విదేశీ తెలుగువారు మాతృభాషను ప్రేమిస్తున్నారు

- July 01, 2022 , by Maagulf
విదేశీ తెలుగువారు మాతృభాషను ప్రేమిస్తున్నారు

హైదరాబాద్: తెలుగునాట ఉన్న తెలుగువారు ఆంగ్ల భాష మోజులో ఉంటే, విదేశాల్లో స్థిరపడిన తెలుగువారు మాతృభాషను మర్చిపోకుండా, తెలుగు భాషా సంస్కృతులకు ఎంతో సేవ చేస్తున్నారని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు డాక్టర్ కె వి రమణ అన్నారు.. హైదరాబాదులోని త్యాగరాయగాన సభలోని కళా సుబ్బారావు కళావేదికపై తెలుగు మల్లి ఆస్ట్రేలియా మల్లి- న్యూజిలాండ్ మరియు శ్రీ త్యాగరాయగానసభ సంయుక్త ఆధ్వర్యంలో సిడ్నీ ఆస్ట్రేలియాకు సంబంధించిన తూములూరి వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి రచించిన భారతీయ విలాసము (శ్రీ కాళిదాసు చరిత్ర నాటకం గ్రంథా విష్కరణ సభలో ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ కె.వి.రమణ మాట్లాడుతూ తెలుగు మల్లి అంతర్జాతీయ వ్యవస్థాపకులు

శ్రీ మల్లికేశ్వరరావు కొంచాడ సుదూర ప్రాంతంలో ఉన్న తెలుగు భాష ప్రేమికుడని, వారు ప్రచురించిన కాళిదాసు గ్రంథాన్ని తెలంగాణ రాష్ట్రంలో 300 గ్రంథాలయాలకు ఉచితంగా అందించటం అందరూ ఆదర్శవంతంగా తీసుకోవాలని అన్నారు.. సాంకేతిక పరిజ్ఞానం ఎంత అభివృద్ధి చెందినా గ్రంథాల విలువ తగ్గదని అన్నారు.. సభలో పాల్గొన్న తెలంగాణ గ్రంథాలయ సంస్థ చైర్మన్ అయాచితం శ్రీధర్ మాట్లాడుతూ 'భారతీ విలాసము' నాటక గ్రంథాన్ని తెలంగాణ రాష్ట్రంలోని 300 గ్రంథాలయాలకు వితరణ చేసి ఎంతోమందికి కాళిదాసు చరిత్ర తెలుసుకునే అవకాశం కలగజేసారని అన్నారు.వ్యక్తిత్వ వికాస నిపుణులు ఆకెళ్ళ రాఘవేంద్ర మాట్లాడుతూ ప్రపంచంలోని గొప్ప కవులలో కాళిదాసు ఒకరని ఆయన గురించి తెలుసుకోవడం నేటి యువత బాధ్యత అని అన్నారు.. సభకు అధ్యక్షత వహించిన వంశీ వ్యవస్థాపకులు, శిరోమణి డాక్టర్ వంశీ రామరాజు మాట్లాడుతూ తెలుగువారు ఆస్ట్రేలియాలో ప్రదర్శించిన నాటకాన్ని తెలుగు రాష్ట్రాల్లో  ప్రదర్శించవలసినదిగా మల్లికేశ్వరరావు కొంచాడ ని ఆహ్వానించారు.రచయితలు తాము ప్రచురించిన గ్రంథాలను ఉచితంగా తెలంగాణ రాష్ట్రంలోని గ్రంథాలయాలకు ఇచ్చి సహకరించవలసిన అవసరం ఉంది అన్నారు.ఈ విషయంలో విదేశాల్లో ఉన్న తెలుగు రచయితలు తీసుకుంటున్న చర్య అభినందనీయమని అన్నారు..

తెలుగు మల్లి వ్యవస్థాపకులు మల్లికేశ్వర రావు కొంచాడ మాట్లాడుతూ  2-4-2022 నాడు ఆస్ట్రేలియాలో మహాకవి కాళిదాసు నాటకం రంగస్థలంపై ప్రదర్శించడం జరిగిందని, కాళిదాసు జీవన గమనంలో ఎటువంటి వివాదాస్పద అంశాలు లేకుండా, సాహిత్య విలువలను ఇనుమడింప చేస్తుందని చేసే విధంగా, సంస్కృతాంధ్రలలో రసవత్తరమైన, జనరంజకమైన ఘట్టాలతో ప్రేక్షకుల నాడికి అనుగుణంగా 'భారతి విలాసం' అనే పేరున ఈ నాటకం రచించడం జరిగిందని అన్నారు.‌. తాము తెలుగులో ప్రచురించే గ్రంథాలను, రెండు తెలుగు రాష్ట్రాల గ్రంథాలయాలకు ఉచితంగా ఇచ్చే ఏర్పాటు చేస్తామని అన్నారు.

 ఈ కార్యక్రమంలో మొదట సహజ గాయని సుజా రమణ అన్నమయ్య కీర్తనలు ఆలపించారు...‌ జె వి పబ్లికేషన్స్ అధినేత్రి జ్యోతి వలబోజు మాట్లాడుతూ ఇప్పటికి తమ సంస్థ 200కు పైగా తెలుగు పుస్తకాలు ప్రచురించడం జరిగిందని, కాళిదాసు నాటకం తమ సంస్థ ద్వారా ప్రచురించడం గర్వకారణంగా ఉందని అన్నారు.. వేగేశ్న ఫౌండేషన్ చైర్ పర్సన్ శైలజ సుంకరపల్లికి ఈ వేదికపై గ్రంథాన్ని బహూకరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com