వరంగల్‌లో సభలో రాహుల్‌ గాంధీ సంచలన వాఖ్యలు

- May 06, 2022 , by Maagulf
వరంగల్‌లో సభలో రాహుల్‌ గాంధీ సంచలన వాఖ్యలు

వరంగల్‌: టీఆర్‌ఎస్‌, బీజేపీ నేతలతో లాలూచీ పడితే సహించేది లేదని, ఎంత పెద్ద  నేతలైనా కాంగ్రెస్‌ నుంచి బయటకు పంపిస్తామని ఏఐసీసీ అగ్రనేత, ఎంపీ రాహుల్‌గాంధీ అన్నారు. తెలంగాణలో వేల కోట్లు దోచుకుంటున్నదెవరు?. తెలంగాణను దోచుకున్న వ్యక్తితో కాంగ్రెస్‌ పొత్తు పెట్టుకోదని రాహుల్‌ స్పష్టం చేశారు. హనుమకొండలోని ఆర్ట్స్‌ కళాశాల మైదానంలో జరిగిన ‘రైతు సంఘర్షణ సభ’లో ఆయన మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ను వచ్చే ఎన్నికల్లో ఓడిస్తాం. ఇది కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ మధ్య ప్రత్యక్ష యుద్ధం అని రాహుల్‌ అన్నారు.

తెలంగాణ ఏర్పాటు అంత సులభంగా జరగలేదని.. రాష్ట్రం కోసం ఇక్కడి తల్లులు తమ రక్తం, కన్నీరు ధారపోశారని, తెలంగాణ ఏ ఒక్కరి కోసం ఏర్పడలేదన్నారు. తెలంగాణ అనేది ప్రజల కల అన్నారు. ప్రత్యేక తెలంగాణ ఎంతో మంది త్యాగంతో ఏర్పడిందన్నారు. ‘‘తెలంగాణ ఏర్పడి ఎనిమిదేళ్లయినా అభివృద్ధి కలగానే ఉందని, తెలంగాణ వల్ల కేవలం ఒక్క కుటుంబానికే లబ్ధి జరిగిందన్నారు. తెలంగాణ కన్న కల ఏమైంది. తెలంగాణ ప్రజలకు ఏం లాభం జరిగింది. నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చాయా?. భర్తలను కోల్పోయి రైతుల భార్యలు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.  రైతుల ఆత్మహత్యలకు బాధ్యులు ఎవరని’’ రాహుల్‌ ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల కలను నెరవేర్చింది కాంగ్రెస్‌. తెలంగాణలో ఉన్నది ముఖ్యమంత్రి కాదు రాజులా వ్యవహరిస్తున్నారు. రాజుకు ప్రజల సమస్యలు పట్టవు. ఛత్తీస్‌గడ్‌లో ఎన్నికల ముందు రెండు వాగ్ధానాలు చేశాం. రైతుల రుణమాఫీ, పండించిన పంటకు కనీస మద్దతు ధర ఇచ్చామని’’ ఆయన పేర్కొన్నారు.

తెలంగాణ ఏర్పాటు వల్ల పార్టీకి నష్టం జరుగుతుందని తెలుసు. అయినప్పటికీ రాష్ట్రం ఇచ్చాం. తెలంగాణ వచ్చాక, ప్రజా, రైతు, కార్మిక ప్రభుత్వం ఏర్పడుతుందని ఆశించారు. ఇప్పుడు తెలంగాణలో ఉన్నది సీఎం కాదు. రాజరికం. ముఖ్యమంత్రి ప్రజల మాట వింటారు.. రాజు ప్రజల మాట వినడు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే రూ.2 లక్షలు రుణమాఫీ. మేం చెబుతున్నది ఉత్తుత్తి హామీలు కాదు. తెలంగాణ కల నెరవేర్చడంలో రుణమాఫీ తొలి అడుగు. ఇది కేవలం రైతు డిక్లరరేషన్‌ కాదు.. రైతుల కోసం కాంగ్రెస్‌ ఇస్తున్న గ్యారంటీ. తెలంగాణలో ఉన్న ప్రతి రైతు కాంగ్రెస్‌ డిక్లరేషన్‌ చదవాలి. డిక్లరేషన్‌లో ఉన్న ప్రతి మాటకు కాంగ్రెస్‌ గ్యారంటీ. తెలంగాణ రైతులకు మెరుగైన జీవితాలను అందిస్తాం.’ అని రాహుల్‌ అన్నారు.
--

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com