ప్రధాని మోదీకి భద్రతా వైఫల్యం అంశాన్ని తీవ్రంగా పరిగణించిన సుప్రీంకోర్టు

- January 07, 2022 , by Maagulf
ప్రధాని మోదీకి భద్రతా వైఫల్యం అంశాన్ని తీవ్రంగా పరిగణించిన సుప్రీంకోర్టు

న్యూ ఢిల్లీ: భారత ప్రధాని నరేంద్రమోదీకి పంజాబ్ లో తలెత్తిన భద్రతా వైఫల్యంపై సుప్రీం కోర్టులో శుక్రవారం విచారణ చేపట్టారు. సీనియర్ న్యాయవాది మనిందర్ సింగ్ వేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా ప్రధాని ప్రయాణ వివరాలు సేకరించి భద్రపరచాలని హర్యానా, పంజాబ్ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ను ఆదేశించిన సుప్రీంకోర్టు ధర్మాసనం..విచారణను సోమవారానికి వాయిదా వేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కమిటీల విచారణను సోమవారం వరకు నిలిపివేయాలని సుప్రీంకోర్టు సూచించింది. ప్రధాని పంజాబ్ పర్యటన భద్రతాలోపాలకు సంబంధించిన అన్ని ఆధారాలు, రికార్డలు సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ జనరల్ కు అందజేయాలని సూచించిన ధర్మాసనం, అందుకు పంజాబ్ ప్రభుత్వం, పోలీస్ అధికారులు, స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూపు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లోని ఇతర దర్యాప్తు సంస్థలు సహకరించాలని ఆదేశించింది. దర్యాప్తుపై చండీఘడ్ డైరెక్టర్ జనరల్, నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ అధికారి ఇద్దరూ నోడల్ ఆపీసర్లుగా వ్యవహరించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

ప్రధాని భద్రతా వైఫల్యం పై అత్యవసరంగా విచారణ చేపట్టాలంటూ గురువారం నాడు సీనియర్ న్యాయవాది మనిందర్ సింగ్ పిటిషన్ వేయగా..సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. అటార్నీ జనరల్, సొలిసిటర్ జనరల్, పంజాబ్ అడ్వకేట్ జనరల్, పిటిషనర్ తరఫు న్యాయవాదులు తమ వాదనలు వినిపించగా, పంజాబ్ ప్రభుత్వం తరఫున ఆ రాష్ట్ర అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపించారు. రిటైర్డ్ హైకోర్టు జడ్జి నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేశామని, విచారణ జరుగుతోందని చెప్పిన పంజాబ్ అడ్వకేట్ జనరల్, స్వతంత్ర కమిటీ విచారణ జరుపుతోందని.. అన్ని విషయాలు వెలుగులోకివస్తాయని సుప్రీం కోర్టుకు తెలిపారు. లోపాలు SPG వైపునున్నాయా, పంజాబ్ పోలీసులవైపు ఉన్నాయా అనే విషయం తేలాల్సి ఉందని అన్నారు.

సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తన వాదనలు వినిపిస్తూ.. తీవ్ర తప్పిదం జరిగిందని, జరిగిన దానివెనుక ఉగ్రవాద హస్తాన్ని తోసిపుచ్చలేమని అన్నారు. అన్ని విషయాలు, రికార్డులు రేపు కోర్టుకు సమర్పించడంతో పాటు తాము ఆందోళన చెందుతున్న విషయాలను కూడా కోర్టు దృష్టికి తీసుకువస్తామన్నా తుషార్ మెహతా.. విచారణను సోమవారం వరకు వాయిదా వేయాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కమిటీలు సోమవారం వరకు విచారణ జరుపుతున్నందున, తదనంతరం కోర్టు ఆదేశాలు ప్రకారం నడుచుకుంటామని పంజాబ్ అడ్వకేట్ జనరల్ పేర్కొన్నారు. దీంతో అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్న సుప్రీం ధర్మాసనం ..విచారణను సోమవారానికి వాయిదా వేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com