బాలికలపై మాట మార్చేసిన తాలిబన్లు

- March 24, 2022 , by Maagulf
బాలికలపై మాట మార్చేసిన తాలిబన్లు

ఆఫ్ఘనిస్థాన్‌లోని తాలిబన్ ప్రభుత్వం… తమ వక్రబుద్ధి మార్చుకోవడం లేదు. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత… బాలికల విద్యకు ప్రాధాన్యత ఇస్తామని హమీ ఇచ్చింది. తమ ప్రభుత్వాన్ని ప్రపంచ దేశాలు గుర్తించడం కోసం… పలు సంస్కరణలు చేపడుతున్నట్లు గతంలో ప్రకటించారు. ఆక్రమణ తర్వాత అనేక నిబంధనలతో బాలికలు చదువుకు దూరమయ్యారు. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమవడంతో… తాలిబన్లు మాట మార్చేశారు. బాలికలకు ఉన్నత విద్య అభ్యసించేందుకు అనుమతించబోమని.. ఆరో తరగతి వరకే పరిమితం చేస్తున్నట్లు ప్రకటించారు.
 
మహిళలకు విద్య, ఉద్యోగంపై పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలని అంతర్జాతీయ సమాజం డిమాండ్లు నీటి మీద రాతలుగానే మిగిలిపోతున్నాయి. మొదట్లో అంగీకరించిన తాలిబన్లు… చివరి నిమిషంలో తమ నిర్ణయాన్ని మార్చుకున్నారు. పిల్లలను స్కూళ్లకు పంపేందుకు అక్కడి గిరిజనులు విముఖత చూపుతున్నారని చెబుతున్నారు. దీంతో బాలికలకు ఉన్నత విద్యను నిషేధిస్తున్నట్లు ప్రకటించారు. అయితే, ఈ నిషేధం తాత్కాలికమే అని, భవిష్యత్తులో వారిని అనుమతించే అవకాశం ఉందంటున్నారు. అధికారం చేపట్టినప్పటి నుంచి మహిళలపై తాలిబన్లు అనేక ఆంక్షలు విధిస్తూనే ఉన్నారు. దీంతో చాలామంది తమ ఉద్యోగాలకు దూరమయ్యారు. కొందరు కఠిన పాలనకే మొగ్గు చూపుతుంటే, మరికొందరు మాత్రం సంస్కరణలు చేపట్టడం అవసరమని వాదిస్తున్నారు. మహిళలపై విధించిన ఆంక్షలను సడలించాలని కొందరు తాలిబన్లు పట్టుబడుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com