అమెరికాలోని కమ్యూనిటీ కాలేజ్ ఇనీషియేటివ్ కార్యక్రమానికి ఎంపికైన GMRVF విద్యార్థిని

- July 19, 2022 , by Maagulf
అమెరికాలోని కమ్యూనిటీ కాలేజ్ ఇనీషియేటివ్ కార్యక్రమానికి ఎంపికైన GMRVF విద్యార్థిని

హైదరాబాద్‌: అమెరికా విదేశాంగ శాఖ స్పాన్సర్ చేసే కమ్యూనిటీ కాలేజ్ ఇనిషియేటివ్ ప్రోగ్రాం (CCIP) కింద జీఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ (GMRVF) నిర్వహిస్తున్న విద్యాసంస్థలో చదువుతున్న ‘గిఫ్టెడ్ ఛైల్డ్’ అయిన ఒక విద్యార్థిని అమెరికాలో తనకు నచ్చిన కోర్సును అభ్యసించే అవకాశాన్ని పొందింది. 

యండవ రేష్మ ఇటీవలే తనకు ఇష్టమైన కోర్సును అభ్యసించడానికి అమెరికా వెళ్లింది. ప్రస్తుతం రేష్మ GMR గ్రూప్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ విభాగమైన GMRVF నిర్వహిస్తున్న రాజాంలోని SGCSR కాలేజీలో బీఎస్సీ అభ్యసిస్తోంది. ఈ ఏడాది CCIPలో పాల్గొనడానికి హైదరాబాద్ అమెరికా కాన్సులేట్ జనరల్ ఇటీవలే రేష్మను ఎంపిక చేసింది.

రేష్మ ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా, రాజాంలోని మెంతిపేట ఎస్సీ కాలనీలో ఉంటుంది. రేష్మ వయసు ఒక ఏడాదికన్నా తక్కువ ఉన్నపుడు తల్లి మరణాంతరం, ఆమె తండ్రి ఆమెను వదిలిపెట్టి పోయాడు. అప్పటినుంచి ఆమె సీనియర్ సిటిజన్ పింఛన్ పొందుతున్న తన అమ్మమ్మ వద్ద పెరిగింది. ఆ తర్వాత ఆమె ‘గిఫ్టెడ్ చిల్డ్రన్’ పథకానికి ఎంపికైంది.  ఈ పథకం కింద వెనుకబడిన సమూహాలకు చెందిన సమర్థత కలిగిన పిల్లలను  గుర్తించి, ప్రోత్సహిస్తారు. వారికి ఒకటో తరగతి నుంచి వారు తమ మొదటి ఉపాధిని పొందేవరకు ఖర్చులు భరిస్తారు. రేష్మ ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకుని చదువులో రాణించింది. జీఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ సహాయంతో ఈ సంవత్సరం CCIP ఎంపిక ప్రక్రియలోని అన్ని దశలలో ఉత్తీర్ణురాలైంది. ఆమె CCIP కింద అమెరికాలోని సెడార్ రాపిడ్స్‌లో ఉన్న కిర్క్‌వుడ్ కమ్యూనిటీ కాలేజ్‌లో అగ్రికల్చరల్ జియో స్పేషియల్ టెక్నాలజీని అభ్యసించనుంది.   

రేష్మ ఎంపికపై, డాక్టర్ అశ్వనీ లోహానీ, సీఈఓ-జీఎంఆర్‌వీఎఫ్ మాట్లాడుతూ, “ఉన్నత విద్యను అభ్యసించే అవకాశం లేని విద్యార్థులకు ఆ అవకాశం కల్పించి, వారికి సాధికారత కూర్చడానికి జీఎంఆర్‌వీఎఫ్ కట్టుబడింది. గత కొన్నేళ్లుగా జీఎంఆర్‌వీఎఫ్ విద్యార్థులు సీసీఐపీకి ఎంపికవుతూ ఉన్నారు. స్థానికంగా ఉండే వెనుకబడిన సమూహాలకు చెందిన పిల్లలకు అంతర్జాతీయ స్థాయిలో చదివే అవకాశం కల్పించడమే ఈ కార్యక్రమం లక్ష్యం.  దీని వల్ల ఆ పిల్లలు వివిధ ఖండాలకు చెందిన సంస్కృతులను తెలుసుకోవడం వీలౌతుంది.’’ అన్నారు.   

అమెరికా విదేశాంగ శాఖ ఆధ్వర్యంలోని CCIP కింద, ఇతర దేశాల నుండి అర్హులైన అభ్యర్థులు ఏదైనా ఒక అమెరికన్ కమ్యూనిటీ కాలేజీలో ఒక సంవత్సరం చదువుకోవచ్చు. ఈ కార్యక్రమం కింద కోర్సులకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు జీఎంఆర్‌విఎఫ్ ఉచిత శిక్షణ, మార్గదర్శకాలను అందించింది. ఎంపిక చేసిన అభ్యర్థుల కోర్సు సంబంధిత ఖర్చులు, విమాన ఛార్జీలు, బోర్డింగ్ లాడ్జింగ్, పుస్తకాలు, వైద్య సహాయం తదితర ఖర్చులను అమెరికన్ ప్రభుత్వమే భరిస్తుంది. అభ్యర్థులకు నెలవారీ స్టైఫండ్ కూడా చెల్లిస్తారు.

హైదరాబాద్‌లోని యుఎస్ కాన్సులేట్‌తో భాగస్వామ్యం కలిగిన జీఎంఆర్‌విఎఫ్, 2015 నుండి CCIP కార్యక్రమం ద్వారా తెలుగు విద్యార్థులు అమెరికాలో చదవడానికి వీలు కల్పిస్తోంది. రేష్మ ఎంపికతో, ఇప్పటివరకు  జీఎమ్‌ఆర్‌విఎఫ్ ద్వారా CCIP కి ఎంపికైన విద్యార్థుల సంఖ్య 11 కి చేరుకుంది. అమెరికాలో కోర్సులు పూర్తి చేసి తిరిగి వచ్చిన కొందరు విద్యార్థులు సుప్రసిద్ధ సంస్థలలో ఉపాధి పొందగా, మిగతా వారు ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com