‘రాజ్ కపూర్ – ది మాస్టర్ ఎట్ వర్క్’ పుస్తకాన్ని విడుదల చేసిన ఉపరాష్ట్రపతి

- December 14, 2021 , by Maagulf
‘రాజ్ కపూర్ – ది మాస్టర్ ఎట్ వర్క్’ పుస్తకాన్ని విడుదల చేసిన  ఉపరాష్ట్రపతి

న్యూఢిల్లీ: సినిమా రంగం లక్ష్యం వినోదం మాత్రమే కారాదని… యువతలో నీతి, నైతికవర్తన, దేశభక్తి, మానవత్వాన్ని పెంపొందించేలా సినిమాలు తీయాలని చిత్ర నిర్మాతలకు ఉపరాష్ట్రపతి  ముప్పవరపు వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. ప్రముఖ సినీ దర్శకుడు రాహుల్ రావైల్ రచించిన రాజ్ కపూర్ – ది మాస్టర్ ఎట్ వర్క్ పుస్తకాన్ని ఈ రోజు న్యూఢిల్లీలో ఉపరాష్ట్రపతి ఆవిష్కరించారు. ఓ ఉన్నత లక్ష్యంతో సినిమాలు నిర్మించడం ద్వారా యువతను చైతన్యవంతం చేయాలని ఉద్ఘాటించారు. సినిమా ద్వారా కులతత్వం, అవినీతి, లింగ వివక్ష, సామాజిక వివక్ష వంటి దురాచారాలపై పోరాడాలని పిలుపునిచ్చిన ఆయన, చలనచిత్రాల్లో హింసాత్మక సన్నివేశాల చిత్రీకరణ, బోల్డ్ నెస్ పేరిట అసభ్య చిత్రణ వంటివి యువత మనస్సులను ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయని తెలిపారు.

భారతీయ చిత్రాలను ప్రపంచవ్యాప్తంగా వీక్షిస్తున్నారని పేర్కొన్న ఉపరాష్ట్రపతి, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రవాస భారతీయులను సినిమా తమ మూలాలతో కలుపుతోందని, ఈ దిశగా  సాంస్కృతిక వారధిని నిర్మిస్తోందని తెలిపారు. ఈ నేపథ్యంలో మన ఉన్నతమైన నాగరికత, సంప్రదాయలు, విలువలు, ధర్మాలకు సినిమాల్లో పెద్ద పీట వేయాలని, ఆయా అంశాల స్ఫూర్తికి భంగం కలిగించే సన్నివేశాలకు తమ సినిమాల్లో చోటు కల్పించే ప్రయత్నం చేయవద్దని నిర్మాతలకు సూచించారు.

హిందీ చిత్ర సినిమా ఘనతను సగర్వంగా చాటిచెప్పిన రాజ్ కపూర్ జీవితానికి సంబంధించిన అద్భుతమైన జ్ఞాపకాలతో పుస్తకాన్ని తీసుకొచ్చిన రాహుల్ రావైల్, ప్రణికా శర్మలను ఉపరాష్ట్రపతి అభినందించారు.రాజ్ కపూర్ దూరదృష్టి గల మేధావి, బహుముఖ ప్రజ్ఞాశాలి అని పేర్కొన్న ఆయన, భారతీయ చలనచిత్ర పరిశ్రమకు ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని తెలిపారు.రాజ్ కపూర్ ఎన్నో సినిమాలు కీలకమైన జీవిత సారాన్ని తెలియజేసే విధంగా ఉంటాయన్న ఉపరాష్ట్రపతి, విలువలతో కూడిన అంశాలతో చిత్రించిన నాటి తరహా సినిమాలు ప్రస్తుతం రావడం లేదని తెలిపారు. 

అసాధారణ ప్రతిభాపాటవాలు కలిగిన టీమ్ – బిల్డర్ గా రాజ్ కపూర్ ను కొనియాడిన ఉపరాష్ట్రపతి, నటులు, రచయితలు, గీతరచయితలు, స్వరకర్తల్లో దాగి ఉన్న అద్భుతమైన ప్రతిభను, నైపుణ్యాన్ని వెలికితీసే ప్రత్యేకత వారిదని తెలిపారు. ‘ఆవారా హూ’ వంటి ఆయన చిత్రాల్లోని చిరస్మరణీయమైన గీతాలు భారతదేశంలోనే కాకుండా, ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో ప్రజాదరణ పొందాయని తెలిపారు. రాజ్ కపూర్ తమ చిత్రాల ద్వారా భారతీయ సినిమాను సాంస్కృతిక దౌత్యానికి వాహకంగా మార్చారని పేర్కొన్నారు. 

రాజ్ కపూర్ తమ సినిమాల్లో సామాజిక స్పృహకు పెద్ద పీట వేశారన్న ఉపరాష్ట్రపతి, డబ్బు సంపాదనే లక్ష్యంగా సినిమా మాధ్యమం మారుతుండడం, మానవతా విలువలు వేగంగా క్షీణించడం లాంటి అంశాల పట్ల ఈతరం దర్శక నిర్మాతలు దృష్టి కేంద్రీకరించాలని, సినిమాను ఆదర్శనీయ వినోద మాధ్యమంగా తీర్చిదిద్దాలని సూచించారు.తమ గురువు నివాళి అర్పించడం కోసం రావైల్ చేసిన కృషిని అభినందించిన ఉపరాష్ట్రపతి, ఈ పుస్తకం కేవలం సినిమా రంగానికి చెందిన ఔత్సాహికులు, విద్యార్థులకే గాక, భారతీయ చలనచిత్ర చరిత్ర గురించి తెలుసుకోవాలనుకునే వారి కోసం, సినీ అభిమానులకు ప్రయోజకారిగా ఉండగదలని అభిప్రాయపడ్డారు. 

న్యూఢిల్లీలోని ఇండియా హాబిటాట్ సెంటర్ లో జరిగిన ఈ కార్యక్రమంలో సినీ నటుడు రణ్ బీర్ కపూర్, కాలమిస్ట్ సుహేల్ సేథ్, బ్లూమ్స్ బరీ ఇండియాకు చెందిన మీనాక్షి సింగ్ తదితరులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com