ఐపీఎల్ మెగా వేలంలో ఆ ఒక్కడే మిగిలాడు...

- February 03, 2022 , by Maagulf
ఐపీఎల్ మెగా వేలంలో ఆ ఒక్కడే మిగిలాడు...

ఐపీఎల్ 2022 మెగా వేలానికి 590 మంది ప్లేయర్లు షార్ట్ లిస్ట్ చేయబడ్డారు. ఇందులో 370 మంది భారత క్రికెటర్లు కాగా, 220 మంది విదేశీ ప్లేయర్లు. 2008 నుంచి ఇప్పటివరకూ 14 సీజన్లు జరగగా, 15వ సీజన్‌ వరకూ మిస్ అవ్వకుండా ఆడబోయే ప్లేయర్ల సంఖ్య వేళ్ల మీద లెక్కబెట్టేయొచ్చు...

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రాబిన్ ఊతప్ప, ఎమ్మెస్ ధోనీ, దినేశ్ కార్తీక్ వంటి భారత ప్లేయర్లు... 2008 నుంచి 2021 వరకూ ప్రతీ సీజన్‌లోనూ పాల్గొన్నారు. ఈ సారి మెగా వేలంలో కూడా పాల్గొనబోతున్నారు...

విదేశీ ప్లేయర్ల విషయంలో మాత్రం ఈ లెక్క తప్పింది. ఇప్పటిదాకా గత 14 సీజన్లలో నలుగురు విదేశీ ప్లేయర్లు, ఒక్క సీజన్ కూడా మిస్ కాకుండా పాల్గొన్నారు. అయితే ఈసారి ఈ లిస్టులో ఒకే ఒక్క ప్లేయర్ మిగిలాడు...

కెరీర్ ఆరంభంలో మూడేళ్ల పాటు ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టుకి ఆడిన ఏబీ డివిల్లియర్స్, ఆ తర్వాత 11 సీజన్ల పాటు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో కీలక ప్లేయర్‌గా మారాడు...

గత సీజన్‌లో కూడా ఒంటి చేత్తో మ్యాచులను మలుపు తిప్పిన ‘మిస్టర్ 360’, ఈసారి ఐపీఎల్‌లో పాల్గొనడం లేదు. అన్ని ఫార్మాట్ల క్రికెట్‌తో పాటు ఫ్రాంఛైజీ క్రికెట్ నుంచి కూడా తప్పుకుంటూ నిర్ణయం తీసుకున్నాడు ఏబీ డివిల్లియర్స్...

‘యూనివర్సల్ బాస్’ క్రిస్ గేల్ కూడా ఈసారి మెగా వేలానికి రిజిస్టర్ చేసుకోలేదు. కేకేఆర్ తరుపున రెండు సీజన్లు, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరుపున 8 సీజన్లు ఆడిన క్రిస్ గేల్, గత మూడు సీజన్లు పంజాబ్ కింగ్స్ తరుపున ఆడాడు...

42 ఏళ్ల క్రిస్ గేల్, త్వరలో అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు అన్ని రకాల క్రికెట్ నుంచి కూడా తప్పుకోవాలని భావిస్తున్నట్టు, అందుకే ఐపీఎల్‌లో పాల్గొనేందుకు ఆసక్తి చూపించడం లేదని సమాచారం...

ఐపీఎల్‌ కెరీర్‌లో 140 మ్యాచులు ఆడిన క్రిస్ గేల్, 6 సెంచరీలు, 31 హాఫ్ సెంచరీలతో 4965 పరుగులు చేశాడు... ఇందులో ఐదు సెంచరీలు కేవలం ఆర్‌సీబీ తరుపునే చేశాడు క్రిస్ గేల్...

ఆస్ట్రేలియా సీనియర్ బ్యాట్స్‌మెన్ షాన్ మార్ష్ కూడా ఐపీఎల్ 2022 మెగా వేలానికి రిజిస్టర్ చేయించుకోలేదు. 38 ఏళ్ల షాన్ మార్ష్, 2008 నుంచి 17 వరకూ 10 సీజన్ల పాటు పంజాబ్ కింగ్స్ తరుపున ఆడాడు...

2018 నుంచి గత నాలుగు సీజన్లలోనూ షాన్ మార్ష్‌ను ఐపీఎల్‌లో ఏ ఫ్రాంఛైజీ కూడా కొనుగోలు చేయలేదు. అయినా తన పేరును రిజిస్టర్ చేయించుకుంటూ వచ్చిన మార్ష్, ఈసారి మెగా వేలానికి తన పేరు రిజిస్టర్ చేసుకోలేదు...

క్రిస్ గేల్, ఏబీ డివిల్లియర్స్, షాన్ మార్ష్ తప్పుకోవడంతో ఐపీఎల్ 2008 నుంచి 2022 వరకూ అన్ని సీజన్లలో రిజిస్టర్ అయిన ప్లేయర్‌గా డ్వేన్ బ్రావో రికార్డు క్రియేట్ చేయబోతున్నాడు...

2008 నుంచి మూడు సీజన్లలో ముంబై ఇండియన్స్ ఆడిన డ్వేన్ బ్రావో, ఆ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ తరుపున ఆడాడు. మధ్యలో గుజరాత్ లయన్స్ తరుపున ఆడిన డ్వేన్ బ్రావో, ఈసారి మెగా వేలంలోనూ పాల్గొనబోతున్నాడు...

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com