కృష్ణవంశీ సినిమా కోసం ముందుకు వచ్చిన చిరంజీవి

- October 26, 2021 , by Maagulf
కృష్ణవంశీ సినిమా కోసం ముందుకు వచ్చిన చిరంజీవి

హైదరాబాద్: క్రియేటివ్ దర్శకుడు కృష్ణ వంశీ ప్రస్తుతం తన తదుపరి సినిమా అయిన "రంగమార్తాండ" నిర్మాణాంతర పనులతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. మరాఠీ లో సూపర్ హిట్ అయిన సినిమా "నటసామ్రాట్" కి తెలుగు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. "రంగమార్తాండ" సినిమాలో ప్రకాష్ రాజ్ మరియు రమ్యకృష్ణ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ సినిమా ఈ ఏడాది ఆఖరులో విడుదల కానుంది. తాజాగా ఈ చిత్ర డబ్బింగ్ పనులను మొదలు పెట్టారు కృష్ణవంశీ. ఈ నేపథ్యంలోనే మెగాస్టార్ చిరంజీవి నీ బ్యాగ్రౌండ్ వాయిస్ ఇచ్చేందుకు సంప్రదించగా మెగాస్టార్ కూడా ఒప్పుకున్నారు.

ఈ విషయాన్ని షేర్ చేస్తూ మెగాస్టార్ కి కృతజ్ఞతలు కూడా సోషల్ మీడియా ద్వారా తెలిపారు కృష్ణవంశీ. శివాత్మిక, ఆదర్శ్ బాలకృష్ణ మరియు రాహుల్ సిప్లిగంజ్ ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కానీ విడుదల తేదీ గురించి మాత్రం అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది. మరోవైపు ఈ సినిమా థియేటర్లలో కాకుండా డైరెక్టుగా ఓటీటీ ప్లాట్ఫారం లో విడుదలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు పుకార్లు సృష్టిస్తున్నారు కానీ సినిమా థియేటర్లలో మాత్రమే విడుదల అవుతుంది అని దర్శక నిర్మాతలు ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశారు. మరి ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందో వేచి చూడాల్సి ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
Copyrights 2015 | MaaGulf.com