాంకేతికత మీద ఆధారపడాల్సిన అవసరం ఏమాత్రం లేదని పేర్కొన్నారు. 
 
భారతదేశంలో వైమానిక పరిశ్రమ వృద్ధికి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అభివృద్ధి దర్పణంగా నిలిచిందని పేర్కొన్న ఉపరాష్ట్రపతి, సమర్థ్ ఔర్ సాక్షణ్ భారత్ నిర్మాణంలో రక్షణ మరియు వైమానిక సాంకేతికత విషయంలో స్వీయ ఆధారిత విధానం కీలకమని పునరుద్ఘాటించారు. తయారీ డిజిటైజేషన్ గురించి ప్రస్తావించిన ఆయన, ఇది వైమానిక రంగంలో పలు సానుకూల మార్పులను తీసుకొస్తుందని తెలిపారు. 4వ పారిశ్రామిక విప్లవానికి అనుగుణంగా మార్పులను స్వీకరించాలని సూచించిన ఆయన, విమానయాన రంగంలో హెచ్.ఏ.ఎల్. ప్రపంచ అవసరాలను తీర్చే సంస్థగా ఎదిగేందుకు వినియోగదారుల అవసరాలతో పాటు, వారి అభిప్రాయలను కూడా తీసుకుని ఎప్పటికప్పుడు నూతన విధానాల దిశగా ముందుకు సాగాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు.
 
మానవాళి ఎదుర్కొంటున్న వివిధ సవాళ్ళకు పరిష్కారాలను కనుగొనేందుకు ఆవిష్కరణ శక్తితో ముందుకు సాగాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పిన ఉపరాష్ట్రపతి, భారతదేశ ఆర్థిక అభివృద్ధి అజెండా సామాజికంగా, ఆర్థికంగా సమగ్రమైనదిగా, ప్రాంతీయ సమతుల్యమైనదిగా, అదే సమయంలో పర్యావరణ హితంగా ఉండాలని నొక్కి చెప్పారు.
ఈ కార్యక్రమంలో కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్, హెచ్.ఏ.ఎల్. ఛైర్మన్ ఆర్. మాధవన్, సంచాలకులు అలోక్ వర్మ సహా పలువురు శాస్త్రవేత్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com