సమగ్ర, సమాన, నాణ్యమైన విద్య ప్రతి విద్యార్థి హక్కు: ఉపరాష్ట్రపతి

- February 26, 2022 , by Maagulf
సమగ్ర, సమాన, నాణ్యమైన విద్య ప్రతి విద్యార్థి హక్కు: ఉపరాష్ట్రపతి
బెంగళూరు: సమజంలోని ప్రతి విద్యార్థికీ సమగ్రమైన, సమానమైన, నాణ్యమైన విద్యను పొందే హక్కు ఉందని భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఇందుకోసం సమాజంలోని వెనుకబడిన వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంలో ప్రైవేటు విద్యాసంస్థలు క్రియాశీలకమైన పాత్రను పోషించాలని ఆయన సూచించారు. అలాంటి విద్యార్థులకు సరైన మద్దతునందించడం ప్రాధాన్యతాంశంగా పరిగణించాలన్నారు.
 
బెంగళూరు శివార్లలోని గ్రీన్ వుడ్ హై ఇంటర్నేషనల్ స్కూలు ఆవరణలో అత్యాధునిక వసతులతో ఏర్పాటుచేసిన ఇండోర్ స్పోర్ట్స్ ఎరీనాను శనివారం ఉపరాష్ట్రపతి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ.. చిన్నారుల్లో బాల్యంనుంచే సేవాభావాన్ని పెంపొందించాలని ఇందుకోసం పాఠ్యప్రణాళికలో సమాజ సేవను భాగం చేయాల్సిన అవసరం ఉందన్నారు. దీని ద్వారా భవిష్యత్తులో తాము సంపాదించిన దాన్ని తిరిగి సమాజంతో పంచుకోవాలన్న భావన వారిలో పెరుగుతుందన్నారు.
 
విద్యతోపాటు క్రీడలు, కళలు, ఇతర మనోరంజకమైన కార్యక్రమాలకు కూడా సరైన ప్రాధాన్యత ఇవ్వాలన్న ఉపరాష్ట్రపతి, ఇలా చేయడం ద్వారానే విద్యార్థిలో సర్వతోముఖాభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. దీంతోపాటుగా విద్యార్థుల్లో చదువులు, వారి భవిష్యత్తుపై విశ్వాసం పెరుగుతుందన్నారు. మొక్కలు నాటడం, వాటిని సంరక్షించడం, జల సంరక్షణ తదితర అంశాల్లోనూ విద్యార్థులను భాగస్వాములు చేయాలని ఉపరాష్ట్రపతి విద్యాసంస్థలకు సూచించారు. తద్వారా పిల్లలకు ప్రకృతితో అనుబంధం ఏర్పడుతుందని ఇది వారికి సరికొత్త శక్తినందిస్తుందన్నారు.
 
నూతన జాతీయ విద్యావిధానం – 2020 కూడా చదువుతోపాటు క్రీడలు, కళలు తదితర అంశాల్లో విద్యార్థులను ప్రోత్సహించాలని సూచిస్తోందన్న విషయాన్ని ఉపరాష్ట్రపతి గుర్తుచేశారు. అన్ని రాష్ట్రాలు ఈ విధానాన్ని అమలుచేస్తూ క్రీడలు, కళలు, నైతిక విలువలు, ప్రకృతితో మమేకమవడం వంటివాటిని ప్రోత్సహించాలని సూచించారు.
 
ఇటీవల కాలంలో సమాజంలో విలువల పతనంపై ఆవేదన వ్యక్తం చేసిన ఉపరాష్ట్రపతి విద్యార్థులు నాగరిక విలువలను పెంపొందించుకోవాలని, భారతదేశ వైభవోపేతమైన చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించుకోవాలని సూచించారు. జాతీయవాదాన్ని గుండెలో నింపుకుని దేశాభివృద్ధి కోసం పనిచేయాలన్నారు. 
 
ఒకప్పుడు విశ్వగురువుగా వెలుగొందిన భారతదేశం తిరిగి ఆ ఉన్నతస్థానాన్ని చేరుకునేందుకు మనమంతా కృషిచేయాలని ఇందుకోసం  మనం తిరిగి  మన మూలాలను అన్వేషించి వాటికి అనుగుణంగా పనిచేయాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి అన్నారు. ప్రతి ఒక్కరూ భారతీయ భాషలను పరిరక్షించాలని ఇందుకోసం ముందుగా ప్రతి ఒక్కరూ తమ మాతృభాషను దైనందిన జీవితంలో వినియోగించాలని, కనీసం ప్రాథమిక విద్యవరకైనా విద్యాభ్యాసం కూడా తల్లిభాషలోనే జరగాలని సూచించారు. 
 
శారీరక వ్యాయాయం ప్రతి ఒక్కరికీ అత్యంత అవసరమని, ఇందుకోసం కేంద్రం ఉద్దేశించిన ఫిట్ ఇండియా ఉద్యమంలో ప్రతి పాఠశాల, కళాశాల, విశ్వవిద్యాలయం భాగస్వామ్యం కావాలన్నారు. నృత్యకళారూపాలైన భరతనాట్యం, కూచిపూడి, కథకళి వంటి వాటిని కూడా చిన్నారులకు నేర్పించాలన్నారు.
 
ఈ కార్యక్రమంలో కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గెహ్లోత్, రాష్ట్ర మంత్రి మునిరత్న, గ్రీన్ వుడ్ పాఠశాల చైర్మన్ విజయ్ అగర్వాల్, ప్రధానోపాధ్యాయుడు అలోయ్ సియస్ డి మెల్లో, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com