నవరస నటనా సార్వభౌమ

- July 25, 2022 , by Maagulf
నవరస నటనా సార్వభౌమ

విలక్షణమైన నటులకు పెట్టింది పేరు తెలుగు చలచిత్ర పరిశ్రమ, నాటి నుండి నేటి వరకు ఎందరో తమదైన నటనా శైలితో ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. అటువంటి వారిలో ముఖ్యులు కైకాల సత్యనారాయణ ఒకరు. నేడు ఆయన 87 వ జన్మదినం సందర్భంగా ఆయన జీవిత ప్రయాణం గురించి మీకోసం. 

కళలకు పుట్టినిల్లు అనగానే ముందుగా గుర్తుకు వచ్చే పేరు కృష్ణా జిల్లా. ఈ జిల్లా నుండి ఎందరో ప్రముఖులు వెండితెరను ఏలారు. అటువంటి కృష్ణా జిల్లా లోని గుడివాడ దగ్గర్లోని కౌతవరం అనే కుగ్రామంలో జన్మించారు కైకాల సత్యనారాయణ. 

విద్యార్థి దశలోనే నటన పట్ల ఆకర్షితుడై పలు నాటకాల్లో నటించారు. ఉన్నత విద్యను పూర్తి చేసిన తర్వాత నటన పట్ల ఉన్న మక్కువతో అవకాశాలు కోసం మద్రాస్ వెళ్లి చిన్న చిన్న వేషాలతో మొదలై క్రమంగా తన దైన నటనా శైలితో ప్రేక్షకులను అలరించారు. 

 తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అంచెలంచెలుగా ఎదుగుతూ విభిన్నమైన పాత్రలను పోషించి మెప్పించిన సత్యనారాయణ గారు ఆనాటి అగ్రశ్రేణి నటుల కంటే ఎక్కువ పారితోషికం సైతం అందుకున్నారు. 

హీరోతో సమానంగా పాత్రలు పోషించిన సత్యనారాయణ తెలుగు చలన చిత్ర పరిశ్రమలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ కు మంచి గుర్తింపు రావడంలో కీలకమైన పాత్ర పోషించారు. 

సత్యనారాయణ గారు నటుడిగానే కాకుండా రాజకీయాల్లో సైతం రాణించారు.నటుడు ఎన్టీఆర్ మీద ఉన్న అభిమానంతో ఆయన స్థాపించిన తెలుగుదేశం పార్టీలో చేరి 1996 లో మచిలీపట్నం నుండి లోక్ సభ కు ఎన్నికయ్యారు. 

సుమారు 6 దశాబ్దాల సినీ ప్రయాణంలో పరిశ్రమలోని అన్ని వర్గాల వారికి కావాల్సిన వ్యక్తిగా, అజాత శత్రువుగా నిలిచిన సత్యనారాయణ గారు మరిన్ని పుట్టిన రోజులు జరుపుకోవాలి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com