పూల జడ

- May 27, 2022 , by Maagulf
పూల జడ

వేసవి కాలం సెలవులు.తీర ప్రాంతం అవ్వటం మూలాన సాయంత్రం నాలుగు గంటలకే చల్లబడిపోయింది.

'మల్లె పూలు ... మల్లె పూలు, అంటూ గట్టిగా అరుస్తున్న పూలమ్మాయి అరుపులు విని ఐదు ఏళ్ళ గీత,  ఒక్క ఉరుకులో బయట గుమ్మం దగ్గరకి వచ్చి నుంచుని చూస్తోంది.  

ఇంతలో  వెనక నుంచి లక్ష్మి, రెండు ఏళ్ళ బుజ్జి ని ఎత్తుకు వచ్చి, ' ఇదిగో పూలమ్మి!, ఒక సారి ఇలా రా' అని పిలిచింది.

బేరం వచ్చింది అన్న సంతోషంతో పూలమ్మి మొహాన ఇంత నవ్వు పులుముకుని వచ్చింది.

'పెద్ద మొగ్గ వచ్చిందా? పాపకి పూల జడకి కావాలి' అంది లక్ష్మి.

తన మనసులో మాట అమ్మకి ఎలా తెలిసిందా  అని సంభ్రమాశ్చర్యాలతో  తల్లి
నడుముని అల్లుకుపోయింది గీత.తనకి మల్లె పూలంటే చాలా ఇష్టం. రెండు ఏళ్ళ క్రితం, మావయ్య పెళ్లి లో పెళ్లి కూతురుతో పాటు తనకి పూలజడ వేయించింది అమ్మమ్మ.
కానీ, అప్పుడు తనది పొడవు జుట్టు కాకపోవటం, సవరంతో  వెయ్యటం  మూలాన పూలజడ ఎంతో సేపు వుండలేదు, ఊడిపోయింది. అందరూ నవ్వారు కానీ తనకి ఎంత ఏడుపు వచ్చిందో.ఈ రెండు ఏళ్ళల్లో జుట్టు పొడు...గ్గా అయ్యింది.అందుకే అనుకుంట అమ్మ వేయిస్తోంది అని మనసులో అనుకుంది.

తన నెత్తిన పెట్టుకుని ఉన్న బుట్టని దింపి, పైన కప్పిన తడి గుడ్డని తొలగించింది పూలమ్మి.

'అమ్మా,మొగ్గ ఇంకా పెద్దది రాలేదమ్మా, నాల్గు రోజులు పోనాక వస్తది.' అని అంది.

'అయితే, ఈ రోజుకి రెండు మూరలకి సరిపడా ఇవ్వు, పెద్ద మొగ్గ వచ్చాక తీసుకురా', అని డబ్బులు ఇచ్చింది.

వారం తర్వాత, పెద్ద మొగ్గలు పూలజడకి  కొన్నది.కానీ, లక్ష్మికి  కళ్ళ కలక వచ్చింది. కళ్ళు అంటుకు పోయి వున్నాయి. తనకి పూల జడ వెయ్యటం రాదు.పక్క వీధి లోని లీల గారికి వేసవి కాలంలో చిన్న పిల్లలకి  పూలజడలు వెయ్యటం అంటే మహా సరదా.ఆవిడకి సహాయం చెయ్యటానికి కాలక్షేపం కోసం కొంతమంది ఆడవాళ్ళు వస్తారు. వేసవి కాలమంతా వాళ్ళ ఇంట్లో ఎంతో సందడిగా, పెళ్లి వారి ఇల్లులా ఉంటుంది.

'అమ్మా,భాగ్యానికి గూడా  లీలమ్మ గోరు ఇయ్యాలే ఏస్తా అన్నారు అమ్మ. అని ఆనందంగా అంది ముత్యాలు  .
 
