రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్

- March 25, 2022 , by Maagulf
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్

హైదరాబాద్: హైదరాబాద్‌లో నిత్యం రద్దీగా ఉండే రైల్వే స్టేషన్లలో కాచిగూడ రైల్వే స్టేషన్‌ ఒకటి. ఈ స్టేషన్‌ మీదుగా కర్ణాటక, తమిళనాడుకు చెందిన పలు రైళ్లు ఉత్తరాది రాష్ట్రాలకు వెళుతుంటాయి. ఉత్తర భారత దేశం, దక్షిణ భారత దేశాన్ని కలిపే ఈ స్టేషన్‌లో పెద్ద ఎత్తున ప్రయాణికులు వస్తుంటారు. రోజులో సుమారు 30 వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. ఇలా పెద్ద ఎత్తున వచ్చే ప్రయాణికుల కోసం కాచిగూడ రైల్వేస్టేషన్‌లో గతంలో ఉచిత ఇంటర్‌నెట్‌ సేవలు అందించే ఉద్దేశంతో అధికారలు ఫ్రీవైఫై ఏర్పాటు చేశారు. రైల్‌వైర్‌ సంస్థ కాచిగూడ రైల్వే స్టేషన్‌లో 2016లో ఈ సేవలకు శ్రీకారం చుట్టారు. ఫైబర్‌ నెట్‌వర్క్‌ ద్వారా హైస్పీడ్‌ బ్రాడ్‌బాండ్‌ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు.

ప్రయాణికులకు ఎంతగానో ఉపయోగపడ్డ ఈ ఉచిత ఇంటర్‌నెట్ సేవలు కరోనా కారణంగా ఆగిపోయాయి. లాక్‌డౌన్‌ సమయంలో దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లు మూతపపడంతో ఇంటర్‌నెట్ సేవలను తాత్కలికంగా నిలిపివేశారు. అయితే తాజాగా కరోనా కేసులు తగ్గడం, మళ్లీ రైలు సేవలు యదావిధిగా కొనసాగుతుండడంతో ఉచిత ఇంటర్‌నెట్ సేవలను మళ్లీ అందుబాటులోకి తీసుకొచ్చారు. రైల్వే స్టేషన్‌లోకి వచ్చిన ప్రయాణికులు ఉచితంగా ఇంటర్‌నెట్ సేవలు పొందేలా అధికారులు చర్యలు తీసుకున్నారు.

ఇందులో భాగంగానే రైల్‌వైర్‌ సంస్థ మళ్లీ వైఫై సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సేవలను వినియోగించుకోవాలనుకునే ప్రయాణికులు ముందుగా స్మార్ట్‌ ఫోన్ లేదా ల్యాప్‌టాప్‌లో వైఫైని ఓపెన్‌ చేయాలి. అనంతరం రైల్‌వైర్‌ సిగ్నల్ కనెక్ట్ కావాలి. ఫోన్‌ నెంబర్‌ ఎంటర్‌ చేసి లాగిన్‌ అయితే మొబైల్‌ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీని ఎంటర్‌ చేసి అరగంట పాటు ఉచితంగా ఇంటర్‌నెట్‌ సేవలను ఉపయోగించుకోవచ్చు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com