ఆసియా కప్ 2022: అఫ్గానిస్థాన్ పై భారత్ ఘన విజయం...
- September 08, 2022
దుబాయ్: ఆసియా కప్‌లో టీమ్ ఇండియా విజయంతో ప్రయాణం ముగించింది.ఇప్పటికే ఫైనల్ అవకాశాలు కోల్పోయి.. నామమాత్రమైన మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్ పై భారత్ 101 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది.
తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్‌ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ (122*:61 బంతుల్లో 12 ఫోర్లు, 6 సిక్స్‌లు) సెంచరీతో అదరగొట్టాడు. అనంతరం లక్ష్య ఛేదనలో అఫ్గాన్ నిర్ణీత 20 ఓవర్లలో 111/8 స్కోరుకే పరిమితమైంది. భువనేశ్వర్ కుమార్ (4-1-4-5) అద్భుత బౌలింగ్ ప్రదర్శన చేసి కీలక పాత్ర పోషించాడు. ఒకే ఓవర్‌లో ఓపెనర్లను పంపిన భువీ తన స్పెల్‌ను కట్టుదిట్టంగా వేశాడు. అఫ్గాన్ బ్యాటర్లలో ఇబ్రహీం జద్రాన్ (64*) సాధించగా.. రషీద్ ఖాన్ (15), ముజీబ్ (18) మాత్రమే రెండంకెల స్కోరు సాధించారు. హజ్రతుల్లా జజాయ్ (0), గుర్బాజ్ (0), నజీబుల్లా జద్రాన్ (0) డకౌట్‌గా పెవిలియన్‌కు చేరారు. భువనేశ్వర్ కాకుండా అర్ష్‌దీప్ సింగ్, దీపక్ హుడా, అశ్విన్ తలో వికెట్ తీశారు. భారత కీపర్ దినేశ్ కార్తిక్ ఇన్నింగ్స్ చివరి ఓవర్ వేయడం గమనార్హం.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ బ్యాటర్లు స్వేచ్ఛగా ఆడారు. ఓపెనర్లు కేఎల్ రాహుల్ (62), విరాట్ కోహ్లీ (122*) ఆరంభంలో ఆచితూచి పరుగులు రాబట్టారు. క్రీజ్‌లో కుదురుకున్నాక ధాటిగా ఆడేశారు. తొలి వికెట్‌కు 119 పరుగులను జోడించారు. అయితే రాహుల్ ఔటైన తర్వాత విరాట్ మరింత రెచ్చిపోయాడు. కేవలం 52 బంతుల్లోనే శతకం సాధించిన కోహ్లీ.. ఇంకో తొమ్మిది బంతుల్లోనే మరో 22 పరుగులు రాబట్టాడు. రిషభ్ పంత్ (20*)తో కలిసి విరాట్ మూడో వికెట్‌కు 87 పరుగులు జోడించాడు. సూర్యకుమార్ యాదవ్ (6) విఫలమయ్యాడు. అఫ్గాన్ బౌలర్లలో ఫరీద్ అహ్మద్ 2 వికెట్లు తీశాడు. దాదాపు వెయ్యి రోజుల తర్వాత కోహ్లీ శతకం బాదాడు. అంతేకాకుండా అంతర్జాతీయ టీ20ల్లో మొదటి సెంచరీ ఇదే కావడం విశేషం.
తాజా వార్తలు
- ఆసియా కప్ విజేతగా భారత్
- టీ-చిప్ సెమీకాన్ కానిస్టిట్యూషన్ సమ్మిట్ ఘనవిజయం
- పవన్ కల్యాణ్ ,చంద్రబాబు సమావేశం ముగింపు..
- NATS మిస్సౌరీ విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం
- మలేషియాలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- బీసీసీఐ అధ్యక్షుడిగా మిథున్ మన్హాస్
- సాయుధ పోరాటాలలో పిల్లల రక్షణకు ఖతార్ పిలుపు..!!
- ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదాన్ని త్వరగా పరిష్కరించండి..!!
- దుబాయ్ లో డ్రైవర్ లెస్ భారీ వాహనాల కోసం పైలట్ రూట్స్..!!
- హవల్లిలో అక్రమ గర్భస్రావ క్లినిక్..ప్రవాసి అరెస్టు..!!