హైదరాబాద్‌ మెట్రో ప్రయాణీకుల కోసం మెట్రో సువర్ణ ఆఫర్‌

- October 14, 2021 , by Maagulf
హైదరాబాద్‌ మెట్రో ప్రయాణీకుల కోసం మెట్రో సువర్ణ ఆఫర్‌

హైదరాబాద్‌: పండుగ సీజన్‌ పురస్కరించుకుని ఎల్‌ అండ్‌  టీ మెట్రో రైల్‌ (హైదరాబాద్‌) లిమిటెడ్‌  (ఎల్‌టీఎంఆర్‌హెచ్‌ఎల్‌) మరో మారు పండగ ఆఫర్లను తీసుకువస్తూ ‘మెట్రో సువర్ణ ఆఫర్‌ 2021’ను ప్రకటించింది. అక్టోబర్‌ 18 నుంచి ఈ ఆఫర్‌ అందుబాటులో ఉంటుంది.  ఈ ఆఫర్‌లో ట్రిప్‌ పాస్‌, గ్రీన్‌ లైన్‌పై ప్రత్యేక ధర మరియు మెట్రో ప్రయాణీకుల కోసం లక్కీ డ్రా ఉంటాయి.

మెట్రో సువర్ణ ఆఫర్‌ 2021లో ట్రిప్‌ పాస్‌ ఆఫర్‌: ఈ ఆఫర్‌ కింద మెట్రో ప్రయాణీకులు తమ ప్రయాణ అవసరాలకు తగినట్లుగా ఏదైనా ఫేర్‌తో 30 ట్రిప్పులను కేవలం 20 ట్రిప్పుల ధర చెల్లించి కొనుగోలు చేయవచ్చు. ఈ ట్రిప్పులను 45రోజుల లోపు వినియోగించుకోవాల్సి ఉంటుంది. ఈ ఆఫర్‌ కేవలం మెట్రో స్మార్ట్‌ కార్డ్‌ (పాత మరియు నూతనం)పై మాత్రమే వర్తిస్తుంది. మెట్రో ప్రయాణీకులు ఈ ఆఫర్‌ను 18 అక్టోబర్‌ 2021 నుంచి 15 జనవరి 2022 మధ్య వినియోగించుకోవాల్సి ఉంటుంది.

గ్రీన్‌ లైన్‌పై ప్రత్యేక ఫేర్‌ ఆఫర్‌ ః ఎంజీబీఎస్‌ మరియు జెబీఎస్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌ మెట్రో స్టేషన్‌ల నడుమ గ్రీన్‌ లైన్‌పై ప్రయాణించే ప్రయాణీకులు ప్రతి ట్రిప్‌కూ గరిష్టంగా 15 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. మెట్రో ప్రయాణీకులు ఈ ఆఫర్‌ను  అన్ని టిక్కెటింగ్‌ మార్గాలపై 18 అక్టోబర్‌ 2021 నుంచి15 జనవరి 2022 వరకూ పొందవచ్చు.
నెలవారీ లక్కీ డ్రా: అక్టోబర్‌ 2021 నుంచి ఏప్రిల్‌ 2022 వరకూ ఆకర్షణీయమైన బహుమతులను ప్రతినెలా గెలుచుకునే  అవకాశం మెట్రో ప్రయాణీకులకు ఉంది. ప్రతి నెలా  ఐదుగురు విజేతలను లక్కీడ్రా సీఎస్‌సీ కార్డు వినియోగదారుల నుంచి ఎంపిక చేస్తారు. వీరు ఓ క్యాలెండర్‌ నెలలో కనీసం 20 సార్లు ప్రయాణించాల్సి ఉంటుంది. వినియోగదారులు తమ సీఎస్‌సీ  (కాంటాక్ట్‌లెస్‌ స్మార్ట్‌కార్డు)లను టీసవారీ లేదా మెట్రో స్టేషన్‌ల వద్ద నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.


మరిన్ని వివరాల కోసం మెట్రో స్టేషన్‌లను సందర్శించవచ్చు.
ఈ ఆఫర్‌ ప్రకటించిన  ఎల్‌ అండ్‌ టీ ఎంఆర్‌హెచ్‌ఎల్‌ ఎండీ అండ్‌ సీఈవో కెవీబీ రెడ్డి మాట్లాడుతూ ‘‘గత సంవత్సరం అక్టోబర్‌లో తొలిసారిగా ప్రకటించిన మెట్రో సువర్ణ ఆఫర్‌కు అపూర్వమైన స్పందన లభించింది.  ఇప్పుడు ఈ సంవత్సరం మరో మారు ఈ ఆఫర్‌ను ప్రారంభించడం పట్ల సంతోషంగా ఉన్నాము. మా ప్రయాణీకులు మా సేవల పట్ల అపారమైన నమ్మకాన్ని చూపడంతో పాటుగా మెట్రోను తమ సురక్షితమైన ప్రయాణ భాగస్వామిగా ఎంచుకుంటున్నారు. నగరంలో అత్యంత విశ్వసనీయమైన, పర్యావరణ అనుకూల, సమయపాలన కలిగిన, సురక్షితమైన, సౌకర్యవంతమైన రవాణా మాధ్యమం ఇది. మా ప్రయాణీకులకు మెరుగైన సేవలను అందించేందుకు మమ్మల్ని మేము మెరుగుపరుచుకుంటూనే ఈ మహమ్మారి కాలంలో అత్యంత సురక్షితమైన భద్రతా ఏర్పాట్లను చేశాము’’ అని అన్నారు.

హెచ్‌ఎంఆర్‌ఎల్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌  ఎన్‌వీఎస్‌ రెడ్డి మాట్లాడుతూ ‘‘మా ప్రయాణీకుల కోసం నూతన ఆఫర్లతో మెట్రో సువర్ణ ఆఫర్‌ను తిరిగి పరిచయం చేస్తుండటం పట్ల సంతోషంగా ఉన్నాను. అత్యంత సురక్షితమైన ప్రయాణ అవకాశాలను అందిస్తూనే మా ప్రయాణీకుల నగదుకు తగ్గ విలువను అందించాలనే మా నిరంతర ప్రయత్నాలలో భాగం ఈ మెట్రో సువర్ణ ఆఫర్'' అని అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com