తెలంగాణలో స్టాడ్లర్ రైల్ 1000కోట్ల పెట్టుబడి..దావోస్ లో ఒప్పందాలు

- May 25, 2022 , by Maagulf
తెలంగాణలో స్టాడ్లర్ రైల్ 1000కోట్ల పెట్టుబడి..దావోస్ లో ఒప్పందాలు

 

• 2500 మందికి ఉద్యోగాలు 
• అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు
• దావోస్ లో మంత్రి కే తారకరామారావు సమక్షంలో ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్న కంపెనీ  

దావోస్: తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసేందుకు స్టాడ్లర్ రైల్ ముందుకు వచ్చింది. ఈ మేరకు మంత్రి కేటీఆర్ సమక్షంలో తెలంగాణ ప్రభుత్వంతో కంపెనీ ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మేదో సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు స్టాడ్లర్ రైల్ కలిసి ఈ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ని స్థాపించనున్నాయి. ఈ మేరకు స్టాడ్లర్ రైల్  కార్యనిర్వాహక ఉపాధ్యక్షులు అన్స్ గార్డ్ బ్రోక్ మెయ్ Ansgard Brockmeye  మరియు తెలంగాణ పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ దావోస్ లోని తెలంగాణ పెవిలియన్ లో అవగాహన ఒప్పందం పైన కేటీఆర్ సమక్షంలో సంతకాలు చేశారు. ఈ ఒప్పందం మేరకు రానున్న రెండు సంవత్సరాలలో తెలంగాణలో వెయ్యి కోట్ల రూపాయలను రైల్వే కోచ్ ఫ్యాక్టరీ స్థాపన కోసం కంపెనీ పెట్టుబడిగా పెట్టనున్నది.  ఈ కంపెనీ ఫ్యాక్టరీ స్థాపన తర్వాత తయారుచేసే రైల్వే కోచ్ లను కేవలం భారత దేశం కోసం మాత్రమే కాకుండా ఏషియా పసిఫిక్ రీజియన్ కోసం సైతం ఎగుమతి చేయనున్నట్లు తెలిపింది. 

తెలంగాణ రాష్ట్రంలో తమ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం ముందుకు వచ్చిన స్టాడ్లర్ రైల్ కంపెనీకి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం నుంచి భారతదేశానికే కాకుండా విదేశాలకు సైతం ఎగుమతి అయ్యేలా రైల్వే కోచ్ లను తయారు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ పెట్టుబడి ద్వారా తెలంగాణ రాష్ట్రం ప్రపంచ పెట్టుబడులకు ఆకర్షణీయ గమ్యస్థానంగా మారిందనే విషయం మరోసారి నిరూపితం అయింది అన్నారు. కంపెనీ పెడుతున్న వెయ్యి కోట్ల రూపాయల పెట్టుబడి ద్వారా 2500 మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయని తెలిపారు. 

తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేయబోతున్న తమ యూనిట్ కంపెనీకి అత్యంత ప్రాధాన్యత కలిగినదిగా మారబోతున్నదని కంపెనీ కార్యనిర్వాహక అధ్యక్షులు అన్స్ గార్డ్ బ్రోక్ మెయ్ Ansgard Brockmeye తెలిపారు. తమ కంపెనీ ఏసియా పసిఫిక్ ప్రాంతంలో అభివృద్ధిని సాధించేందుకు ఈ పెట్టుబడి దోహదపడుతుందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తమ సంస్థకు అందిస్తున్న సహకారం పైన హర్షం వ్యక్తం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com