ప్రపంచం అంతటా మారుమోగుతున్న వార్త 'పండోరా పేపర్స్'..అసలు ఏంటీ పేపర్స్?

- October 04, 2021 , by Maagulf
ప్రపంచం అంతటా మారుమోగుతున్న వార్త \'పండోరా పేపర్స్\'..అసలు ఏంటీ పేపర్స్?

వాషింగ్టన్‌: పండోరా పేపర్స్‌. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న వార్త ఇది. ప్రపంచ దేశాధినేతలు, బడా బాబులు రహస్యంగా దాచిపెట్టన సంపద చిట్టా గురించి పండోరా పేపర్స్ పేరుతో ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టులు బయటపెట్టారు. పండోరా పేపర్స్ అన్న పేరును గ్రీకు పురాణాల్లో ఉన్న పండోరా బాక్స్ నుంచి తీసుకున్నారు. గ్రీకు పురాణ కథల ప్రకారం.. పండోరా బాక్సు ఓ రహస్య బాక్సు. ఆ బాక్సును ఓపెన్ చేస్తే అనియంత్రిత దుష్టశక్తులు ఉంటాయని అర్థం. ఇంటర్నేషనల్ కన్సోర్టియమ్ ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుల డైరక్టర్ గెరార్డ్ రైల్ దీన్ని కూర్పు చేశారు. పండోరా పేపర్స్ పేరు పెట్టడానికి కారణం.. తాము వివిధ అంశాలకు చెందిన బాక్సును ఓపెన్ చేయనున్నట్లు ఆయన చెప్పారు.

600 మంది జర్నలిస్టులు..
పండోరా పేపర్స్ లీక్ డేటాలో మొత్తం సుమారు 12 మిలియన్ల డాక్యుమెంట్లు ఉన్నాయి. రహస్యంగా దాచి పెట్టిన సంపద, పన్ను ఎగవేతలు, కొన్నింటిలో మనీ ల్యాండరింగ్‌కు సంబంధించిన విషయాలు ఉన్నాయి. ప్రపంచంలోని అత్యంత సంపన్న, శక్తివంతమైన నేతలు ఇలా చేశారని ఆ పేపర్స్‌లో లీక్ చేశారు. 117 దేశాలకు చెందిన 600 మంది జర్నలిస్టులు ఆ పేపర్స్‌ను స్టడీ చేస్తున్నారు. వాషింగ్టన్ డీసీలో ఉన్న ఐసీఐజే ఈ డేటాను సేకరిస్తోంది.

64 లక్షల డాక్యుమెంట్లు.. 30 లక్షల ఇమేజ్‌లు
ప్రపంచవ్యాప్తంగా 140 మీడియా సంస్థలతో దీని గురించి అధ్యయనం చేస్తున్నారు. పండోరా పేపర్స్‌లో 64 లక్షల డాక్యుమెంట్లు, 30 లక్షల ఇమేజ్‌లు, పది లక్షల కన్నా ఎక్కువ ఈమెయిల్స్‌, 5 లక్షల కన్నా ఎక్కువ సంఖ్యలో స్ప్రెడ్ షీట్లు ఉన్నాయి.

ప్రముఖులు ఎవరెవరు ?
బ్రిటన్‌కు చెందిన టోరీ డోనర్ ఈ జాబితాలో ఉన్నారు. యూరోప్‌లో భారీ స్కామ్‌లకు ఆయన పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. జోర్డాన్‌కు చెందిన చక్రవర్తి సుమారు 70 మిలియన్ల పౌండ్లతో అమెరికా, బ్రిటన్‌లో ప్రాపర్టీలు కొన్నట్లు ఆరోపించారు. అజార్‌బైజాన్‌కు చెందిన రాయల్ కుటుంబం సుమారు 400 మిలియన్ల పౌండ్లతో బ్రిటన్‌లో ప్రాపర్టీలను కొనుగోలు చేసింది. చెక్ రిపబ్లిక్ ప్రధాని రెండు ఫ్రెంచ్ విల్లాలను 12 మిలియన్ల పౌండ్లకు కొనుగోలు చేశారు. కెన్యా అధ్యక్షుడు ఉరుహు కెన్యట్టా కూడా భారీగా దశాబ్దాల పాటు ఆఫ్‌షోర్ పెట్టుబడులు పెట్టారు. పండోరా పేపర్స్‌లో సుమారు 330 మంది రాజకీయవేత్తల సమాచారం ఉన్నది. తమ సంపదను రహస్యంగా ఎలా దాచారో ఆ డేటాలో లీక్ చేశారు. అమెరికాలోని గ్లోబల్ ఫైనాన్షియల్ ఇంటిగ్రిటీకి చెందిన లక్ష్మీ కుమార్‌.. పండోరా పేపర్స్‌లోని విషయాలను వివరించారు. సంపన్నుల ఎలా తమ సంపదను రహస్యంగా విదేశాలకు మళ్లించి, ఎలా దాచిపెడుతారో చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com