ఏపీ ప్రజలకు మరో షాక్..

- April 10, 2022 , by Maagulf
ఏపీ ప్రజలకు మరో షాక్..

అమరావతి: ఏపీ లో ధరల పెరుగుదలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది.పేద, మధ్య తరగతి ప్రజలు పెరుగుతున్న ధరలతో అల్లాడిపోతున్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్.. ఇలా ఏ వస్తువు ధర చూసిన ఆకాశాన్ని అంటోంది. ఈ పరిస్థితుల్లో కొన్ని ప్రభుత్వాలు ప్రజలపై మరింత భారం మోపుతున్నాయి. ఇప్పటికే ఏపీ రాష్ట్రంలో విద్యుత్ చార్జీలు పెంచిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రతిపక్షాలు ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్నాయి. ఈ క్రమంలో… ప్రజలపై మరో పిడుగు వేసింది. ఏపీ ప్రభుత్వం ఆస్తి పన్ను పెంచింది. పట్టణాల్లో భారీగా ఆస్తిపన్ను పెరిగింది. దాదాపు ప్రజలపై రూ. 214 కోట్ల భారం పడింది. పట్టణాల్లో మరో 15 శాతం పెంచగా, రెండు సంవత్సరాల్లో 32.24 శాతం పెరిగినట్లైంది. దీనిపై త్వరలోనే ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు సమాచారం.

కరెంట్‌ బిల్లు కట్టకపోతే కరెంట్‌ కట్‌ చేయడం.. ఆస్తి పన్ను కట్టకుంటే ఆస్తులు జప్తు చేయడం.. ఇలా పలు రకాల పన్నుల విషయంలో.. అధికారులు ప్రజలపై తీసుకునే చర్యలు ఏపీలో సర్వసాధారణంగా మారిపోయాయి. కానీ, చెత్త పన్ను, ఆస్తి పన్ను పేరుతో ప్రజలు నానా పాట్లు పడుతున్నారు. ఆర్థిక సంవత్సరం ముగింపు కారణంగా.. పన్నులు వసూలు చేయాలని అధికారులు టార్గెట్ పెట్టుకున్నారు. పన్నులు కట్టకపోతే ఇంట్లోని వస్తువులు జప్తు చేస్తామనే హెచ్చరికలు జారీ చేస్తుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. పన్నుల వసూలు కోసం తూర్పు గోదావరి జిల్లా అధికారులు తీసుకుంటున్న చర్యలు తీవ్ర విమర్శలకు దారి తీశాయి. ప్రస్తుతం పెరిగిన ఆస్తి పన్నుపై ప్రజలు ఎలా స్పందిస్తారో చూడాలి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com