తెరుచుకున్న శబరిమల ఆలయం..

- November 16, 2025 , by Maagulf
తెరుచుకున్న శబరిమల ఆలయం..

కేరళ: కేరళలోని ప్రసిద్ధ ఆధ్యాత్మిక క్షేత్రం, అయ్యప్ప స్వామి సన్నిధానం శబరిమల అయ్యప్ప ఆలయం తెరుచుకుంది. మండల-మకరవిళక్కు తీర్థయాత్ర సీజన్ లో భాగంగా ఆలయాన్ని తెరిచారు. ప్రధాన అర్చకుడు కందరారు మహేశ్ సమక్షంలో ఆలయం తలుపులు తెరిచారు. ఆలయ ప్రధాన పూజారి అరుణ్ కుమార్ నంబూద్రి ప్రారంభ పూజ నిర్వహించారు. అనంతరం గర్భగుడి నుంచి తీసుకొచ్చిన జ్వాలను ఉపయోగించి 18 మెట్ల వద్ద పవిత్ర జ్వాలను వెలిగించారు. రేపు తెల్లవారుజామున 3 గంటలకు కొత్త పూజారులు తలుపులు తెరవడంతో తీర్థయాత్ర సీజన్ ప్రారంభం అవుతుంది. రేపటి నుంచి యాత్రికులను అయ్యప్ప దర్శనం కోసం అనుమతిస్తారు. ఆలయం తలుపులు తెరవడంతో అయ్యప్ప స్వామి నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగిపోయింది.

శబరిమలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మౌలిక సదుపాయాలను కల్పించింది కేరళ ప్రభుత్వం. అంతేకాదు శబరిమల మార్గంలో ఎక్కడికక్కడ వైద్య శిబిరాలు, తాత్కాలిక ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేసింది. పంపాబేస్‌లో 24 గంటలు వైద్య కేంద్రం పని చేస్తుందని అధికారులు తెలిపారు.

ఇక వైద్య శిబిరాలు ఎక్కడెక్కడ ఉన్నాయి? భక్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే భక్తులు అత్యవసర స్థితిలో ఎవరిని సంప్రదించాలి? అనే అంశాలపై మళయాలంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో అవగాహన కల్పిస్తున్నారు. ఈ మేరకు సూచిక బోర్డులను ఏర్పాటు చేశారు.

పంపాబేస్ నుంచి శబరిమల సన్నిధానం వరకు పలు చోట్ల ఎమర్జెన్సీ వైద్య కేంద్రాలు ఏర్పాటు చేశారు అధికారులు. ముఖ్యంగా సముద్రమట్టానికి ఎత్తులో వెళ్తున్నప్పుడు శ్వాస ఇబ్బందులు ఎదురయ్యే భక్తుల కోసం ఆక్సిజన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పథనంతిట్ట జనరల్ ఆసుపత్రిలో అత్యవసర కార్డియాలజీ చికిత్స, క్యాథ్ ల్యాబ్ చికిత్స అందుబాటులో ఉంచారు. పంపా బేస్ దగ్గర అంబులెన్స్‌లు పెట్టారు. పంపాకు సమీపంలో ఉన్న అన్ని హాస్పిటల్స్ లో వెంటిలేటర్లు, కార్డియాక్ మానిటర్లు ఉంచారు. ఇక శబరిమల చరిత్రలోనే తొలిసారి పంపాబేస్, సన్నిధానం వద్ద ఆపరేషన్ థియేటర్లను ప్రారంభించారు అధికారులు. శబరిమలకు వచ్చే మార్గాల్లో అడూర్, వడసేరిక్కర, పథనంతిట్టల్లోనూ 24 గంటలు పనిచేసే ఆస్పత్రులు అందుబాటులో ఉన్నాయి.

భక్తులకు కీలక సూచనలు..

  • వ్యాధులకు చికిత్స పొందుతున్న భక్తులు తమ వెంట వైద్య రికార్డులు తెచ్చుకోవాలి.
  • శబరి యాత్రకు కొన్ని రోజుల ముందు నుంచి నడక, తేలికపాటి వ్యాయామాలు చేయాలి.
  • పంపాబేస్ నుంచి కొండను ఎక్కేప్పుడు నిదానంగా వెళ్లాలి.అక్కడక్కడ రెస్ట్ తీసుకోవాలి.
  • కొండను ఎక్కే సమయంలో అలసటగా అనిపించినా,ఛాతిలో నొప్పి వచ్చినా, శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా అనిపించినా..తక్షణం వైద్య సాయం కోసం 04735 203232 నెంబర్ కు కాల్ చేయాలి.
  • కాచి, చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలి.భోజనానికి ముందు చేతులను శుభ్రంగా కడుక్కోవాలి.
  • విష కీటకాలు కరిస్తే వెంటనే 04735 203232 నెంబర్ కు కాల్ చేయాలి.
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com