రామాయణం భారతీయ సంస్కృతికి చుక్కాని వంటిది: ఉపరాష్ట్రపతి
- November 18, 2021
హైదరాబాద్: హక్కులను పొందడం కంటే ముందు, మన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడం అత్యంత ఆవశ్యకమని, మర్యాద పురుషోత్తముడైన శ్రీరాముని జీవితం ఈ విషయాన్నే తెలియజేస్తోందని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. భారతీయ సంస్కృతికి చుక్కానిగా నిలిచిన రామాయణం నుంచి, శ్రీరాముని జీవితం నుంచి యువత స్ఫూర్తి పొందాలని ఆయన ఆకాంక్షించారు.
హైదరాబాద్ లోని దసపల్లా హోటల్ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికారి కొమండూర్ శశికిరణ్ రచించిన శ్రీమద్రామాయణం (పద్యకావ్యం) పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈతరం యువతకు అర్ధమయ్యే విధంగా సులభమైన పదాలతో, పద్యాల రూపంలో రామాయణాన్ని రచించిన రచయితను, ప్రచురించిన ఎమెస్కో బుక్స్ కు ఆయన అభినందనలు తెలియజేశారు.
రామాయణం అంటే రాముడి కథ మాత్రమే కాదని, మనిషిగా పుట్టి, మనిషిగా జీవించి, మనిషి ఎలా బతకాలో దిశానిర్దేశం చేసిన మహనీయుని జీవితమన్న ఉపరాష్ట్రపతి, మనిషి జీవితంలోని వివిధ సందర్భాల్లో ఎలా వ్యవహరించాలో, వివిధ అనుబంధాలకు ఎలాంటి గౌరవాన్ని ఇవ్వాలో ఆయన గాధ తెలియజేస్తుందన్నారు. భారతీయ కుటుంబ వ్యవస్థకు ప్రతిబింబంగా, పితృవాక్పరిపాలకుడిగా, సత్యవాక్పరిపాలకుడిగా, ఏకపత్నీవ్రతుడిగా, సోదరులకు, నమ్మిన వారికి ఆప్యాయతను పంచినవాడిగా, ఆదర్శ పాలకుడిగా ఆదర్శంగా నిలిచిన శ్రీరాముడు, ఎన్ని కష్టాలు ఎదురైనా ధర్మాన్ని మాత్రమే పాటిస్తూ, ప్రతి అడుగులోనూ ఆదర్శవంతమైన జీవితాన్ని గడిపిన పురుషోత్తముడని తెలిపారు.
రామాయణ, భారత, భాగవతాలు వయసు మళ్ళిన వారు చదివే పుస్తకాలనే ఓ ప్రతికూల భావన ప్రజల్లో ఉందని, ఇది ఎంత మాత్రం వాస్తవం కాదన్న ఉపరాష్ట్రపతి, ఇవన్నీ యువతకు దిశానిర్దేశం చేయగలిగే కాలాతీత గ్రంథాలని తెలిపారు. రామాయణాన్ని మతానికి చెందిన గ్రంథంగా చూడడం తగదన్న ఆయన, విద్యార్థులకు పాఠ్యప్రణాళికలో భాగంగా రామాయణాన్ని బోధించాలని సూచించారు. మన గ్రంథాలను సరైన వారిద్వారా, సరైన మార్గంలో తెలుసుకోవడం అత్యంత ఆవశ్యకమన్న ఆయన, నాయకత్వ లక్షణాలు, నిర్వహణా చాతుర్యం, సుపరిపాలన, వనరులను సరైన విధంగా వినియోగించుకునే సామర్థ్యం, వ్యాపార సంబంధాలను, వ్యూహాత్మక పరిచయాలను పెంపొందించుకోవడం వంటి విజయానికి అవసరమైన వృత్తి పరమైన కీలక నైపుణ్యాలను శ్రీరాముని గాధ మనకు బోధిస్తుందని తెలిపారు.
శ్రీరాముడు తనకోసం ఎన్నడూ జీవించలేదని, ఎల్లవేళలా సమాజం కోసమే సాగిన నిస్వార్ధమైన జీవతం ఆయనదని తెలిపిన ఉపరాష్ట్రపతి, సమస్త మానవాళికి ఇదే ప్రేరణ, ఆదర్శం కావాలని తెలిపారు.ప్రకృతితో కలిసి జీవించే విషయంలోనూ, తనకు సాయం చేసిన వారికి కృతజ్ఞత తెలపడంలోనూ, సమస్త జీవకోటి పట్ల సమభావన కలిగి ఉండడంలోనూ రాముడి జీవితం యువతకు దిశానిర్దేశం చేస్తుందన్న ఆయన, జాతి-వర్ణ వివక్ష లేని సమాజ నిర్మాణం దిశగా శ్రీరాముని జీవితం ఆదర్శదర్శనం చేయిస్తుందని, కుల, మత భేదాలు, వైషమ్యాలను పక్కనపెట్టి అందరం భారతీయులమేనన్న భావనతో ముందుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ శ్రీరాముడు చూపిన బాటను అనుసరించాల్సిన అవసరం ఉందని సూచించారు.
