పోలీసు ఉచిత ప్రీ రిక్రూట్‌మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ను ప్రారంభించిన సైబరాబాద్ సీపీ

- March 24, 2022 , by Maagulf
పోలీసు ఉచిత ప్రీ రిక్రూట్‌మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ను ప్రారంభించిన సైబరాబాద్ సీపీ

హైదరాబాద్: శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్ రోడ్‌లోని SS కన్వెన్షన్‌లో ఏర్పాటు చేసిన “మెగా ప్రీ రిక్రూట్‌మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రాం” ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఈరోజు సైబరాబాద్ పోలీస్ కమీషనర్ స్టీఫెన్ రవీంద్ర ప్రారంభించారు.శంషాబాద్ జోన్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో సైబరాబాద్ డీసీపీలు, ఏసీపీలు, శంషాబాద్ జోన్ ఇన్‌స్పెక్టర్లు పాల్గొన్నారు.శంషాబాద్, సైబరాబాద్‌లోని ఇతర ప్రాంతాల నుండి దాదాపు 2000 మంది విద్యార్థులు హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా ముందుగా సైబరాబాద్ సీపీ లాంఛనంగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సంధర్భంగా సీపీ మాట్లాడుతూ .. సమాజాసేవ, పోలీసుశాఖలో ఉద్యోగం చేయాలనే ఉత్సాహం ఉన్నవారిని వెలుగులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ ప్రీ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ ను ఏర్పాటు చేశామన్నారు. 

సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ లో ఈరోజు ప్రారంభించిన ఈ ఉచిత మెగా ప్రీ రిక్రూట్‌మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రాం  పోలీస్ ఉద్యోగం అంటే ఆసక్తి, అర్హత కలిగి ఉండి.. ఆర్థిక స్తోమత లేని యువత జీవితాల్లో వెలుగు నింపుతుందని చెప్పడానికి నేను సంతోషిస్తున్నానన్నారు.
తెలంగాణ ప్రభుత్వం  శాంతి భద్రతలకు అధిక ప్రాధాన్యతనిస్తుందని, ఎక్కడైతే శాంతి భద్రతలు బాగుంటాయో అప్పుడే ఎవరైనా పరిశ్రమలను స్థాపించడానికి ముందుకు వస్తారు. తద్వారా యువతకు ఉపాధి తో పాటు అభివృద్ధి జరుగుతుందన్నారు. 

పోటీ పరీక్షలకు సన్నద్ధమ్మయ్యే అభ్యర్థులు పక్కా ప్రణాళిక అమలుతోనే విజయం సాధిస్తారని తెలిపారు. అభ్యర్థులు పాత ప్రశ్నపత్రాలను అధ్యయనం చేయడంతో పాటు పోటీ పరీక్షల సరళిని క్షుణ్ణంగా అర్థం చేసుకొని విశ్లేషించుకోవాలన్నారు. అభ్యర్థులు విజయం సాధించే వరకు సరదాలు, విందువినోదాలకు దూరంగా ఉండాలన్నారు. 

ధాలరుల మాటలు నమ్మి మోసపోవద్దన్నారు. ఎవరైనా డబ్బులకు ఉద్యోగం ఇప్పిస్తామంటే నమ్మవద్దన్నారు. నియామక ప్రక్రియ మొత్తం పరాదర్శకంగా జరుగుతుందన్నారు.
అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీతో ప్రిలిమినరీ పరీక్షల కోసం శిక్షణ నిర్వహించడం, పరీక్షలు నిర్వహించడం, రెండో దశలో ఫిజికల్ ట్రైనింగ్ ఏర్పాటు చేయడంతో పాటు మూడో దశలో తుది పరీక్షల నిర్వహణ వరకూ అన్నీ చూసుకుంటాము.తల్లిదండ్రులు  పిల్లలపై ఎటువంటి ఒత్తిడి తీసుకురావద్దని.. వారిని ప్రోత్సహించాలన్నారు. యువత ఈ ఫ్రీ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ ను సద్వినియోగం చేసుకోవాలన్నారు.ఈ శిక్షణ కార్యక్రమ నిర్వహణకు సహకరించిన శంషాబాద్‌ డీసీపీకి, భాగ్య కిరణ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కోచింగ్ వారికి కృతజ్ఞతలు తెలిపారు.
అనంతరం శంషాబాద్ జోన్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకూ  24,935 పోలీసు పోస్టులను ముందస్తు నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసిన సంగతి తెలిసిందే. నిన్న ఆర్థిక శాఖ 15,575 కొత్త పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలను మంజూరు చేసింది, మరికొన్ని రోజుల్లో నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. అలాగే 538 ఎస్‌ఐ పోస్టులకు కూడా నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది.

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సూచన మేరకు సైబరాబాద్ సీపీ ఆధ్వర్యంలో సైబరాబాద్‌లోని అన్ని జోన్ లలో నిరుద్యోగ యువతకు శిక్షణా కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు.
DCP శంషాబాద్ జగదీశ్వర్ రెడ్డి నేతృత్వంలో RGIA ఇన్స్పెక్టర్ R. శ్రీనివాస్ ఆధ్వర్యంలో శంషాబాద్ జోన్లో ఈ  నమోదు కార్యక్రమాన్ని శంషాబాద్ బేగం ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. ఎన్‌రోల్‌మెంట్ కార్యక్రమాన్ని శంషాబాద్ డీసీపీ, ఏసీపీ భాస్కర్ పర్యవేక్షించారు.ఈ ఎన్‌రోల్‌మెంట్‌లో మొత్తం 2000 మందికి పైగా అభ్యర్థులు నమోదు చేసుకున్నారు, వారిలో 1500 మంది శంషాబాద్ జోన్‌కు చెందిన వారు కాగా 500 మంది ఇతర ప్రాంతాల నుండి వచ్చినవారున్నారు.శిక్షణకు హాజరయ్యేందుకు ఇంకా అభ్యర్థులు దరఖాస్తు చేసుకుంటున్నారన్నారు.

ఈరోజు జరిగిన కార్యక్రమంలో ముందుగా ఇలాంటి శిక్షణా కార్యక్రమాల ద్వారా ఎంపికైన కానిస్టేబుల్ అధికారులు అభ్యర్థులను ఉద్దేశించి తమ అనుభవాలను, విజయాలను పంచుకున్నారు. సీపీ, డీసీపీ తదితరుల ప్రసంగాల ద్వారా అభ్యర్థులు స్ఫూర్తి పొంది, ప్రేరణ పొందారు.

బాగ్య కిరణ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కోచింగ్ సహకారంతో RGIA PS ఇన్‌స్పెక్టర్ R. శ్రీనివాస్ ఈ శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.శ్రీ భాగ్యకిరణ్ ఇన్‌స్టిట్యూట్‌లు అన్ని సబ్జెక్టులలో నిపుణులైన ఫ్యాకల్టీలచే శిక్షణను అందజేస్తాయి.శిక్షణకు హాజరవుతున్న అభ్యర్థులు, వారి తల్లిదండ్రులు తమకు ఉచితంగా నాణ్యమైన శిక్షణను అందిస్తున్న సైబరాబాద్ పోలీసులకు, రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com