ఉక్రెయిన్​లో వరుస పేలుళ్లు...

- February 24, 2022 , by Maagulf
ఉక్రెయిన్​లో వరుస పేలుళ్లు...

ఉక్రెయిన్‌ పై మిలటరీ ఆపరేషన్‌కు దిగుతున్నట్లు రష్యా ప్రకటించిన వెంటనే సైనిక బలగాలు రంగంలోకి దిగాయి.ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై పేలుళ్లు జరిపాయి. అక్కడి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని బలగాలు ఆక్రమించాయి.బోరిస్పిల్ ప్రాంతంలోనూ బాంబు దాడులు జరిగినట్టు చాలా మంది సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.మరోవైపు ఉక్రెయిన్‌లో అతిపెద్ద రెండో నగరం ఖార్కివ్‌నూ రష్యా బలగాలు టార్గెట్ చేశాయి. మరోవైపు మరియపోల్, దినిప్రో, క్రమటోర్ప్క్, ఒడెస్సా, జపోర్గియా నగరాల్లోనూ రష్యా బలగాలు దాడులకు పాల్పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

అయితే ఉక్రెయిన్‌లోని కీలక నగరాలపై దాడులు చేస్తున్నట్లు వచ్చిన వార్తలను రష్యా ఖండించింది. ప్రజలు, జనావాసాలు తమ లక్ష్యం కాదని స్పష్టం చేసింది. కేవలం సైనిక స్థావరాలు, ఎయిర్ డిఫెన్స్, ఉక్రెయిన్ ఎయిర్ ఫోర్స్‌ను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నామని తెలిపింది. అతి కచ్చితత్వంతో టార్గెట్ ఛేదించే ఆయుధాలనే వాడుతున్నామని పేర్కొంది. మరోవైపు ఉక్రెయిన్ విషయంలో సంయమనం పాటించాలన్న ప్రపంచ దేశాల విజ్ఞప్తిని రష్యా పట్టించుకోలేదని నాటో ఆగ్రహం వ్యక్తం చేసింది. స్వతంత్ర దేశంపై యుద్ధంతో ఆ దేశ సార్వభౌమాధికారంపై దాడి చేస్తోందని పేర్కొంది. అంతర్జాతీయ చట్టాలకు వ్యతిరేకంగా పుతిన్ వ్యవహరిస్తున్నారని ఆక్షేపించింది. యుద్ధంతో సాధారణ పౌరుల జీవితాలు ప్రమాదంలో పడతాయని ఆందోళన వ్యక్తం చేసింది. రష్యాపై చర్యకు నాటో సభ్య దేశాల నిర్ణయం ప్రకారం స్పందిస్తామని తెలిపింది.

రష్యా, ఉక్రెయిన్ మధ్య పరిణామాలపై ఐక్యరాజ్యసమితి అత్యవసరంగా సమావేశమైంది. ఈ భేటీకి వివిధ దేశాల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మాట్లాడుతూ.. తాజా పరిణామాలను గమనిస్తున్నామని తెలిపారు. రేపు జీ7 దేశాలతో భేటీ అవుతామని చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com