భారత్‌లో కోవిడ్ నాల్గో వేవ్ ముప్పు..

- April 23, 2022 , by Maagulf
భారత్‌లో కోవిడ్ నాల్గో వేవ్ ముప్పు..

న్యూ ఢిల్లీ: భారత్‌లో కరోనా మళ్లీ విజృంభిస్తోంది.గత కొన్ని రోజులుగా కరోనా కేసుల తీవ్రత పెరుగుతూ వస్తోంది.కోవిడ్ థర్డ్ వేవ్ నుంచి బయపడి కాస్తా ఊపిరిపీల్చుకున్నామో లేదో మళ్లీ నాల్గో వేవ్ ముప్పు పొంచి ఉందని నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుత కరోనా కేసులు తీవ్రత చూస్తుంటే.. నాల్గో వేవ్ ముప్పు తప్పదనే సంకేతాలు కనిపిస్తున్నాయి. దేశంలో వరుసగా నాల్గో రోజూ కూడా కరోనా కేసులు భారీగా నమోదయ్యాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం.. భారత్‌లో గత 24 గంటల్లో 2,527 కొత్త కరోనా కేసులు నమోదు కాగా.. మరో 33 మరణాలు నమోదయ్యాయి. దేశంలో వరుసగా నాలుగో రోజు 2వేల కన్నా ఎక్కువ కరోనా కేసులు నమోదయ్యాయి. దేశంలో ఇప్పుడు మొత్తం కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 15,079కి చేరుకుంది. రోజువారీ పాజిటివిటీ రేటు 0.56 శాతంగా నమోదైంది. గత 24 గంటల్లో మొత్తం 1,656 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశవ్యాప్తంగా కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,25,17,724కి చేరుకుంది.

మరోవైపు.. దేశంలో నాల్గో కోవిడ్ వేవ్ ముప్పు పొంచి ఉందనే హెచ్చరికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్ర ప్రభుత్వాలకు వెంటనే కరోనా కట్టడికి కఠిన చర్యలు చేపట్టాలని కేంద్రం సూచనలు చేసింది. దేశ రాజధాని ఢిల్లీతో పాటు ఆర్థిక రాజధాని ముంబై సహా పలు ప్రాంతాల్లో కరోనా కేసులు తీవ్రంగా పెరుగుతున్నాయి. ఢిల్లీలో శుక్రవారం 1000కిపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. పలు రాష్ట్రాల్లో మాస్కు తప్పనిసరి చేస్తూ ఆంక్షలు విధించారు. శుక్రవారం రోజున కూడా కరోనా కేసులు రూ.2వేల మార్క్ దాటాయి. దేశంలో 15,079 (0.04 శాతం) కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.

తాజా గణాంకాల ప్రకారం.. కరోనా కేసులు మొత్తం 4,30,54,952 కి చేరింది. కరోనా ప్రారంభమైనప్పటి నుంచి దేశంలో కరోనా మరణాల సంఖ్య 522149కి పెరిగింది. కరోనా రికవరీ రేటు 98.75 శాతం నమోదైంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 187,46,72,536 వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేశారు. నిన్న ఒక్కరోజే 19,13,296 మందికి కరోనా వ్యాక్సిన్ అందించారు. నిన్న 4,55,179 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. మొత్తంగా దేశంలో ఇప్పటివరకు 83.42 కోట్ల పరీక్షలు చేసినట్లు కేంద్రం ఒక ప్రకటనలో వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com