టీఎస్‌ఆర్టీసీ వచ్చే ఆర్థిక సంవత్సరంలో 150 కొత్త బస్సులు

- March 15, 2016 , by Maagulf
టీఎస్‌ఆర్టీసీ వచ్చే ఆర్థిక సంవత్సరంలో 150 కొత్త బస్సులు

రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) వచ్చే ఆర్థిక సంవత్సరంలో 150 కొత్త బస్సులు కొనుగోలు చేయనున్నట్టు టీఎస్‌ఆర్టీసీ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ రమణారావు తెలిపారు. ఈ 150 బస్సుల్లో అత్యధిక శాతం ఏసీ బస్సులు గరుడ, ఇంద్ర, సూపర్ లగ్జరీ వంటివి తీసుకోవాలని, వాటితోపాటు అవసరాన్ని బట్టి ఆర్డినరీ బస్సులను కొనుగోలు చేయాలని అధికారులు ఆలోచిస్తున్నారు. కొత్తగా బస్సుల కొనుగోలు కోసం ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుత ఏడాదికి రాష్ట్ర బడ్జెట్‌లో ఆర్టీసీకి రూ.159 కోట్లను ప్రభుత్వం ప్రతిపాదించగా, అందులో రూ.40కోట్లు కొత్త బస్సులను కొనుగోలు చేసేందుకు వెచ్చిస్తున్నారు. పాడుబడిన బస్సులను తప్పించి వాటి స్థానంలో కొత్త బస్సులను ప్రవేశపెట్టడం వల్ల ప్రయాణికులను ఆకర్షించడంతోపాటు రవాణా సౌకర్యాలు మరింత మెరుగుపడేందుకు దోహదపడుతాయని అధికారికవర్గాలు భావిస్తున్నాయి. మరో వైపు 2016-17 వార్షిక బడ్జెట్‌లో ప్రభుత్వం ఆర్టీసికి ప్రణాళికేతర వ్యయం కింద రూ.196 కోట్లు ప్రతిపాదించింది. ఈ మొత్తం నిధులు గ్రాంట్ ఇన్ ఎయిడ్‌గా అందజేయనున్నది. వీటిలో రూ. 86 కోట్లు ఆర్టీసీ రుణ సర్దుబాట్ల కోసం కేటాయించారు. రుణబకాయిల చెల్లింపుల కోసం వీటిని ఖర్చు చేయనున్నారు. మిగతా రూ. 110 కోట్లు ఆర్టీకికి గ్రాంట్ ఇన్ ఎయిడ్ రూపంలో అవసరాలను బట్టి ప్రభుత్వం విడుదల చేయనున్నది. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని గట్టెక్కించేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఈ నిధులను కేటాయించింది. ఇటీవల అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలియజేసే తీర్మానం చర్చ ముగింపులో సీఎం కే చంద్రశేఖర్‌రావు మాట్లాడుతూ ఆర్టీసీని నష్టాల నుంచి లాభా ల బాటలో తీసుకొస్తామని స్పష్టం చేయడంతో నూతన ఉత్తేజం, కొండత ధైర్యాన్నిచ్చిందని ఆర్టీసీ అధికారికవర్గాలు పేర్కొన్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com