'పాపకి కూడా జాగ్రత్తగా దగ్గర ఉండి వేయించుకు రా, అసలే అయ్యగారు కూడా పని మీద పక్క ఊరుకి  వెళ్లారు'. అని జాగ్రత్తలు చెప్పింది.

ముత్యాలు  కూతురు భాగ్యం, గీత కంటే రెండు ఏళ్ళు పెద్దది, అప్పుడప్పుడు గీతతో ఆడుకోవటానికి వస్తుంది.ఇద్దరి మధ్య మంచి దోస్తీ ఉంది.గీత గబా గబా  తయారయ్యి ముత్యాలు చెయ్యి పట్టుకుని లీల అమ్మ గారి  ఇంటికి వెళ్ళింది. ఒక గంప నిండా మల్లె మొగ్గలు, పెద్ద బేసిన్ నిండా కనకాంబరాలు, ఇంకో పళ్లెంలో మరువం, ఒక పక్క పూచిక పుల్లలు. ఇల్లు అంతా మల్లె పూల వాసనతో గుభాళిస్తోంది.ఒక పక్క ఒక ఆంటీ  మల్లె తుడుములు తీస్తోంది, ఇంకో ఇద్దరు ఆంటీలు పుల్లలకి మల్లె మొగ్గలు, గుచ్చుతున్నారు, ఇంకో ఆంటీ  మరువం, కనకాంబరాలని గుచ్చుతోంది, చాలా హడావిడిగా వుంది లీల అమ్మ గారి ఇల్లు అంతా.

లీల అమ్మ గారు మిగతా ఆడ వాళ్ళ సహాయంతో, గీతకి, భాగ్యంకి చక చకా అందమైన పూల జడలు వేశారు. ఇద్దరి మొహాలు మతాబులల్లే వెలిగి పోతున్నాయి. ఇంటికి వెల్దామంటే ముత్యాలు కనపడలేదు,రాము అప్పుడే వచ్చాడు, 'నేను మిమ్మల్ని ఇంటి కాడ దింపేస్తా, ముత్యాలు ఎప్పుడు వస్తుందో తెలీదు' అంటూ రిక్షా పిలిచాడు.

రాము, ముత్యాలు భర్త, వడ్రంగి పని చేస్తాడు, తాగుడు అలవాటు ఉంది.

రిక్షాలో తమ్ముడుని ఎత్తుకుని రాము పక్కన కూచున్న గీతకి , రాము దగ్గర నుంచి  ఏదో తెలీని వాసన వస్తోంది, అసలే ఆకలిగా ఉందేమో కడుపులో తిప్పినట్టు అయ్యింది.గీత ఇంటి వైపు కాకుండా రిక్షా ఇంకో వైపు తిప్పించాడు.

'ఇటు యాడికి నాన్న' అంది భాగ్యం ఖంగారుగా.
'నువ్వు ఆగేసే' అని కసిరాడు.
గీత భయంగా తమ్ముడిని గట్టిగా దగ్గరకి లాక్కుంది.

లక్ష్మికి కళ్ళు వాచి, బాగా నొప్పిగా వున్నాయి. బుజ్జికి అంటుతుంది అని వాడిని ముత్యాలుతో లీల గారింటికి పంపింది. మధ్యాహ్నం 3 గంటలకి  పూల జడకి అని వెళ్లిన వాళ్ళు సాయంత్రం ఆరు అయినా ఇంటికి రాలేదు.పిల్లలకి ఆకలి వేస్తోందో ఏమో.లక్ష్మికి  కొంచెం ఖంగారు మొదలయ్యింది. ఇంతలో ముత్యాలు పరుగు లాంటి నడకతో చెమటలు కక్కుతూ వచ్చింది. పిల్లల కోసం చూస్తే, ఇద్దరూ కనపడలేదు.

