తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ఘనంగా “తెలుగు భాషా దినోత్సవ వేడుకలు”

- August 30, 2021 , by Maagulf
తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ఘనంగా “తెలుగు భాషా దినోత్సవ వేడుకలు”

అమెరికా: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) సాహితీ విభాగం “తానా ప్రపంచ సాహిత్య వేదిక” ఆధ్వర్యంలో వ్యావహారిక భాషోద్యమ పితామహుడు గిడుగు వేంకట రామమూర్తి  జయంతి (ఆగష్టు 29) సందర్భంగా “తెలుగు భాషా దినోత్సవ వేడుకలు” ఆగష్టు 28, 29 రెండు రోజులపాటు అంతర్జాతీయ స్థాయిలో అంతర్జాల దృశ్య సమావేశంలో ఘనంగా జరిగాయి.ప్రతి నెలా ఆఖరి ఆదివారం జరుగుతున్న కార్యక్రమాలలో యిది 16 వ సమావేశం. 

తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు తన స్వాగతోపన్యాసంలో వ్యావహారిక భాషోద్యమ పితామహుడు గిడుగు వేంకట రామమూర్తి  కృషిని, ఆయనకు ఆ ఉద్యమంలో సహకరించిన అనేకమంది సాహితీ వేత్తలకు ఘన నివాళులర్పించి సభను ప్రారంభించారు. 
తానా ప్రపంచ సాహిత్య వేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ ఒక మధురమైన తెలుగు పద్యం పాడి సభలో తెలుగుదనం నింపారు.  

తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర అతిధులకు, వక్తలకు ఆహ్వానం పలికి శనివారం జరిగిన సభలో ముఖ్య అతిధి గా పాల్గొన్న పశ్చిమ బెంగాల్ రాష్ట్ర మహిళా, శిశు అభివృద్ధి మరియు సాంఘిక సంక్షేమ శాఖామంత్రి గా ఉన్న తెలుగు సంతతికి చెందిన డా.శశి పిల్లలమర్రి పంజాను సభకు పరిచయం చేస్తూ శశి నాన్న పిల్లలమర్రి వేంకట కృష్ణయ్య తెనాలి అని, అమ్మ మాధవపెద్ది సీతాదేవిది గుంటూరు అని శశి, ఆమె అన్నయ్య మోహన్ పుట్టింది నరసరావు పేట కాని చిన్నపటినుండి కలకత్తాలో పెరగడం, చదవడం, ఉద్యోగంతో పాటు రాజకీయాలలో కూడా రాణించడం ముదావహం అన్నారు.వ్రుత్తి రీత్యా వైద్యురాలిగా తీరికలేకుండా ఉంటూ కూడా రాష్ట్ర రాజకీయాలలో చాలా చురుకుగా పాల్గొనడం చాల అభినందనీయం అని అన్నారు. 

