ఔనా?.. పంజ్‌షీర్ తాలిబాన్ల వ‌శ‌మైందా?...అసలు అక్కడ ఏం జరుగుతోంది?

- September 04, 2021 , by Maagulf
ఔనా?.. పంజ్‌షీర్ తాలిబాన్ల వ‌శ‌మైందా?...అసలు అక్కడ ఏం జరుగుతోంది?

అంత‌ర్జాతీయ స‌మాజంలో ఉగ్రవాద సంస్థ‌గా పేరు ప‌డిపోయిన తాలిబాన్ ఉగ్ర‌వాదులు ష‌రియా చ‌ట్టం అమ‌లు పేరిట ఏ మేర దారుణాల‌కు ప్పాల‌డతారో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. అలాంటి తాలిబాన్లు ఇప్ప‌టికే ఆఫ్థ‌నిస్తాన్ ప్ర‌జ‌ల‌కు త‌మ విశ్వ‌రూపం ఏమిటో చూపించారు. తాజాగా మ‌రోమారు ఆఫ్ఘ‌న్ పై పంజా విసిరారు. అయితే నాడు ఆఫ్ఘ‌న్ తాలిబాన్ల తాట తీసిన పంజ్ షీర్ వ్యాలి.. ఇప్పుడూ తాలిబాన్ల‌కు చుక్కలు చూపిస్తోంది. పంజ్ షీర్ పేరు వింటేనే తాలిబాన్లు వ‌ణికిపోయే ప‌రిస్థితి. అలాంటిది ఇప్పుడు పంజ్ షీర్ స‌హా ఆఫ్ఘ‌న్ మొత్తం త‌మ వ‌శ‌మైంద‌ని తాలిబాన్లు ప్ర‌క‌టించారు. ఈ ప్ర‌క‌ట‌న‌పై భిన్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి. పంజ్ షీర్ తాలిబాన్ల వ‌శం కాలేద‌ని, ఈ ప్రాంతాన్ని త‌మ అధీనంలోకి తీసుకునేందుకు తాలిబాన్లు తీవ్రంగా య‌త్నిస్తున్నార‌ని, అయితే తాము వారిని తిప్పికొడుతున్నామ‌ని ఆఫ్ఘ‌న్ ఉపాధ్య‌క్షుడు అమ్రుల్లా సాలేహ్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. పంజ్ షీర్ ప్రాంతంలోనే మ‌కాం వేసిన అమ్రుల్లా.. తాలిబాన్ తిరుగుబాటు ద‌ళాల‌తో క‌లిసి ప‌నిచేస్తున్న సంగ‌తి తెలిసిందే.

భీక‌ర పోరు.. ఇరువ‌ర్గాల‌కు న‌ష్టం..
తాజాగా అందుతున్న స‌మాచారం ప్ర‌కారం అఫ్గానిస్తాన్‌లోని పంజ్‌షీర్‌ లోయలో తాలిబాన్లు, ప్రతిఘటన ఫైటర్ల మధ్య హోరాహోరీ పోరాటం జరుగుతోంది. కాల్పులతో లోయ దద్దరిల్లుతోంది. ఈ కాల్పుల్లో ఇరువైపులా వందలాది మంది చనిపోయారు. ఇప్పటి వరకు తాలిబాన్ల వశం కాని ఏకైక ప్రాంతం పంజ్‌షీర్ మాత్రమే. దాన్ని స్వాధీనం చేసుకోవడానికి తాలిబాన్లు విఫల యత్నం చేస్తున్నారు. పంజ్‌షీర్ ఫైటర్లు తాలిబాన్లకు గట్టిగా బదులిస్తున్నారు. ఈ క్ర‌మంలో పంజ్‌షీర్ నుంచి పారిపోయినట్లు వస్తున్న వార్తలను అఫ్గానిస్తాన్ మాజీ ఉపాధ్యక్షుడు, ప్రతిఘటన నాయకుల్లో ఒకరైన అమ్రుల్లా సాలేహ్ ఖండించారు. పరిస్థితి మాత్రం క్లిష్టంగా ఉందని చెప్పారు. తాలిబాన్లు తమపై దాడి చేశారని, కాల్పుల్లో ఇరువైపులా మరణాలు సంభవించాయని, అయితే, ఎట్టి పరిస్థితుల్లో లొంగిపోయే ప్రసక్తే లేదని అమ్రుల్లా సాలేహ్ చెప్పారు.

ఇటు తాలిబాన్లు.. అటు పంజ్ షీర్ వీరులు
పంజ్‌షీర్‌ లోయను స్వాధీనం చేసుకున్నామని తాలిబాన్లు ప్రకటించుకున్నారు. అయితే, అక్కడున్న ప్రతిఘటన ఫైటర్లు మాత్రం దీన్ని ఖండిస్తున్నారు. తాలిబాన్లను వెనకడుగు వేసేలా చేశామని పంజ్‌షీర్‌ లోయలో తాలిబాన్లకు వ్యతిరేకంగా పోరాడుతున్న నేషనల్ రిసిస్టెన్స్ ఫ్రంట్- ఎన్ఆర్ఎఫ్ ఫైటర్ల అధికార ప్రతినిధి అలి నజారీ మరో కీలక ప్రకటన చేశారు. కొన్ని వందల మంది తాలిబాన్లు తమ ఉచ్చులో చిక్కుకున్నారని, వాళ్ల దగ్గర మందు గుండు సామాగ్రి అయిపోతోందని, తమకు సరెండర్ కావడానికి వారు ప్రస్తుతం చర్చలు జరుపుతున్నారని ఆయన తెలిపారు. అయితే, పంజ్‌షీర్‌పై పట్టు సాధించామని తాలిబాన్లు ప్రకటించుకున్నారు. “అల్లా దయ వల్ల మొత్తం అఫ్గానిస్తాన్ మా చేతుల్లోకి వచ్చింది. పంజ్‌షీర్‌లో సమస్యలు సృష్టిస్తున్న వాళ్లు ఓడిపోయారు. ఆ ప్రాంతం ఇప్పుడు మా ఆధీనంలో ఉంది” అని తాలిబాన్ కమాండర్ ఒకరు చెప్పారు.  వెరసి తాలిబాన్లు పంజ్ షీర్ ను ఇంకా తమ ఆధీనంలోకి తీసుకోలేదని, ఆ దిశగా సాగుతున్న వారికి తిరుగుబాటు దళాల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోందని తెలుస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com