శ్రీరాముని దేశభక్తిని ప్రత్యేకంగా ప్రస్తావించిన ఉపరాష్ట్రపతి, మాతృభూమిపై శ్రీరాముని ప్రేమను, ఆయన దేశభక్తిని వర్ణించడానికి మాటలు చాలవని, సువర్ణమయమైనప్పటికీ లంకా నగరములో ఉండటం తనకు రుచించదని, జన్మభూమిని మించిన స్వర్గము మరొకటి ఉండదంటూ మాతృభూమి విశిష్టతను తెలిపిన రామాయణ వాక్యాలను ప్రస్తావించారు.ఉపాధి అవకాశాల కోసం ఏదేశమేగినా, ఎంత ఎత్తుకు ఎదిగినా, జన్మనిచ్చిన దేశాన్ని సుసంపన్నం, సుభిక్షం చేసుకోవడానికి మన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాలనే సందేశాన్ని రామావతారం మనకు బోధిస్తుందని, సమృద్ధమైన, సశక్తమైన దేశ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యతని, తన దేశాన్ని ప్రేమించిన ఒక పౌరుడిగా రాముడు ఈ జాతికి సందేశాన్నిచ్చారని ఉపరాష్ట్రపతి తెలిపారు.
శ్రీమద్రామాయణం భారతీయ సంస్కృతికి చుక్కానివంటిందన్న ఉపరాష్ట్రపతి, మన భాషను కాపాడుకోవడం ద్వారానే మన సాహిత్యాన్ని, తద్వారా మన సంస్కృతిని కాపాడుకోవచ్చన్నారు. భాషతో పాటు, తెలుగు వారికి మాత్రమే ప్రత్యేకమైన పద్యాన్ని ఆదరించి, అలవాటు చేసుకోవాలన్న ఆయన, భాష భోజనమైతే... పద్యం విందుభోజనమని తెలిపారు. మన సాహిత్య వారసత్వాన్ని కొనసాగించాలంటే... ఇలాంటి పుస్తకాల పఠనం మన ఇళ్ళ నుంచే మొదలు కావాలని సూచించారు. అప్పుడే మన భాషా సంస్కృతుల వ్యాప్తి, పరిరక్షణ సాధ్యమౌతాయని సూచించారు.
రామాయణం లాంటి మహా కావ్యాలను రాయాలంటే ఎంతో మానసిక పరిపక్వత అవసరమన్న ఉపరాష్ట్రపతి, రామాణం రాయని వారు కవులు కారు అనే లోకోక్తి ఉన్నప్పటికీ చాలా మంది ఐదుపదులు దాటే వరకూ రామాయణం జోలికి పోరని,శశికిరణ్ మాత్రం మూడుపదులవయసులోనే మొదలు పెట్టి, నాలుగు పదులకే పూర్తి చేయడం అభినందనీయమని తెలిపారు. గణ, యతి, వ్యాకరణ నియమాలు పాటిస్తూ... పూర్తిగా ఛందోబద్ధమైన సాహిత్య లక్షణాలు పాటిస్తూ...ప్రజల వాడుక భాషలో రామాయణ మహాకావ్యం రాసిన రచయిత ప్రయత్నం యువతకు ప్రేరణాత్మకమని తెలిపారు. ఇదే కోవలో యువత నుంచి మరిన్ని పుస్తకాలు రావాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా పుస్తక ప్రచురణకర్తలు ఎమెస్కో బుక్స్ కు అభినందనలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో పుస్తక రచయిత శశికిరణ్, శృంగేరి ఆస్థాన పండితులు బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి, ఎమెస్కో సి.ఈ.ఓ విజయకుమార్, సంపాదకులు చంద్రశేఖర్ రెడ్డి సహా పలువురు తెలుగు భాషాభిమానులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.



తాజా వార్తలు
- దక్షిణాఫ్రికా చేతిలో ఘోరంగా ఓడిపోయిన భారత్
- వాహనాల పైకప్పుల పై కూర్చోవడం డేంజర్, క్రైమ్..!!
- సోహార్లో చోరీ కేసులో ఇద్దరు అరెస్టు..!!
- దుబాయ్ లో బెగ్గర్ అరెస్ట్.. నగదు చూసి పోలీసులు షాక్..!!
- సౌదీ అరేబియాలో 14,893 మంది బహిష్కరణ..!!
- ట్రాన్సిట్, టూరిజం పాలసీపై సమీక్షకు సన్నాహాలు..!!
- ప్రవాసుల లా సేవల పై కువైట్ బార్ అసోసియేషన్ సీరియస్..!!
- భారతీయ విశ్వవిద్యాలయాలు ‘రోబోడాగ్’ నుంచి ఏం నేర్చుకోవాలి: BITS వైస్ ఛాన్సలర్ రాంగోపాల్ రావు
- ట్రంప్ టారిఫ్ దెబ్బ, దిగుమతుల పై 15% సుంకం ప్రకటింపు
- టీబీజేపీ ప్రెసిడెంట్ రాంచందర్ రావు అరెస్ట్..