డా.శశి పంజా మాట్లుడుతూ మాజీ కేంద్రమంతి అజిత్ కుమార్ పంజా కుమారుడు డా. ప్రసన్నకుమార్ పంజా తో వివాహం కావడం వల్ల తన పేరు శశి పంజా గా మారిందని, ఎందరో మహానుభావులు పుట్టిన తెలుగు నేల పై పుట్టడం తన అదృష్టంగా భావిస్తున్నానని, నాన్న ఉద్యోగరీత్యా కలకత్తాలో స్థిరపడడం తో చిన్నపటినుండి తెలుగు నేలకు దూరం అయ్యాము గాని తెలుగు భాషకు కాదని, ఇప్పటికీ మేము ఇంట్లో తెలుగే మాట్లాడతామని, మధురమైన మన తెలుగు భాషను మాట్లాడే వారు బెంగాల్ రాష్ట్రంలో చాలామంది ఉన్నారని, అందుకే ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో తెలుగును ఇటీవలే అధికార భాషగా గుర్తించారని తెలియజేశారు.తెలుగు వ్యవహారిక బాషగా ఉండాలనే ఉద్యమంలో గిడిగు వెంకట రామమూర్తి తన సర్వసాన్ని త్యాగం చేసారని గుర్తు చేస్తూ ఆయనకు నివాళులర్పించి, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికి తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలను, వేడుకలని ఘనంగా నిర్వహిస్తున్న తానా ప్రపంచ సాహిత్య వేదికకు అభినందనలను తెలియజేశారు.
ఈ సభలోనే ప్రముఖ నటులు, రచయిత తనికెళ్ళ భరణి విశిష్ట అతిధిగా పాల్గొని తెలుగు రాష్ట్రాలలో తెలుగు దీనావాస్థ స్థితిలో ఉందని ఆవేదన చెందుతూ, ఈరోజు విదేశాలలో ముఖ్యంగా తానా ఆధ్వర్యంలో తెలుగు భాషా దినోత్సవ వేడుకలు వైభవంగా జరగడం చాల సంతోషించదగ్గ విషయం అన్నారు. తనికెళ్ళ భరణి తెలుగులో రచించిన “ఎందరో మహానుభావులు” అనే గ్రంధాన్ని సత్య భావన అనే రచయిత్రి ఆంగ్లానువాదం చేసిన ప్రతిని మంత్రి డా.శశి పంజా ఆవిష్కరించారు. 

మన తెలుగు సంతతికి చెందిన వ్యక్తి ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ గా సేవలందిస్తున్న డా. బొప్పూడి నాగ రమేష్,ఈ సభలో ఒక విశిష్ట అతిధిగా పాల్గొని ఎంతోమంది సంగీత విద్వాంసుల జీవిత చరిత్రలను అత్యంత మనోహరంగా భరణి చిత్రీకరించారని, అందరూ చదవవలసిన పుస్తకం అని పుస్తక సమీక్ష చేశారు.  
రెండో రోజు సభలో శ్రీకాకుళం జిల్లా లోని ఒక మారుమూల పల్లెనుంచి ధిల్లీ లో క్రీడా విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగా ఎదిగిన సిడ్నీ ఒలెంపిక్స్ పతక విజేత పద్మశ్రీ డా. కరణం మల్లేశ్వరి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.మల్లేశ్వరి మాట్లాడుతూ తెలుగు వ్యక్తి గా పుట్టడం తన అదృష్టం అని మన భాషను రక్షించుకునేందుకు అందరూ పాటుపడాలని పిలుపునిచ్చారని అన్నారు.

తానా ప్రపంచ సాహిత్య వేదిక కోసం తెలుగు వైభవం, సాహితీవేత్తలపై ప్రత్యేకంగా రూపొందించిన వీడియో ను తానా అధ్యక్షులు లావు అంజయ్య చౌదరి విడుదల చేశారు.  
తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డా.ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ - ఇకనుంచి ప్రతి నెలా సాహిత్య కార్యక్రమానికి ముందు ఈ విడియో ను ప్లే చేస్తామని, ఈ గీతాన్ని రాసిన తెలుగు వేదకవి జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, స్వరపరచిన సంగీత దర్శకులు నేమాని పార్థసారథి, గానం చేసిన అమర గాయకులు ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యంకి  కృతజ్ఞతలు అన్నారు. ఈ రెండు రోజులపాటు జరిగిన వేడుకల్లో గిడుగు వేంకట రామమూర్తి తో సహా మొత్తం 17 మంది లబ్ద ప్రతిష్టులైన విశిష్ట సాహితీవేత్తలను వారి కుటుంబ సభ్యులే పాల్గొని ఆ నాటి సామాజిక పరిస్ధితులు, వారి జీవన విధానం, సహా రచయితలతో వారి అనుబంధం, వారి సాహిత్య సృష్టి మొదలైన ఎన్నో పుస్తకాలలో లభ్యంకాని ఆసక్తికరమైన విషయాలను పంచుకోవడం సాహిత్య చరిత్రలోనే ఒక సరికొత్త కోణం అని, పాల్గొన్నవారందరికి హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేశారు. 

