అభ్యుదయ కవి సామ్రాట్

- July 22, 2022 , by Maagulf
అభ్యుదయ కవి సామ్రాట్

తెలంగాణ సాయుధ పోరాట సమయంలో తన కలంతో నిజాం సామ్రాజ్యాన్ని గడగడలాడించిన వ్యక్తి మహాకవి దాశరథి. నేడు ఆయన 97వ జయంతి సందర్భంగా క్లుప్తంగా మీ కోసం. 

దాశరథి గా సుప్రసిద్ధులైన మహాకవి దాశరథి కృష్ణమాచార్యులు 1925 జూలై 22 వ తేదీన ఉమ్మడి వరంగల్ జిల్లా చిన్న గూడూరు గ్రామంలో జన్మించారు. బాల్యంలోనే తెలుగు , ఉర్దూ భాషల మీద పట్టు సాధించారు. 

సనాతన వైదిక కుటుంబానికి చెందిన దాశరథి వారు తొలి నుండి విప్లవ వాది గా ముద్ర పడ్డారు. కుటుంబ పోషణ కోసం పలు ఉద్యోగాలు చేసినప్పటికీ కవిగానే అత్యంత సంతృప్తి చెందారు. 

దేశానికి స్వాతంత్య్రం వచ్చాక కూడా తెలంగాణ ప్రాంతంలో నిజాం పాలన కింద ప్రజలు తీవ్రంగా నలిగిపోతున్నారు. అమాయకుల మీద  దారుణాలకు , దాష్టికలకు లెక్కే లేకుండా పోయింది. నిరంకుశ పాలనకు చరమగీతం పాడేందుకు కంకణం కట్టుకున్న దాశరథి వారు తన కవిత్వం ద్వారా ఏకంగా నిజాం నే ఉక్కిరబిక్కిరి చేస్తూ వచ్చారు. తెలంగాణ ఉద్యమ సమయంలోనే "నా తెలంగాణ కోటి రతనాల వీణ" అని నినాదించి ఉద్యమకారులకు స్ఫూర్తి ప్రదాతగా నిలిచారు. 

నిజాం పాలన రద్దు అనంతరం సాహిత్య రంగాన్ని అభివృద్ధి చేసేందుకు పూనుకొని తెలుగు సాహిత్య రంగం నూతన పుంతలు తొక్కడంలో దాశరథి వారి పాత్ర మరువలేనిది. ఆయన రచనలు ఈనాటికి సాహితి ప్రియులను అలరిస్తూనే ఉన్నాయి. 

దాశరథి వారికి తన మాతృభూమి తెలంగాణ అంటే ఎంతో మమకారం.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో భాగమైన తెలంగాణ ప్రాంత ప్రజలు మిగిలిన ప్రాంతాల ప్రజల్లాగే సామాజికంగా,ఆర్థికంగా, సాంస్కృతికంగా అభివృద్ధి చెందాలి ఆయన చివరి శ్వాస వరకు కోరుకుంటునే వచ్చారు. 

తెలుగు సాహిత్య రంగానికి విశేషంగా కృషి చేసిన దాశరథి వారు భౌతికంగా మనతో లేకపోయినా, ఆయన నింపిన స్పూర్తి మాత్రం ఎల్లప్పుడూ మనతోనే ఉంటుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com