సింగపూర్ లో ఉగాది ప్రత్యేక పూజలు మరియు శ్రీవారి కళ్యాణ మహోత్సవం

- April 06, 2022 , by Maagulf
సింగపూర్ లో ఉగాది ప్రత్యేక పూజలు మరియు శ్రీవారి కళ్యాణ మహోత్సవం

సింగపూర్: సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో లోకకళ్యాణార్ధం మరియు రాబోవు సంవత్సరమంతా  అందరికీ  శ్రేయస్కరంగా ఉండాలనే మహాసంకల్పంగా శ్రీ శుభకృత్ నామ సంవత్సర ఉగాది న శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ శ్రీనివాసునకు సుప్రభాతసేవ, తోమాలసేవ, అభిషేకం మరియు విశేషపూజలతో పాటు , మహా గణపతి, విష్ణుదుర్గ, మహాలక్ష్మి వార్లకు అభిషేకము మొదలగు విశేష కైంకర్యములతో పాటు శ్రీవారి కళ్యాణోత్సవము ను స్థానిక సెరంగూన్ రోడ్ లోని శ్రీ శ్రీనివాస పెరుమాళ్ దేవాలయమందు ఏప్రిల్ 2 శనివారం నాడు అత్యంత  భక్తిశ్రద్ధలతో , శాస్త్రోక్తంగా , గోవింద నామస్మరణల మధ్య నిర్వహించారు.

కళ్యాణోత్సవానంతరం శ్రీవారు ఆస్ధానంలో ఉండగా నిర్వహించిన పంచాంగ శ్రవణంను అందరూ ఆసక్తిగా ఆలకించారు. సింగపూర్ ప్రభుత్వం మరియు హిందూ ఎండోమెంట్స్ బోర్డ్ నిర్ధేశించిన మరియు సడలించిన మార్గదర్శకాలకనుగుణంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించి , భక్తులందరికీ ప్రత్యక్ష దర్శన మరియు పరోక్ష వీక్షణ ఏర్పాట్లు చేయటం జరిగింది.

సింగపూర్ లోనే  కోవిద్ నిబంధనలను సడలించిన తరువాత ప్రత్యక్షంగా నిర్వహిస్తున్న అతి పెద్ద కార్యక్రమం మన తెలుగు వారి తొలి పండుగ ఉగాది కావడంతో, ఉదయం సుమారు 3000 మంది మరియు సాయంకాలం 6000 మందికి పైగా భక్తులు విడతలుగా విచ్చేసి ఆదేవదేవుని దర్శించుకొన్నారు. విశేష సేవలు మరియు కళ్యణోత్సవానికి సింగపూర్ లో నివసిస్తున్న ఎంతోమంది ప్రముఖులతో పాటు సింగపూర్ న్యాయ మరియు హోం అఫ్ఫైర్స్ శాఖ మంత్రి కె షణ్ముగం కూడా విచ్చేసి దేవుని కటాక్షాలు పొందారు.ఈ కార్యక్రమాన్ని ఇంతభారీగా నిర్వహించిన తెలుగు సమాజానికి అందరూ కృతజ్ఞతలు తెలిపారు.పెరుమాళ్ దేవాలయంలో 2020 వ సంవత్సరం కోవిద్ నిబంధనలకు ముందు మరియు 2022 కోవిద్ నిబంధనల సడలింపు తరువాత జరిగిన రెండు పెద్ద కార్యక్రమాలు తెలుగు సమాజమే నిర్వహించిన ఉగాది కార్యక్రమాలు కావడం యాధృశ్చికం.

తెలుగు సమాజం అధ్యక్షులు కోటిరెడ్డి మాట్లాడుతూ తెలుగువారందరికీ శ్రీ శుభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలపటంతో పాటు, కోవిద్ నిబంధనల మేరకు సింగపూర్ తెలుగు సమాజం గత రెండు సంవత్సరాలలో ప్రత్యక్ష కార్యక్రమాలు నిర్వహించ లేకపోయిందని,  ఎంతో కాలం తరవాత ఉగాది పండగ సందర్భంగా అందరినీ ప్రత్యక్షంగా కలవడం ఆనందంగా ఉందని తెలియచేసారు. అలానే ఈ ఉగాది నాడు సుమారు 4000 మందికి సింగపూర్ లోనే అరుదుగా లభించే వేపపువ్వు అందించామని, సంప్రదాయబద్ధంగా తయారుచేసిన షడ్రచుల సమ్మిళితమైన ఉగాది పచ్చడి ని ప్రత్యేక ప్యాకెట్ రూపం లో సుమారు 5000 మందికి పైగా అందించామని తెలియచేసారు.

తిరుమల తిరుపతి  దేవస్థానం మరియు తి. తి. దే. కార్యవర్గ సభ్యులు చెవిరెడ్డి భాస్కరరెడ్డి  సహాయ సహకారాలతో కళ్యణోత్సవంలో పాల్గొన్న దంపతులకు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి లడ్డూ ప్రసాదం, వడ, అభిషేక జలం, తలంబ్రాలు మరియు వస్త్రాలు అందచేసామని తెలిపారు.

 కార్యక్రమానికి అన్నివిధాల సహకరించిన  పెరుమాళ్ దేవస్ధాన కార్యవర్గాలకు , దాతలకు,  ప్రతి ఒక్కరికీ కార్యక్రమ నిర్వాహకులు శ్రీనివాస్ రెడ్డి పుల్లన్న కృతజ్ఞతలు తెలిపారు. 

భక్తులకు , వాలంటీర్లకు, కార్యక్రమానికి హాజరైన మరియు లైవ్ ద్వారా వీక్షించిన అందరికీ కార్యదర్శి సత్యచిర్ల ఈ సందర్భంగా ధన్యవాదములు తెలియజేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com