సంగీత పరికరాలను ధ్వంసం చేస్తున్న తాలిబన్లు

- January 16, 2022 , by Maagulf
సంగీత పరికరాలను ధ్వంసం చేస్తున్న తాలిబన్లు

కాబుల్: తాలిబన్ల చేతిలో చిక్కుకున్న ఆఫ్ఘనిస్తాన్ లో వికృత క్రీడలు రాజ్యమేలుతున్నాయి. షరియా ఇస్లాం మత చట్టాలను బలవంతంగా ప్రజలపై రుద్దుతున్న తాలిబన్లు ఆఫ్ఘన్ లో ఇప్పటికే అరాచకాలు సృష్టిస్తున్నారు. రోజురోజుకి రెచ్చిపోతున్న తాలిబన్ వ్యవహారశైలితో దేశ ప్రజలు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బ్రతుకుతున్నారు. ఇటీవల ఇళ్లల్లో ఉండే బొమ్మలు, విగ్రహాలు, బట్టల దుకాణాల్లో ఉండే బొమ్మల తలలను నరికివేయాలంటూ హుకుం జారీ చేసిన తాలిబన్లు.. తాజాగా సంగీత వాయిద్యపరికరాలను ధ్వంసం చేయాలనీ పిలుపునిచ్చారు. ప్రజల వద్దనున్న సంగీత పరికరాలను, పాటల రికార్డులను నాశనం చేయాలంటూ తాలిబన్ నేతలు ఆదేశాలు జారీ చేశారు. పెళ్ళిళ్ళలోనూ లౌడ్ మ్యూజిక్ ఉండకూడదని, వరుడు వధువు వేర్వేరు గదుల్లో ఉండి నిఖా చేసుకోవాలని హుకుం జారీ చేశారు.

ఇటీవల ఆఫ్ఘనిస్తాన్‌లోని పాక్టియా ప్రావిన్స్, జజాయిఅరుబ్ జిల్లాలో ఒక సంగీత వాయిద్యకారుడి ఇంటిపై దాడి చేసిన తాలిబన్లు.. అతణ్ణి బయటకు ఈడ్చుకొచ్చి దారుణంగా కొట్టారు. అనంతరం అతని వద్దనున్న హార్మోనియం పెట్టెను తగలబెట్టిన తాలిబన్లు..మంటల్లో కాలుతున్న వాయిద్య పరికరాన్ని కన్నార్పకుండా చూడాలంటూ ఆ కళాకారుడిపై పైశాచికత్వాన్ని ప్రదర్శించారు. ఈ వికృత క్రీడను తాలిబన్లు వీడియో తీయడం గమనార్హం. “ఇలాంటి ఎన్నో దారుణ ఘటనలు తాలిబన్ రాజ్యంలో చోటుచేసుకుంటున్నాయంటూ” ఆఫ్ఘనిస్తాన్ కు చెందిన సీనియర్ జర్నలిస్ట్ ఒకరు ఆ దృశ్యాలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com