న్యాయమూర్తులు లక్ష్మణ రేఖను గుర్తుంచుకోవాలి: జస్టిస్ రమణ

- April 30, 2022 , by Maagulf
న్యాయమూర్తులు లక్ష్మణ రేఖను గుర్తుంచుకోవాలి: జస్టిస్ రమణ

న్యూ ఢిల్లీ: న్యాయమూర్తులు తమ విధి నిర్వహణ సమయంలో లక్ష్మణ రేఖను గుర్తుంచుకోవాలని సూచించారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్​వీ రమణ.ఈ మేరకు హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు, ముఖ్యమంత్రులు సహా ప్రధాని మోదీ హాజరైన సదస్సులో ఆయన కీలక ప్రసంగం చేశారు.హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, ముఖ్యమంత్రుల సదస్సులో సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్ ఎన్​వీ రమణ కీలక అంశాలపై ప్రసంగించారు. న్యాయమూర్తులు విధి నిర్వహణలో తమ పరిమితులను గుర్తుంచుకోవాలని పేర్కొన్నారు. లక్ష్మణ రేఖను దాటొద్దని సూచించారు. శాసన, కార్యనిర్వాహక, న్యాయశాఖలకు రాజ్యాంగం వేర్వేరు అధికారాలను కల్పించిందని గుర్తుచేసిన సీజేఐ... ప్రజాస్వామ్య బలోపేతానికి, సామరస్యంగా కార్యకలాపాలు సాగేందుకు ఇది దోహదం చేస్తుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దుర్వినియోగం అవుతున్నాయని సీజేఐ ఆందోళన వ్యక్తం చేశారు. ఇవి వ్యక్తిగత ప్రయోజన వ్యాజ్యాలుగా మారిపోయాయని ఆవేదనతో చెప్పారు.

కాగా, ప్రధాన న్యాయమూర్తులు, ముఖ్యమంత్రుల సదస్సు దిల్లీలోని విజ్ఞాన్ భవన్​లో ప్రారంభమైంది. ఆరేళ్ల తర్వాత జరుగుతున్న ఈ సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్​వీ రమణ హాజరయ్యారు. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, 25 హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు, పలు రాష్ట్రాల న్యాయశాఖ మంత్రులు, అధికారులు విచ్చేశారు. న్యాయమూర్తుల సదస్సులో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాల్గొన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి తరపున న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హాజరయ్యారు.

న్యాయవ్యవస్థ బలోపేతం, న్యాయవ్యవస్థ మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ ఏర్పాటు, కోర్టుల్లో న్యాయమూర్తుల భర్తీ, న్యాయ వ్యవస్థలో సంస్కరణలు, దేశవ్యాప్తంగా అన్ని కోర్టు సముదాయాల్లో నెట్‌వర్క్‌ అనుసంధానతను బలోపేతం చేయడం వంటి విస్తృత అంశాలపై ఈ సదస్సులో చర్చలు జరగనున్నాయి. జిల్లా కోర్టుల అవసరాలకు తగ్గట్టు మానవ వనరులు/సిబ్బందికి సంబంధించిన విధాన రూపకల్పనపై చర్చించనున్నారు. మౌలికవసతుల కల్పన, భవనాల సామర్థ్యం పెంపు అంశాలపై సమాలోచనలు చేయనున్నారు. సదస్సు ముగిసిన తర్వాత.. చర్చించిన అంశాలపై సీజేఐ, కేంద్ర న్యాయ శాఖ మంత్రి సంయుక్త మీడియా సమావేశం నిర్వహించే అవకాశం ఉంది.

న్యాయమూర్తులు, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, చత్తీస్​గఢ్ సీఎం భూపేశ్ బఘేల్, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహన్, హరియాణా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్, యుపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, జార్ఖండ్ సీఎం హేమంత్ సొరెన్, గుజరాత్ సీఎం భూపెంద్ర పటేల్ తదితరులు ఈ సదస్సుకు హాజరయ్యారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com