నేటి నుంచి కాంగ్రెస్ పార్టీ దేశ వ్యాప్తంగా ఆందోళనలు

- August 17, 2022 , by Maagulf
నేటి నుంచి కాంగ్రెస్ పార్టీ దేశ వ్యాప్తంగా ఆందోళనలు

న్యూ ఢిల్లీ: ‘మహంగాయీ చౌపాల్’ పేరిట కాంగ్రెస్ పార్టీ నేటి నుంచి దేశ వ్యాప్తంగా ర్యాలీలు తీయనుంది. దేశంలో పెరిగిపోతోన్న ధరలు, నిరుద్యోగంపై దేశంలోని అన్ని అసెంబ్లీ నియోజక వర్గాల్లో నిరసనలు తెలపనుంది.ఈ మెగా ర్యాలీ ఈ నెల 28న ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో ముగియనుంది. మండీలు, రీటైల్ మార్కెట్ల వద్ద సమావేశాలు కూడా నిర్వహిస్తామని కాంగ్రెస్ పేర్కొంది. ఆ రోజున కాంగ్రెస్ సీనియర్ నేతలు ప్రసంగిస్తారు.

దేశంలో పెరిగిపోయిన నిరుద్యోగం, ధ‌ర‌లపై కాంగ్రెస్ పార్టీ ఆగస్టు 5న కూడా నిరసనలు తెలిపిన విషయం తెలిసిందే. పార్ల‌మెంటు నుంచి రాష్ట్రప‌తి భ‌వ‌న్ వ‌ర‌కు కూడా ఆ రోజున ర్యాలీ నిర్వహించగా ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. దేశంలో నెలకొన్న సమస్యలను పక్కదారి పట్టించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఇతర అంశాలను తెరమీదకు తీసుకొస్తున్నారని తాజాగా కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ అన్నారు.

కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలియజేస్తూ రానున్న రోజుల్లో తమ పోరాటాన్ని ఉద్ధృతం చేస్తామని జైరాం రమేశ్ చెప్పారు. దేశ ఆర్థిక వ్యవస్థను మోదీ సమర్థంగా నడిపించకపోతుండడంతో ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన చెప్పారు. కాగా, నిరుద్యోగం, ధ‌ర‌ల పెరుగుదలపై ఆందోళనలు నిర్వహించే బాధ్యతలను ఇప్పటికే ఆయా నేతలకు కాంగ్రెస్ పార్టీ అప్పగించి, ప్రణాళికలు సిద్ధం చేసుకుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com