ఏపీ డిజిటల్ కార్పొరేషన్ వాట్సాప్ సేవలు..

- June 09, 2022 , by Maagulf
ఏపీ డిజిటల్ కార్పొరేషన్ వాట్సాప్ సేవలు..

అమరావతి:  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలను డిజిటల్ మాధ్యమాల ద్వారా ప్రజల్లోకి క్షేత్రస్థాయిలో తీసుకెళ్లడంలో ఏపీ డిజిటల్ కార్పొరేషన్(APDC) కీలకపాత్ర పోషిస్తోంది.

ఏపీడీసీ ఇప్పుడు వాట్సాప్ సేవలను కూడా ప్రారంభించింది. ఇందుకోసం ఏపీ డిజిటల్ కార్పొరేషన్, వాట్సాప్ మధ్య ఒప్పందం కుదిరింది. రోజు రోజుకు ఇంటర్నెట్ వాడే వారి సంఖ్య వేగంగా పెరుగుతున్న ఏపీ వంటి రాష్ట్రంలో ఇలాంటి వేదిక అవసరాన్నీ, ప్రాముఖ్యతను గుర్తించిన వాట్సాప్ ఇండియా ఏపీడీసీ వాట్సాప్ వేదికకు పూర్తి సాంకేతిక మద్దతు అందిస్తోంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాలు, నిర్ణయాలకు సంబంధించిన సమాచారం రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ మరింత వేగంగా అందనుంది.

ప్రభుత్వ నిర్ణయాలు, విధానాలు, చేపట్టే సంక్షేమ పథకాల సమాచారాన్ని ప్రజలకు చేరవేయడంతోపాటు… ఈ విషయాలపై తప్పుడు సమాచార వ్యాప్తిని నిరోధించేందుకు కూడా ఈ వాట్సాప్ సేవలు మరింతగా ఉపయోగపడతాయని ఏపీడీసీ భావిస్తోంది. ఈ సేవల విస్తరణలో భాగంగా త్వరలో పూర్తిస్థాయి వాట్సాప్ చాట్ బోట్ సేవలను కూడా ఏపీడీసీ అందించనుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాల సమాచారాన్ని రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలకు కూడా చేరవేయడంలో ఏపీడీసీ ప్రారంభించబోయే ఈ వాట్సాప్, చాట్బోట్ సేవలు ఉపయోగపడనున్నాయి.

సీఎం జగన్ ప్రగతిశీల అజెండాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల వద్దకు తీసుకెళ్లేందుకు ప్రఖ్యాత మెసేజింగ్ అప్లికేషన్ వాట్సాప్ తో కలిసి పనిచేయడం సంతోషంగా ఉందని ఏపీడీసీ వైస్ ఛైర్మన్, ఎండీ చిన్న వాసుదేవరెడ్డి అన్నారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య డిజిటల్ మాధ్యమాల ద్వారా వారధిలా ఉండాలన్న ఏపీడీసీ లక్ష్యానికి ఈ ముందడుగు ఎంతో సాయపడుతుందని చెప్పారు.

రాష్ట్రంలో ఇ-గవర్నెన్స్ ను మరింత మెరుగుపరిచే ప్రయత్నంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి పనిచేయడం తమకు గర్వంగా ఉందన్నారు. వైవిధ్యభరితమైన, ప్రతి అవసరానికి తగిన ఇ-గవర్నెన్స్ పరిష్కారాలు రూపొందించేందుకు తమ వాట్సాప్ వ్యాపార వేదిక ద్వారా తాము నిరంతరం పనిచేస్తామని చెప్పారు.

వీటివల్ల పౌరులతో వేగవంతమైన, సులభతరమైన, మారుతున్న పరిస్థితులకనుగుణంగా సత్సంబంధాలు నెరిపేందుకు వీలవుతుందని పేర్కొన్నారు. తాము రూపొందించిన పరిష్కారాలను దేశంలోని ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు, నగరపాలక సంస్థలకు అందించి, వాటితో కలిసి పనిచేసేందుకు తాము నిరంతరం ప్రయత్నిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com