హైదరాబాద్‌కి భారీగా పెట్టుబడులు

- March 21, 2022 , by Maagulf
హైదరాబాద్‌కి భారీగా పెట్టుబడులు

అమెరికా: హైదరాబాద్ ఫార్మాసిటీలో ఏర్పాటుచేయబోయే ఫార్మా యూనివర్సిటీలో భాగం కావాలని ప్రఖ్యాత పరిశోధన సంస్థ స్క్రిప్స్ ను ఐటీ శాఖ మంత్రి కే.తారకరామారావు కోరారు. పాఠ్యాంశాల రూపకల్పన, బోధనా సిబ్బంది, విద్యార్థుల మార్పిడి, జాయింట్ రీసెర్చ్, జాయింట్ డిగ్రీ ప్రోగ్రామ్‌ల రూపకల్పనలో స్క్రిప్స్ తన భాగస్వామ్యాన్ని అందించాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. అమెరికా పర్యటనలో భాగంగా ఇవాళ శాండియాగోలో పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్, స్క్రిప్స్ పరిపాలక సభ్యులైన డా.జేమ్స్ విలియమ్సన్ (EVP రీసెర్చ్ అండ్ అకడమిక్ అఫైర్స్ ),మేరీవాంగ్ (స్ట్రాటజిక్ ప్లానింగ్ డైరెక్టర్), డాక్టర్. అర్నాబ్ ఛటర్జీ (VP, మెడిసినల్‌ కెమిస్ట్రీ, కాలిబర్-స్క్రిప్స్ రీసెర్చ్), ప్రొఫెసర్ సుమిత్ చందాలతో సమావేశమయ్యారు.తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాటుచేస్తున్న ఫార్మాసిటీ వివరాలను వారితో కేటీఆర్ పంచుకున్నారు.లైఫ్ సైన్సెస్ రంగంలో హైదరాబాద్ లో ఉన్న అపార అవకాశాలను వివరించారు.ప్రఖ్యాత అంతర్జాతీయ సంస్థలు హైదరాబాద్ లో తమ కార్యాలయాలు ఏర్పాటుచేయడం, ఫార్మా రంగానికి తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతలను కేటీఆర్ చెప్పారు.పరిశ్రమల ఏర్పాటు, ఈజ్ ఆఫ్ డూయింగ్ లో ఇండియాలో ఏ రాష్ట్రానికి లేని అనుకూలతలు ఒక్క తెలంగాణకు మాత్రమే ఉన్నాయని మంత్రి కేటీఆర్ స్క్రిప్స్ బృందానికి తెలిపారు.స్క్రిప్స్ పరిశోధన సంస్థతో తెలంగాణ ప్రభుత్వం కోరుకుంటున్న భాగస్వామ్య విధానంపై చర్చించారు. మంత్రి కేటీఆర్ ప్రజెంటేషన్ పై స్క్రిప్స్ బృందం ఆసక్తి కనబర్చింది. తెలంగాణ ప్రభుత్వం కోరుకుంటున్న భాగస్వామ్యం పై త్వరలోనే చర్చించి సానుకూల నిర్ణయం తీసుకుంటామని హామి ఇచ్చింది.ఆధునిక సైన్స్ పరిశోధనల్లో దూసుకుపోతున్న స్క్రిప్స్ సంస్థ విజయగాథను అధ్యయనం చేసేందుకు స్క్రిప్స్ రీసెర్చ్ టీమ్‌,  తెలంగాణ ప్రభుత్వంతో ఒక వర్కింగ్ గ్రూప్ ను ఏర్పాటుచేయాలని ఈ సమావేశంలో ప్రతిపాదించారు. 

సైన్స్ పరిశోధనల్లో ప్రపంచంలోనే అత్యంత ప్రభావవంతమైన సంస్థగా స్క్రిప్స్ రీసెర్చ్ కు పేరుంది. 2,400 మంది శాస్త్రవేత్తలు, సిబ్బంది తో పాటు 200 కంటే ఎక్కువ ప్రయోగశాలలు ఈ సంస్థకు ఉన్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రైవేట్, లాభాపేక్షలేని బయోమెడికల్ పరిశోధన సంస్థ ఇది.ఈ సంస్థకు చెందిన ఐదుగురికి ప్రఖ్యాత నోబెల్ బహుమతులు వచ్చాయి.స్క్రిప్స్ సంస్థకు దాదాపు 1,100 పేటెంట్లు ఉన్నాయి.FDA-ఆమోదిత 10 చికిత్సా విధానాలను కనుగొనడంతో పాటు 50కి పైగా స్పిన్-ఆఫ్ కంపెనీలను స్క్రిప్స్ ఏర్పాటుచేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com