'అమ్మా.నీళ్ల ట్యాంకీ వచ్చిందని అప్పుడే ఇంటికి పరిగెత్తానమ్మా.అంటూ చెమటని కొంగుతో తుడుచుకుంటూ, ఆయాసపడుతూ చెప్పి, దమ్ము తీసుకోవటానికి ఒక్క నిమిషం ఆగింది..'నేను పావు గంటలో తిరిగి వచ్చే లోపు రాము, భాగ్యాన్ని, గీతమ్మని, బాబుని రిచ్చా లో ఎక్కించుకుని నేను ఇంటి కాడ దింపుతా అని తీసుకెళ్లాడట'.

లక్ష్మి గుండె చప్పుడు లక్ష్మికే గట్టి గా వినపడుతోంది, కాళ్ళు పట్టు తప్పినట్టున్నాయి.

 'మరి, ఏరి పిల్లలు? ఇంటికి తీసుకు రాలేదు కదా. అయినా నేను ముందరే  చెప్పాను నీకు జాగ్రత్త గా దగ్గరుండి వేయించుకు రమ్మని. నా పిల్లలు ఏరి'... భయం, దుఃఖం నిండిన  గొంతుతో  పేలవంగా అడిగింది.

పక్కింటి శీనుకి  ఇది తెలిసి, వెతకటానికి సైకిల్ మీద వేగంగా వెళ్ళాడు.ఎదురింటి భూషణం ఇంకో వైపు పరుగు తీసాడు.

'అసలే తాగుబోతు, పిల్లల్ని తీసుకెళ్లాడు' అని వెనకింటి సుబ్బమ్మ గొణిగింది.

ఆ మాట వింటూనే ముత్యాలు కళ్ళు తుడుచుకుని, కొప్పు చుట్టి, రోడ్ మీదకి పరుగు తీసింది వెతకటానికి. లక్ష్మి భయంతో నీరసంగా గుమ్మం దగ్గరే చతికిలపడింది.

రాము, పిల్లలు ఎక్కిన రిక్షా, ఒక  వీధిలోకి తిరిగింది, చాలా మంది ఇంటి బయట అరుగు మీద కూచుని ఉన్నారు, ఒక  ఇల్లు ముందర రిక్షా ఆపించి,

'మల్లి... మల్లి తొరగా రాయే', అని పిలిచాడు. 
మల్లి బయటకి పరిగెత్తుకొచ్చింది.'ఏటన్నా' అంది.

నీ కోడలు పూల జడ ఏసుకుందే, సూత్తావని తీసుకొచ్చా, ఈ పాప గీతమ్మ, మన ప్లీడర్  గోరి అమ్మాయి' అన్నాడు.
మల్లి, భాగ్యం దగ్గరకి వచ్చి' అబ్బో. .ఓ సోసి!, ఎంత అందంగా ఉందో అని బుగ్గలు ముద్దాడి, లోనికి రా అన్న టీ తాగి పొద్దురు' అంటే. '

వద్దే లేట్ అయిపోనాది, నీకు సూపిద్దామని సెప్పకుండా తీసుకొచ్చా, ఖంగారు పడతా వుంటారు అంతా, మేము ఎల్తామే'  అని రిక్షా పోనివ్వమన్నాడు.

 'గీతమ్మ, దావత ఏస్తోందా? సోడా తాగుతావా? అంటే,  

గీత భయంగా వద్దు అని తల అడ్డంగా తిప్పింది.ఆ వీధి లోనే అరుగులు మీద కూచున్న వాళ్ళతో, నా కూతురుకి  పూలజడ వేయించా' అంటూ రిక్షా లోంచే చూపించాడు.

 భాగ్యం, 'నాన్న ఇంటికి పోదాం, అమ్మ  భయపడతాది అంది.

'బాబుని నా వొళ్ళో కూచో పెట్టుకుంటా, ఇవ్వు గీతమ్మ' అంటే గీత  తమ్ముడిని గట్టిగా పట్టుకుని వదలలేదు.

'చల్ల గాలిలో సెంటర్ చుట్టూ ఒక రౌండ్ తిప్పి తొరగా ఇంటికి పోనియ్యి' అన్నాడు.

