కోర్బెవ్యాక్స్ వ్యాక్సిన్‌: మూడింతలకు పైగా తగ్గిన రేటు

- May 16, 2022 , by Maagulf
కోర్బెవ్యాక్స్ వ్యాక్సిన్‌: మూడింతలకు పైగా తగ్గిన రేటు

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా వైరస్ తీవ్రత పూర్తిగా తగ్గట్లేదు.ఈ వైరస్ ముప్పు పూర్తిగా తొలగిపోయిందనుకున్న దశలో కొత్త కేసులు పుట్టుకొస్తోన్నాయి. ఆర్- వేల్యూ క్రమంగా పెరుగుతోంది.ప్రస్తుతానికి ఈ సంఖ్య అదుపులోనే ఉంది.దేశవ్యాప్తంగా 24 గంటల వ్యవధిలో కొత్తగా 2,202 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 2,550 మంది కోవిడ్ బారి నుంచి కోలుకున్నారు. 27 మంది మరణించారు. యాక్టివ్ కేసులు 17,317గా నమోదయ్యాయి. వీక్లీ పాజిటివిటీ రేటు 0.59 శాతంగా రికార్డయింది.

ఈ పరిస్థితుల మధ్య 12 నుంచి 15 సంవత్సరాల్లోపు పిల్లలకు కరోనా వైరస్ వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. అత్యవసర పరిస్థితుల్లో కోర్బెవ్యాక్స్ వ్యాక్సిన్‌ను వినియోగించడానికి ఇదివరకే డ్రగ్ కంట్రోలర్ జనరల్ అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో 12 నుంచి 15 సంవత్సరాల్లోపు పిల్లలకు వ్యాక్సిన్‌ వేసే కార్యక్రమాన్ని ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం. మూడు కోట్లకు పైగా డోసులను విద్యార్థులు తీసుకున్నారు.

హైదరాబాద్‌కు చెందిన టాప్ ఫార్మాసూటికల్స్ కంపెనీ బయోలాజికల్ ఈ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ ఇది. టెక్సాస్ చిల్డ్రన్స్ హాస్పిటల్, బేలార్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్‌తో కలిసి సంయుక్తంగా దీన్ని అభివృద్ధి చేసింది. త్వరలోనే దీనని 5 నుంచి 12 సంవత్సరాల్లోపు పిల్లలకు కూడా అందించడానికి చర్యలు తీసుకుంది. మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌ను పూర్తి చేసింది. దీనికి డ్రగ్ కంట్రోలర్ జనరల్ అనుమతి ఇచ్చింది. ప్రైవేట్‌ వ్యాక్సినేషన్ కేంద్రాలు, ఆసుపత్రుల కోసం బయోలాజికల్ ఈ కంపెనీ ఇదివరకే కోర్బెవ్యాక్స్ ధరను నిర్ధారించింది. దీని రేటు డోసు ఒక్కింటికి 840 రూపాయలుగా నిర్ణయించింది. ఇప్పుడు తాజాగా ఈ వ్యాక్సిన్ ధరను తగ్గించినట్లు ప్రకటించింది బయోలాజికల్ ఈ యాజమాన్యం. 250 రూపాయలుగా ఖరారు చేసినట్లు తెలిపింది. జీఎస్టీతో కలుపుకొని డోసు ధర 250 రూపాయలుగా నిర్ధారించామని పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com