పెట్రో ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకం తగ్గించండి..తెలుగు రాష్ట్రాల సీఎంలకు ప్రధాని సూచన

- April 27, 2022 , by Maagulf
పెట్రో ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకం తగ్గించండి..తెలుగు రాష్ట్రాల సీఎంలకు ప్రధాని సూచన

న్యూఢిల్లీ: ప్రధాని మోదీ కీలక సూచనలు చేసారు. దేశ వ్యాప్తంగా పెట్రో ఉత్పత్తుల ధరల పెరుగుదల అంశం ఆయన తొలి సారి ప్రతిపక్ష ముఖ్యమంత్రుల పైన అసహనం వ్యక్తం చేసారు.

కరోనా స్థితిగతుల పైన అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫిరెన్స్ నిర్వహించిన ప్రధాని మోదీ.. పెట్రో ఉత్పత్తుల ధరల అంశం పైన స్పందించారు. సామాన్యులకు ఊరట కలిగించేలా గతేడాది నవంబర్​లో కేంద్రం పెట్రో ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకం తగ్గించిందని చెప్పుకొచ్చారు. దీనికి కొనసాగింపుగా... రాష్ట్రాలు సైతం అదే తరహాలో పన్నులు తగ్గించాలని కోరినట్లుగా వెల్లడించారు.

కానీ, కొన్ని రాష్ట్రాలు ఇంకా పన్నులు తగ్గింపు నిర్ణయాలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేసారు. తాను ఎవరినీ విమర్శించటం లేదని చెబుతూనే.. మహారాష్ట్ర, బంగాల్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, ఝార్ఖండ్​, తమిళనాడు ప్రభుత్వాలు వ్యాట్​ తగ్గించి, సామాన్యులకు లబ్ధి చేకూర్చాలని కోరుతున్నానని చెప్పారు. కేంద్రం - రాష్ట్రాలు కలిసి నిర్ణయాలు తీసుకొని..కలిసి పని చేస్తేనే ధరలు తగ్గుతాయని వివరించారు. వ్యాట్ ఎక్కువగా ఉండటం వలన పెట్రో ఉత్పత్తుల ధరలు ఎక్కువగా ఉంటున్నాయని వ్యాఖ్యానించారు.

కేంద్రం పెట్రో ఉత్పత్తుల పైన ఎక్సైజ్ ధరలు తగ్గించిన తరువాత బీజేపీ పాలిత రాష్ట్రాలు వ్యాట్ ను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. అయితే, ప్రతిపక్ష పార్టీలు ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రాలతో పాటుగా తటస్థంగా ఉన్న తెలంగాణ..ఏపీ వంటి రాష్ట్రాల్లోనూ వ్యాట్ పైన నిర్ణయం తీసుకోలేదు. ఇదే డిమాండ్ తెర పైకి వచ్చిన సమయంలో... రెండు రాష్ట్రాలకు చెందిన అధికార పార్టీ నేతలు..కేంద్రం తీరును తప్పుబట్టాయి. ఇక, ఇప్పుడు స్వయంగా ప్రధాని వ్యాట్ తగ్గింపు పైన నిర్ణయం తీసుకోవాలని సూచించటంతో...ఈ రాష్ట్రాలు ఏ రకంగా స్పందిస్తాయనేది వేచి చూడాలి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com