‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’:రివ్యూ

- September 16, 2022 , by Maagulf
‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’:రివ్యూ

నటీనటులు: సుధీర్ బాబు, కృతి శెట్టి, వెన్నెల కిషోర్, అవసరాల శ్రీనివాస్, రాహుల్ రామకృష్ణ తదితరులు
నిర్మాతలు: మహేంద్రబాబు, కిరణ్ బొల్లపల్లి
సంగీతం: వివేక్ సాగర్
సినిమాటోగ్రఫీ: పి.జి.విందా
రచన, దర్శకత్వం, స్ర్కీన్‌ప్లే: ఇంద్రగంటి మోహన్ కృష్ణ

‘సమ్మోహనం’ అనే సినిమాతో ఆల్రెడీ ఈ తరహా కాన్సెప్ట్ టచ్ చేసిన కాంబినేషన్ ఇంద్రగంటి మోహన్ క్రిష్ణ, సుధీర్ బాబు కాంబినేషన్. ఆ సినిమా సో సో అనిపించుకుంది. మళ్లీ అదే తరహా కాన్సెప్ట్‌, సేమ్ హీరోతో సినిమా అంటే అందుకు గట్స్ వుండాలి. అందుకే ఇంద్రగంటి గట్స్ వున్న డైరెక్టర్. అయితే, అంత గట్టిగా సేమ్ కాన్సెప్ట్‌తో రిస్క్ చేశాడంటే, ‘సమ్మోహనం’ని మించి ఈ సినిమాలో ప్రత్యేకమైన అంశం ఏదో వుండి వుండాలి. వుందా మరి.? తెలుసుకోవాలంటే ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ కథలోకి వెళ్లాల్సిందే.

కథ:
సక్సెస్‌పుల్ స్టోరీలతో సినిమాలు తెరకెక్కించి డైరెక్టర్‌గా మంచి పేరు తెచ్చుకుంటాడు నవీన్ (సుధీర్ బాబు. ఒకానొక టైమ్‌లో ఆయనను ఓ డిఫరెంట్ అంశం బాగా ఇన్‌స్పైర్ చేస్తుంది. ఆ ఇంట్రెస్టింగ్ కథాంశంతోనే తన తర్వాతి సినిమా తెరకెక్కించాలనుకుంటాడు నవీన్. ఆ క్రమంలో తన సినిమాలో హీరోయిన్‌‌కి ఎలాంటి క్వాలిటీస్ అయితే వుండాలని కోరుకుంటాడో, ఖచ్చితంగా అలాంటి క్వాలిటీసే డాక్టర్ అలేఖ్య (కృతి శెట్టి)లో చూస్తాడు నవీన్ బాబు. అయితే, సినిమాలంటే అస్సలు ఇష్టపడని అలేఖ్యను ఒప్పించి తన సినిమాలో హీరోయిన్‌గా ఎలా తెచ్చుకుంటాడు.? అసలు నవీన్‌ని అంతలా ఇన్‌స్పైర్ చేసిన ఆ అంశం ఏంటీ.? అనేది తెలియాలంటే ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ సినిమాని ధియేటర్‌లో చూడాల్సిందే. 

నటీ నటుల పనితీరు:
స్టార్ డైరెక్టర్‌ నవీన్ పాత్రలో సుధీర్ బాబు చాలా తేలిగ్గా ఒదిగిపోయాడు. కానీ, సుధీర్ బాబు ