T20 World Cup: తొలి మ్యాచ్ లో ఒమన్ ఘనవిజయం.. 13 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఊదిపారేసిన ఓపెనర్లు
- October 17, 2021
ఒమన్: ప్రపంచకప్ అర్హత రౌండ్ మ్యాచులలో ఆతిథ్య ఒమన్ జట్టు ఘన విజయాన్ని అందుకుంది. పపువా న్యూ గినియాతో జరిగిన తొలి మ్యాచ్ లో ఆ జట్టును మట్టికరిపించింది.
ఆరంభ మ్యాచ్ లో ఆతిథ్య జట్టు అదరగొట్టింది. యూఏఈ వేదికగా జరుగుతున్న ఐసీసీ టీ20 ప్రపంచకప్ ను దుబాయ్, అబుదాబిలతో కలిసి నిర్వహిస్తున్న ఒమన్.. ఆరంభ మ్యాచ్ లో పపువా న్యూ గినియా ను మట్టి కరిపించింది. 130 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఒమన్.. 13.4 ఓవర్లలోనే వికెట్లేమీ కోల్పోకుండా విజయాన్ని అందుకుంది.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ కు దిగిన పపువా న్యూ గినియా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 129 పరుగులు చేసింది. 130 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఒమన్ కు ఓపెనర్లు చిరస్మరణీయ విజయాన్ని అందించారు. అకిబ్ ఇలియాస్ (43 బంతుల్లో 50), భారత సంతతి ఆటగాడు జతిందర్ సింగ్ (42 బంతుల్లో 73) చెలరేగారు. దీంతో మరో ఆరు ఓవర్లు మిగిలిఉండగానే ఓమన్ పది వికెట్ల తేడాతో విజయకేతనం ఎగురవేసింది.
లక్ష్య ఛేదనలో ఓమన్ ఓపెనర్లు బెదురులేకుండా ఆడారు. ఆది నుంచి ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డారు. ముఖ్యంగా జతిందర్ సింగ్ అయితే ఆకాశమే హద్దుగా చెలరేగాడు. అతడి ఇన్నింగ్స్ లో ఏడు ఫోర్లు, నాలుగు సిక్సర్లున్నాయి.
ఇన్నింగ్స్ ను నెమ్మదిగానే ఆరంభించిన ఓపెనర్లు.. ఐదో ఓవర్ తర్వాత గేర్ మార్చారు. ఐదు ఓవర్లలో ఓమన్ స్కోరు 36 పరుగులు. కానీ ఆ తర్వాత ఓవర్ నుంచి స్కోరు బోర్డు పరుగులెత్తింది. పీఎన్జీ బౌలర్ డేమియన్ వేసిన 12 ఓవర్లో సిక్సర్ తో పాటు 17 పరుగులు వచ్చాయి. ఇదే ఓవర్ లో జతిందర్ హాఫ్ సెంచరీ కూడా పూర్తి చేశాడు. పీఎన్జీలో ఏడుగురు బౌలర్లు బౌలింగ్ వేసినా ఒక్కరూ ఆకట్టుకోలేకపోయారు. చార్లెస్ ఎమిని భారీగా పరుగులిచ్చుకున్నాడు. అంతకుముందు పీఎన్జీ ఇన్నింగ్స్ ను కట్టడి చేసి 4 వికెట్లు తీసిన ఒమన్ కెప్టెన్ జీషన్ మసూద్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
ఇదిలాఉండగా.. ఒక జట్టు పది వికెట్ల తేడాతో గెలవడం టీ20లలో ఇది మూడోసారి. అంతకుముందు 2007 ప్రపంచకప్ గ్రూప్ మ్యాచ్ లలో శ్రీలంకపై ఆస్ట్రేలియా పది వికెట్ల తేడాతో గెలుపొందింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన లంక.. 101 పరుగులకు ఆలౌట్ కాగా.. ఆసీస్ ఆ లక్ష్యాన్ని 10.2 ఓవర్లలోనే వికెట్లేమీ కోల్పోకుండా ఛేదించింది. 2012 లో జింబాబ్వే.. సౌత్ ఆఫ్రికా ల మధ్య జరిగిన మ్యాచ్ లో కూడా ప్రొటీస్ జట్టు పది వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన జింబాబ్వే.. 8 వికెట్లు కోల్పోయి 93 పరుగులు చేసింది. ఆ తర్వాత దక్షిణాఫ్రికా 12.4 ఓవర్లలోనే వికెట్లేమీ కోల్పోకుండా లక్ష్యాన్ని పూర్తి చేసింది.
తాజా వార్తలు
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్‌లో 398 మంది విద్యార్థులకు పట్టాలు..
- గణేశ్ మండపాల ఏర్పాటుకు ఆన్లైన్ నమోదు తప్పనిసరి: సీపీ సజ్జనార్
- భారత్-సౌదీ సంబంధాల బలోపేతంలో భారతీయ వ్యాపారుల పాత్ర కీలకం: కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్
- బ్రిక్స్ సదస్సు వేళ ప్రధాని మోదీ–పుతిన్ భేటీ
- QNV 2030..హరిత పరివర్తనకు ఖతార్ చర్యలు..!!
- పోలీసు అధికారిపై దాడి.. నిందితుడికి మూడేళ్ల జైలు శిక్ష..!!
- స్కూల్స్ రీఓపెన్ కు ముందు 200 ట్రాఫిక్ పెట్రోల్స్ మోహరింపు..!!
- ఒమన్‌లో పలు ప్రాంతాల్లో వర్షాలకు అవకాశం..!!
- జర్మన్ ఎంపీలతో సౌదీ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- పోలీసుల విచారణకు హాజరైన యూట్యూబర్ రమా నందన