రిక్షా వాడు స్పీడ్ గా తొక్కుతూ రిక్షా తిప్పేసరికి, అదుపు తప్పి, పక్కకి ఒరిగిపోయింది. చక్రం ఊడిపోయింది.పిల్లలు ముగ్గురు భయంతో గట్టి గా అరిచారు.రిక్షా వాడు పక్కకి దూకేసాడు. రాము కూడా రిక్షాలోంచి గభాలున కిందకి దూకి, ఒరిగి రోడ్ మీద ఈడ్చుకుంటూ వెళ్తున్న రిక్షాని, తన బలంతో గట్టిగా పట్టుకుని ఆపటానికి ప్రయత్నించాడు.ఈ ప్రయత్నంలో అతని మోకాళ్ళు, మోచేతులు గీరుకుపోయి రక్తం
కారుతోంది. పిల్లలు కింద పడకుండా మొత్తానికి  రిక్షాని అదుపు చేసాడు. దేవుడి దయ వలన పిల్లలు ఎవరికీ ఏమి కాలేదు. కానీ, భయంతో బిక్క మొహం వేసుకుని కూచున్నారు.
 
చుట్టు పక్కల వాళ్ళు గుమిగూడి,సాయం చేసి వేరే రిక్షా ని పిలిచి అందరిని దాంట్లో ఎక్కించారు. రాము, వాళ్ళ పూలజడలు వంక చూసాడు, చెదిరి పోలేదు. 'హమ్మయ్య!' అని ఊపిరి పీల్చుకున్నాడు. గీత వాళ్ళ ఇంటి అడ్రస్ చెప్పి పోనివ్వమన్నాడు.

గుమ్మం దగ్గరే నుంచుని ఉంది లక్ష్మి.

పిల్లలు ఇద్దరూ, 'అమ్మ !' అంటూ వెళ్లి లక్ష్మిని చుట్టేసారు. ఇద్దరు  పిల్లల్ని చూసేసరికి, లక్ష్మికి ప్రాణం లేచి వచ్చింది.ఇద్దర్ని ఎత్తుకుని ముద్దాడి,ఏడ్చేసింది.

'అమ్మగారు భాగ్యం పూలజడ వేసుకుందన్న సంతోషంతో, నా చెల్లికి చూపిద్దామని తీసుకెళ్ళామ్మ, గీతమ్మ నా బిడ్డ లాంటింది, నా కాళ్ళ ముందర పుట్టి పెరిగింది.తనని కూడా తీసుకెళ్లి చూపిస్తే మీరు ఒప్పుకోరని, చెప్పకుండా తీసుకెళ్ళామ్మ. తప్పయి పోనాది.  ఏరే దురుద్దేశం లేదు అమ్మ' అని  రెండు చేతులు జోడించి క్షమాపణ చెప్పాడు.

అప్పుడే పరిగెత్తుకు వచ్చిన ముత్యాలుకి , పిల్లల్ని చూసాక మనసు కుదుట పడింది.భాగ్యాన్ని దగ్గరకి తీసుకుంది.  

పెద్ద ఆపద తప్పింది, నా పిల్లలూ, నీ పిల్ల తిరిగి మన దగ్గరికి క్షేమంగా వచ్చారు, ఇంకెప్పుడూ ఇలా చెప్పకుండా చెయ్యకు అని  భాగ్యం చేతి లో యాభై రూపాయలు పెట్టి ,'పూల జడతో ముద్దుగా వున్నావు, ఏమన్నా కొనుక్కో' అంది.

'అమ్మా, మరి నా పూలజడ బావుందా అని గీత అమాయకంగా అడిగితే, 'ఓహ్! చాలా బావుంది అని లక్ష్మి, ముత్యాలు ఒకే సారి అని, నవ్వుతూ ఇంటి లోపలికి  నడిచారు.

--విశ్వనాధ జానకి జ్యోతి, సింగపూర్

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   
Copyrights 2015 | MaaGulf.com