జైసల్మేర్‌లో సైనిక్ సమ్మేళన్‌ను ఉద్దేశించి ప్రసంగించిన ఉపరాష్ట్రపతి

- September 27, 2021 , by Maagulf
జైసల్మేర్‌లో సైనిక్ సమ్మేళన్‌ను ఉద్దేశించి ప్రసంగించిన ఉపరాష్ట్రపతి
రాజస్థాన్: మారుతున్న భౌగోళిక వ్యూహాత్మక పరిస్థితుల నేపథ్యంలో సమాచార, సైబర్ యుద్ధాలు జరుగుతున్న సమయంలో భద్రతాబలగాలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరముందని భారత ఉపరాష్ట్రపతి ముప్పవపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. బయటనుంచి, అంతర్గతంగా కూడా దేశాన్ని అస్థిరపరిచేందుకు జరుగుతున్న కుట్రలను ప్రతి ఒక్కరూ తిప్పికొట్టాల్సిన అవసరం ఉందన్నారు. 
 
రాజస్థాన్‌లోని జైసల్మేర్ లో భారత ఆర్మీ 12 రాపిడ్ డివిజన్ బలగాలు, అధికారులనుద్దేశించి ఉపరాష్ట్రపతి ప్రసంగించారు. సమాజంలో అభివృద్ధి జరగాలంటే అంతకుముందే శాంతి నెలకొనడం తప్పనిసరని ఆయన అన్నారు. ఈ దిశగా భారతదేశ భద్రతాదళాలు చేస్తున్న కృషి, త్యాగం మరవలేనివని ఆయన పేర్కొన్నారు. విపత్కర, విషమ పరిస్థితుల్లోనూ దేశభద్రతే లక్ష్యంగా వారు చేస్తున్న సేవలను ప్రతి భారతీయుడూ గుర్తుంచుకోవాలన్నారు. 
గోల్డెన్ సిటీ - జైసల్మేర్‌ను దర్శించడం చాలా ఆనందదాయకమన్న ఉపరాష్ట్రపతి ఈ నగరం రాజస్థాన్ సంస్కృతి, భారత మిలటరీ సంప్రదాయాన్ని ప్రతిబింబిస్తోందన్నారు. అంతకుముందు లోంగేవాలా యుద్ధక్షేత్రాన్ని సందర్శించిన విషయాన్ని గుర్తుచేస్తూ మేజర్ కుల్దీప్ సింగ్ వీరోచిత గాథను, భారత సైనికుల పరాక్రమాన్ని ప్రతిబింబించిన ఘట్టాలతో రూపొందించిన సందర్శనశాల(మ్యూజియం)ను చూసి ఉద్వేగానికి గురయ్యానన్నారు. 
1971 భారత్-పాక్ యుద్ధానికి 50 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో ‘స్వర్ణిమ్ విజయ్ వర్ష్’ కార్యక్రమం ఏర్పాటుచేయడం, 12 రాపిడ్ డివిజన్ సైనికులు నాడు చూపిన శౌర్య, పరాక్రమాలను గుర్తుచేసుకోవడమేనన్నారు.
అనంతరం జోధ్‌పూర్ బయలుదేరిన ఉపరాష్ట్రపతి, అక్కడ చారిత్రక మెహరాన్‌గఢ్ కోటను సందర్శించారు. కోట నిర్మాణం ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉందన్నారు. శీష్ మహల్, ఫూల్ మహల్, జానకీ మహల్ లను నిర్మించిన తీరు సమ్మోనహంగా ఉందన్నారు. వీటిని కట్టిన కళాకారుల ప్రతిభను అభినందించకుండా ఉండలేమన్నారు. ఈ కోటనుంచి జోధ్‌పూర్ నగరం చాలా అందంగా కనిపించిందన్నారు. 
 
రాజస్థాన్ గవర్నర్ కల్రాజ్ మిశ్రా, రాజస్థాన్ మంత్రి డాక్టర్ బులాకీదాస్ కల్లా జైసల్మేర్, జోధ్‌పూర్‌ల్లో ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com