మేనేజ్మెంట్ రంగంలో సరికొత్త కోర్స్ ను ప్రవేశపెట్టిన IIFT

- April 22, 2022 , by Maagulf
మేనేజ్మెంట్ రంగంలో సరికొత్త కోర్స్ ను ప్రవేశపెట్టిన IIFT

న్యూఢిల్లీ: ఢిల్లీ కేంద్రంగా పనిచేసే ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (IIFT) సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. బిజినెస్ అనలిటిక్స్ అండ్ ఇంటర్నేషనల్ బిజినెస్‌లో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్‌మెంట్ (IPM) కోర్సును ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది.

2022-23 అకడమిక్ ఇయర్ నుంచి ఈ కొత్త ప్రోగ్రామ్‌ను ప్రవేశపెడుతున్నట్లు ఐఐఎఫ్‌టీ తెలిపింది. కాకినాడలోని జవహర్‌లాల్‌ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ (JNTU)లో ఈ ప్రోగ్రామ్ సెప్టెంబర్ 2022 నుంచి ప్రారంభం కానుంది. ఇందు కోసం అక్కడ ఐఐఎఫ్‌టీ తాత్కాలిక క్యాంపస్ ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రోగ్రామ్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఏప్రిల్ చివరి వారం లేదా మే మొదటి వారంలో నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. దరఖాస్తులను మే 21లోపు సమర్పించాల్సి ఉంటుంది. ప్రోగ్రామ్ కోసం అర్హత పరీక్ష జూన్ 2, 2022 నిర్వహించనున్నట్లు ఐఐఎఫ్‌టీ తెలిపింది.

*ఎంపిక ప్రక్రియ
కోర్సు అడ్మిషన్ కోసం అభ్యర్థులను వివిధ మార్గాల్లో ఎంపిక చేయనున్నారు. ఐఐఎం(IIM) ఇండోర్, నిర్వహించే IPMAT- 2022 స్కోర్ ఆధారంగా అభ్యర్థుల మెరిట్ లిస్ట్‌ను తయారు చేయనున్నారు. ఎంపికైన అభ్యర్థుల పదో తరగతి అకడమిక్ ప్రొఫైల్, లింగ వైవిధ్యం తదితర వాటిపై ఐఐఎఫ్‌టీ నిర్ణయం తీసుకోనుంది.

*అర్హత ప్రమాణాలు
ఎడ్యుకేషన్ విషయానికి వస్తే.. అభ్యర్థులు 2020 సంవత్సరంలో ఆర్ట్స్/కామర్స్/సైన్స్ స్ట్రీమ్‌లో 10+2/XII/HSC పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి లేదా 60 శాతం మార్కులతో అందుకు సమానమైన కోర్సు చేసి ఉండాలి. SC/ST/PwD/ట్రాన్స్‌జెండర్ అభ్యర్థులకు 55 శాతం లేదా అంతకంటే ఎక్కువ మార్కులు వచ్చి ఉండాలి. అభ్యర్థులు 2021 లేదా 2022లో పరీక్షలకు హాజరై ఉండాలి. అదేవిధంగా అభ్యర్థి తప్పనిసరిగా 10వ తరగతి పరీక్షలో 60 శాతం లేదా అంతకంటే ఎక్కువ మార్కులు వచ్చి ఉండాలి. SC/ST/PwD/ట్రాన్స్‌జెండర్ అభ్యర్థులకు 55 శాతం మార్కులు వచ్చి ఉండాలి. అది కూడా 2018 తరువాత ఉత్తీర్ణులై ఉండాలి. ఇక వయోపరిమితి విషయానికి వస్తే ఎటువంటి నిబంధనలు లేవు.

*ఫీజు వివరాలు
ప్రోగ్రామ్‌లో మొదటి మూడు సంవత్సరాల కోర్సు ఫీజు (హాస్టల్, మెస్ ఫీజులను మినహాయించి) సంవత్సరానికి రూ.4 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. నాలుగు, ఐదో ఏడాదికి సంబంధించి కోర్సు రుసుము ఆ సంవత్సరానికి నిర్ణయించిన MBA (IB) ప్రోగ్రామ్ ఫీజు ప్రకారం ఉండనుంది.

మేనేజ్‌మెంట్‌లో ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ కోర్సును విజయవంతంగా పూర్తి చేసిన అభ్యర్థులకు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ ద్వారా బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (బిజినెస్ అనలిటిక్స్), మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (ఇంటర్నేషనల్ బిజినెస్) పట్టా ఇవ్వనున్నారు. IPM ప్రోగ్రామ్ మొదటి మూడు సంవత్సరాలు సెమిస్టర్ విధానంపై ఆధారపడి ఉంటుంది. చివరి రెండు సంవత్సరాలు త్రైమాసిక విధానంపై ఆధారపడి ఉంటుందని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ స్పష్టం చేసింది.

కాగా, కొత్త జాతీయ విద్యా విధానం 2020కి అనుగుణంగా ప్రోగ్రామ్ పాఠ్యాంశాలను రూపొందించినట్లు ఇన్ స్టిట్యూట్ తెలిపింది. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, గణితంతో మేనేజ్‌మెంట్ విద్యను ఏకీకృతం చేయడం, యువ నిపుణులకు నిర్వహణ- నిర్ణయాత్మక నైపుణ్యాలను అందించడమే లక్ష్యంగా ఈ కోర్సు ప్రారంభిస్తున్నట్లు ఐఐఎఫ్‌టీ పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com