12 దేశాల వారికి యూఏఈ శుభవార్త...

- January 27, 2022 , by Maagulf
12 దేశాల వారికి యూఏఈ శుభవార్త...

యూఏఈ: కరోనా కొత్త వేరియంట్ ఒమైక్రాన్ విజృంభణ నేపథ్యంలో ఆఫ్రికన్ దేశాలపై విధించిన ప్రయాణ ఆంక్షలను యూఏఈ ఎత్తి వేసింది.ఈ నేపథ్యంలో జనరల్ సివిల్ ఏవియేషన్ అథారిటీ (GCAA), నేషనల్ ఎమర్జెన్సీ క్రైసిస్ అండ్ డిజాస్టర్స్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ అథారిటీ (NCEMA) కీలక ప్రకటన చేశాయి. ఆయా దేశాలకు యూఏఈ నుంచి రాకపోకలు కొనసాగించే అన్ని ఇన్‌బౌండ్ విమానాలతో పాటు జాతీయ, అంతర్జాతీయ క్యారియర్స్, ట్రాన్సిట్ విమాన సర్వీసులకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాయి. 12 దేశాలకు జనవరి 29 తేదీన మధ్యాహ్నం 2.30 గంటల నుంచి విమాన సర్వీసులు తిరిగి ప్రారంభమవుతాయని తెలిపాయి. ఈ జాబితాలో కెన్యా, టాంజానియా, ఇథియోపియా, నైజీరియా, రిపబ్లిక్ ఆఫ్ కాంగో, దక్షిణాఫ్రికా, బోట్స్వానా, ఈశ్వతిని, లెసోతో, మొజాంబిక్, నమీబియా, జింబాబ్వే ఉన్నాయి. అలాగే  మరో మూడు దేశాలకు చెందిన ప్రయాణికులకు కూడా దేశంలో ఎంట్రీకి యూఏఈ అనుమతి ఇచ్చింది. ఉగాండా, ఘనా, రువాండా దేశాల ప్రయాణికులు కూడా యూఏఈ రావొచ్చు. 

కాగా, ఈ 15 దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు 48 గంటల ముందు తీసుకున్న కోవిడ్ నెగెటివ్ సర్టిఫికేట్ చూపించడం, యూఏఈ చేరుకున్న తర్వాత విమానాశ్రయంలో మళ్లీ ర్యాపిడ్ పీసీఆర్ టెస్టు చేయించుకోవడం వంటి కరోనా నిబంధనలు పాటించడం తప్పనిసరి. ఇక కోవిడ్-19 లక్షణాలతో బాధపడుతున్న వారు ప్రయాణం చేయకపోవడం మంచిదని జీసీఏఏ, ఎన్‌సీఈఎంఏ సూచించాయి. యూఏఈ ప్రయాణ ఆంక్షలను తొలిగిస్తూ తీసుకున్న నిర్ణయం పట్ల 15 దేశాల ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com