పాల్గొన్న విశిష్ట సాహితీవేత్తల కుటుంబ సభ్యులు:    
డా.తుమ్మల సీతారామమూర్తి చౌదరి, తెనుగు లెంక, ఆధునిక పద్య కవి, పండితుడు  కుమారుడు -  తుమ్మల శ్రీనివాసమూర్తి
డా.రాయప్రోలు సుబ్బారావు, గొప్ప జాతీయవాది, ప్రముఖ కవి, రచయిత మనుమరాలు ఆచార్య డా.మనోరమ (రాయప్రోలు) కానూరి 
డా.కొండవీటి వేంకట కవి, సుప్రసిద్ధ కవి, హేతువాది, చలనచిత్ర సంభాషణల రచయిత  కుమార్తె  ఆచార్య డా.కొండవీటి విజయలక్ష్మి
డా.ముళ్ళపూడి వెంకటరమణ ప్రముఖ సాహితీవేత్త, ప్రముఖ చలనచిత్ర కథా, హాస్య సంభాషణల రచయిత కుమారుడు  వర ముళ్ళపూడి
డా.గొల్లపూడి మారుతీరావు, రేడియో ప్రయోక్త, నటుడు, చలనచిత్ర కథా, మాటల రచయిత  కుమారుడు గొల్లపూడి రామకృష్ణ  
బ్రహ్మర్షి డా.ఉమర్ ఆలీషా సూఫీ వేదాంత వేత్త, తెలుగు సాహితీ వేత్త, సంఘ సంస్కర్త  మునిమనవడు డా.ఉమర్ ఆలీ షా
పద్మభూషణ్ డా.గుర్రం జాషువా కవితా విశారద, కవి కోకిల, నవయుగ కవి చక్రవర్తి  మునిమనవడు గుర్రం పవన్ కుమార్
 పద్మభూషణ్ డా.దేవులపల్లి కృష్ణశాస్త్రి సుప్రసిద్ధ భావకవి, ప్రముఖ చలనచిత్ర గీత రచయిత గారి  మనవరాలు రేవతి అదితం
కళాప్రపూర్ణ గిడుగు వెంకట రామమూర్తి, వాడుక భాషోద్యమ పితామహుడు, బహు భాషాశాస్త్రవేత్త గారి మునిమనవరాలు గిడుగు స్నేహలతా మురళి
పద్మభూషణ్ డా.బోయి భీమన్న, ప్రముఖ కవి, సామాజిక చైతన్య రచయిత  సతీమణి హైమవతీ భీమన్న 
గురజాడ అప్పారావు,సంఘ సంస్కర్త, హేతువాది, అభ్యుదయ కవి  మునిమనవరాలు – అరుణ గురజాడ, రాష్ట్రేందు డా.గుంటూరు శేషేంద్రశర్మ, ప్రముఖ కవి, విమర్శకుడు, పండితుడు, సాహితీవేత్త కుమారుడు గుంటూరు సాత్యకి పద్మశ్రీ డా.పుట్టపర్తి నారాయణాచార్యులు, “సరస్వతీ పుత్ర”, సుప్రసిద్ధ కవి కుమార్తె డా.పుట్టపర్తి నాగ పద్మిని 

ఈ రెండు రోజుల పూర్తి కార్యక్రమాలను ఈ క్రింది యు ట్యూబ్ లింక్ లలో చూడవచ్చును.
శనివారం, ఆగస్ట్ 28 యుట్యూబ్ లింక్:         
https://www.youtube.com/watch?v=WUFA6Qg2P-k

ఆదివారం, ఆగస్ట్ 29 యుట్యూబ్ లింక్:         
https://www.youtube.com/watch?v=8HArAMVQ1eQ

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com