విలక్షమైన వ్యక్తిత్వం గల జనసేనాని

- September 02, 2022 , by Maagulf
విలక్షమైన వ్యక్తిత్వం గల జనసేనాని

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆ పేరుకు ఓ బ్రాండ్ ఉంది. ఓ రేంజ్ ఉంది. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్ ఈరోజు స్టార్ హీరోగా ఎదిగి కోట్లాదిమంది అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. నేడు ఆయన 51వ పుట్టిన రోజు.సెప్టెంబర్‌ 2 వచ్చిందంటే చాలు పవన్‌ అభిమానులకు ఒక పండగా వచ్చినట్లే. 

అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో హీరోగా పరిచయం అయ్యి.. తొలి సినిమాతోనే ప్రేక్షకులను ఆకట్టుకున్నారు పవన్. అంచలంచలుగా ఎదుగుతూ.. తనదైన మ్యానరిజంతో.. యాటిట్యూడ్ తో.. స్టైల్ తో యూత్ లో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్నారు పవన్ కళ్యాణ్.  

పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం సామాన్యుడి నుంచి సెలబ్రెటీ వరకూ ఆయనకు అభిమానులను చేసింది. అవును జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ వ్యక్తిత్వపరంగా ఒక విలక్షణమైన వ్యక్తి. అది తనతో పరిచయం ఉన్నవాళ్ళకి, తన అభిమానులకి కూడా బాగా తెలుసు. తనలో ఎక్కువ సామజిక సృహ దేశంకోసం మరేదో చెయ్యాలనే తపన, తన మాటల్లో తన చేతల్లో తన సినిమాల్లో మనం తరచూ చూస్తుంటాం. 

అది బహుశా ఆయన పెరిగిన వాతావరణం వల్ల కావచ్చు లేదా తను చుట్టూ చుసిన సమాజం కావచ్చు లేదా తనకు స్వయంగా ఎదురైన అనుభవాలు కావచ్చు లేదా తాను ఎక్కువగా చదివిన సోషలిస్టు, కమ్యూనిస్టు తరహా పుస్తకాల ప్రభావం వల్ల కూడా కావచ్చు. 

అందువల్ల ఆయనలో ఈ దేశంలో ఈ సమాజంలో ఉన్న అంతరాలు మరియు ప్రజలకి జరుగుతున్న అన్యాయం పట్ల నిరంతర మధనం వల్ల ఆయన అలా భిన్నంగా ఉన్నారని కూడా చెప్పవచ్చు. తను ఒకపక్క సినిమాలు చేస్తున్నప్పటికీ తన వంతుగా నమాజానికి దేశానికి ఏమి చెయ్యాలి అనే బాధ తనకి ఖుషి సినిమా నుండే ఉండేదని ఆయనే స్వయంగా చెప్పారు కూడా. 

సమాజంలో జరుగుతున్న అన్యాయాలు అక్రమాలు అవినీతిపరుల అరాచకాలు ఇవన్ని తెలిసిన నేను కూడా ఇంట్లో కూర్చొని నా జీవితం నా సినిమాలు అని చూసుకుంటే ఇక ప్రజల సమస్యలు ఎలా తీరతాయని ఆయన అంటారు. మరోవైపు సామాన్యుల వెతలు ఎవరు చూస్తారనే ఆవేదన ఉండడంవల్ల తాను జనసేన పార్టీ పెట్టేలా చేశాయని స్వయంగా పవన్‌ కళ్యాణ్‌ పోరాటయాత్ర సభల్లో చెప్పినమాట కాదనలేని సత్యం. 

సమాజహితం కోసం ఏదైనా చెయ్యాలనే ఆలోచనతో ఒక స్వచ్చంద సంస్థ పెడితే, న్యాయం జరుగుతుందని ఆయన ఆలోచించి పెట్టిందే కామన్‌ మాన్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌(సీపీఎఫ్‌) అనే స్వచ్చంద సంస్థ. 

తను అనుకున్నది చేయాలనే మనస్థత్వం ఉన్న ఆయన, ప్రజలకి న్యాయం చెయ్యాలంటే ముందుకే వెళ్ళాలని, ఎవరు అడ్డు చెప్పినా ఆగనంటూ తనే సొంత పార్టీ దిశగా అడుగులు వేసుకుంటూ తాను ఒక్కడుగా, ఇంత పెద్ద రాజకీయ చదరంగంలోకి ప్రజలే న్యాయనిర్దేతలుగా 14 మార్చి 2014న జనసేన పార్టీ ఆవిర్భావానికి శ్రీకారం చుట్టారు. 

ఆయనే స్వయంగా ఎన్నోసార్లు చెప్పినట్టు, తను గొప్ప నటుడేమి కాదు. తానొక ఆక్సిడెంటల్‌ నటుడని ఎన్నో సందర్భాల్లో చెప్పారు కూడా. బహుశా భారత దేశ చలచిత్ర పరిశ్రమలో తన నటన గురించి ఇలా చెప్పుకున్న మరో నటుడు లేడంటే అతిశయోక్తి కాదు. కానీ తన వ్యక్తితం, భిన్నశైలి నటుడిగా ఆయనకు విపరీతమైన అభిమానులని సంపాదించి పెట్టిందనడంలో సందేహం లేదు. 

తన నటనతో ప్రేక్షకులను అలరించిన పవన్ రాబోయే కాలంలో రాజకీయాల్లో మరింతగా రాణించాలి ఆశిస్తూ మరన్ని పుట్టిన రోజులు జరుపుకోవాలి. 

                     -- డి.వి. అరవింద్ (మా గల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com