వలసదారులకు భారీగా డబ్బు ఆదా చేసే సౌదీ కొత్త రెసిడెన్సీ పర్మిట్లు..

- November 07, 2021 , by Maagulf
వలసదారులకు భారీగా డబ్బు ఆదా చేసే సౌదీ కొత్త రెసిడెన్సీ పర్మిట్లు..

రియాద్: సౌదీ అరేబియా తాజాగా వలసదారుల కోసం తక్కువ కాలపరిమితితో కూడిన కొత్త రెసిడెన్సీ పర్మిట్లను తీసుకొచ్చింది. మూడు, ఆరు నెలల కాలపరిమితితో వీటిని జారీ చేస్తోంది. అలాగే అంతే కాలపరిమితితో రెన్యువల్ చేసుకునే వెసులుబాటు కూడా కల్పించింది. అంతేగాక దాని తాలూకు డిజిటల్ కాపీలను స్మార్ట్‌ఫోన్లలో కూడా దాచుకోవచ్చు. ఆ దేశ అంతర్గత వ్యవహారాల మంత్రి ప్రిన్స్ అబ్దుల్ అజీజ్ బిన్ సౌద్ బిన్ నైఫ్ కొత్త సర్వీసుల ప్యాకేజీలో భాగంగా వీటిని తీసుకురావడం జరిగింది. ఈ షార్ట్‌టర్మ్ రెసిడెన్సీ పర్మిట్లు ఇప్పుడు అబ్షెర్ అఫ్రాద్ (వ్యక్తిగత విభాగం) ప్లాట్‌ఫారమ్‌లో వలసదారులకు అందుబాటులో ఉన్నాయి. 

ఇక ఈ తక్కువ కాలపరిమితి నివాస అనుమతులతో అటు వలసదారులతో పాటు ఇటు యజమానులకు కూడా బాగా డబ్బు ఆదా అవుతుంది. మూడు నెలలకు అవసరమైన రెసిడెన్సీ పర్మిట్ల కోసం ఇంతకుముందులా ఏడాది మొత్తానికి రెన్యువల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మనకు ఎంత కాలానికి అవసరమో అంతే కాలపరిమితితో రెసిడెన్సీ పర్మిట్లను రెన్యువల్ చేసుకోవచ్చు. కనుక రెన్యువల్ ఫీజు కూడా తగ్గుతుంది. ఇలా యజమానికి, ప్రవాసులకు డబ్బు ఆదా అవుతుంది. అంతేగాక ఇది ఒప్పంద సంబంధాల సౌలభ్యాన్ని కూడా పెంచుతుంది. 

ఉదాహరణకు ఒక యజమాని రెసిడెన్సీ పర్మిట్(ఇఖామా) గడువు ముగియబోతున్న ప్రవాసులను నియమించుకుని.. మూడు నెలల తర్వాత రాజీనామా చేయాలనుకుంటే వారు తాజాగా తీసుకొచ్చిన కొత్త విధానం ద్వారా పూర్తి సంవత్సరానికి బదులుగా మూడు నెలల పాటు తమ ఇఖామాను పునరుద్ధరించుకోవచ్చు. అలాగే ప్రవాసుల రెసిడెన్సీ పర్మిట్ గడువు ముగిసి, ఇంకా కొన్ని నెలలు మాత్రమే కింగ్‌డమ్‌లో ఉండాల్సిన అవసరం ఉన్నట్లయితే వారు తమ ఇఖామాను పూర్తి ఏడాదికి రెన్యువల్ చేసుకోవడానికి బదులుగా మూడు, ఆరు లేదా తొమ్మిది నెలలకు  పునరుద్ధరించుకోవచ్చు.

ఇక ప్రస్తుతం వర్క్ పర్మిట్ల రెన్యువల్ కోసం యజమానులు ప్రవాస రుసుము కింద నెలకు 800 సౌదీ రియాల్ లేదా సంవత్సరానికి 9,600 సౌదీ రియాల్ చెల్లిస్తున్నారు. కాగా, డిపెండెంట్‌లను కలిగి ఉన్న ప్రవాసులు ప్రతి డిపెండెంట్‌కు నెలకు 400 సౌదీ రియాల్ చెల్లించాలి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com