మరియుపోల్‌ పై పట్టు సాధించిన రష్యా!

- April 18, 2022 , by Maagulf
మరియుపోల్‌ పై పట్టు సాధించిన రష్యా!

కీవ్: ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం కొనసాగుతూనే ఉంది. దాదాపు 7 వారాల పోరాటం తర్వాత- ఉక్రెయిన్‌ ప్రధాన నగరాల్లో ఒకటైన మరియుపోల్‌పై పట్టు సాధించినట్లు రష్యా ప్రకటించింది. అక్కడ తమ బలగాలు ఇంకా పోరాడుతున్నాయని ఉక్రెయిన్‌ ప్రకటించినప్పటికీ… పుతిన్‌ సేనలకు నగరం చిక్కినట్లేనని తెలుస్తోంది. అదే వాస్తవమైతే.. ఫిబ్రవరి 24వ తేదీన యుద్ధం ప్రారంభించిన తర్వాత-ఉక్రెయిన్‌ నగరం ఒకదానిని రష్యా స్వాధీనం చేసుకోవడం ఇదే మొదటిసారి.ఉక్రెయిన్‌ తరఫున ఇంకా పోరాడుతున్న కొద్దిమందిని మరియుపోల్‌లోని అజోవ్‌స్తల్‌ ఉక్కు కర్మాగారంలో బంధించినట్లు రష్యా తెలిపింది.తూర్పు భాగంపై పూర్తిస్థాయిలో పట్టు సాధించడానికి వీలుపడేలా ముందుగా ఈ దక్షిణ నగరాన్ని హస్తగతం చేసుకోవాలని గత ఏడు వారాలుగా రష్యా ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే.మరియుపోల్‌కు ‘స్వేచ్ఛ’ ప్రసాదించే క్రమంలో 1,464 మంది ఉక్రెయిన్‌ సైనికులు ఇప్పటికే లొంగిపోయారని రష్యా రక్షణ మంత్రిత్వశాఖ ముఖ్య అధికార ప్రతినిధి తెలిపారు.దాదాపు నగరమంతటినీ గుప్పిట పట్టామనీ, మిగిలినవారు ఆయుధాలు విడిచిపెట్టి లొంగిపోతే ప్రాణభిక్ష పెడతామని రష్యా ప్రకటించింది. వారందరినీ జెనీవా ఒప్పందం ప్రకారం యుద్ధ ఖైదీలుగా పరిగణించి సదుపాయాలు కల్పిస్తామని వెల్లడించింది.ఈ విషయాన్ని రష్యా శనివారం రాత్రి నుంచి ఉక్రెయిన్‌ వర్గాలకు చెబుతోంది.

కాగా, రష్యా ప్రతిపాదనను ఉక్రెయిన్‌ తోసిపుచ్చింది. మరియుపోల్‌ను రక్షించుకునేందుకు సైన్యం ప్రయత్నిస్తోందని, లొంగిపోయే ప్రసక్తే లేదని స్పష్టంచేసింది.అక్కడ ఉన్నవారిలో ప్రతిఒక్కరినీ నాశనం చేసేందుకు రష్యా ప్రయత్నిస్తోందని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఆరోపించారు. అజోవ్‌ సముద్ర తీరాన ఉన్న నగరాన్ని కాపాడుకునేందుకు మరికొన్ని భారీ ఆయుధాలు ఇవ్వాల్సిందిగా ప్రపంచదేశాలను అభ్యర్థించారు.ఆ నగరంలో చిక్కుకున్న వేలమంది ప్రజల్ని రక్షించే విషయమై బ్రిటన్‌, స్వీడన్‌ నేతలతో చర్చించినట్లు తెలిపారు. యుద్ధం, లేదా దౌత్యం ద్వారా ఆ నగర భవితవ్యం తేలుతుందన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com