ఉక్రెయిన్‭కు అమెరికా భారీ ప్యాకేజ్..

- August 20, 2022 , by Maagulf
ఉక్రెయిన్‭కు అమెరికా భారీ ప్యాకేజ్..

రష్యాతో తీవ్ర యుద్ధం చేస్తోన్న ఉక్రెయిన్‭కు అమెరికా భారీ ప్యాకేజీ ప్రకటించింది. 775 మిలియన్ డాలర్ల విలువైన హిమర్స్ మిసైల్స్, అర్టిలరీ, మైన్ క్లియరింగ్ సిస్టమ్స్‭తో కూడిన ఆయుధ సమాగ్రిని పంపనున్నట్లు శుక్రవారం అమెరికా డిఫెన్స్ విభాగం వెల్లడించింది. ప్రెసిడెన్షియల్ డ్రాడౌన్ ద్వారా ఈ ప్యాకేజీని పంపనున్నట్లు ఒక సీనియర్ అధికారి పేర్కొన్నారు. తాజాగా ప్రకటించిన ప్యాకేజీతో కలిసి 2021 ఆగస్టు నుంచి ఉక్రెయిన్‭కు అమెరికా మొత్తం 10 బిలియన్ డాలర్ల పీడీఏ ప్యాకేజీని పూర్తి చేసుకుంది.

తాజా ప్యాకేజీ 18వది కాగా, ఇందులో హై మొబిలిటీ అర్టిలరీ రాకెట్ సిస్టమ్స్ ప్రధానంగా చర్చకు వస్తోంది. వీటి ప్రత్యేకత ఏంటంటే.. ఒక సారి దాడి చేశాక వీటిని శత్రువు పసిగట్టి ఎదురు దాడి చేయకుండా అక్కడి నుంచి వేగంగా తప్పించుకునే అవకాశం ఉంటుంది. 186 నుంచి 310 మైళ్ల దూరంలోని లక్ష్యాలను ఇవి ఛేదించగలవు. కాగా, ఒకేసారి ఇంత పెద్ద మొత్తంలో ఆయుధాలు పంపడం ఇదే మొదటిసారని అమెరికా రక్షణ అధికారి ఒకరు తెలిపారు.

అయితే ఈ ఆయుధాలు పంపే క్రమంలో ఉక్రెయిన్‭కు అమెరికా ఒక షరతు విధించింది. రష్యా దాడులను నిలువరించడానికి మాత్రమే వీటిని వాడుకోవాలని, రష్యా భూభాగంలో దాడి చేయడానికి కాదని అమెరికా స్పష్టం చేసింది. నాటో-రష్యా మధ్య తాము యుద్ధాన్ని కోరుకోవడంలేదని స్పష్టం చేసింది. ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం ప్రారంభమై నెలలు గడుస్తున్న సమస్య సద్దుమణగడం లేదు. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని ప్రపంచ దేశాలు సూచించినప్పటికీ ఇదరు దేశాధినేతలు యుద్ధ రంగంలో తలమునకలై ఈ సూచనలను పట్టించుకోవడం లేదు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com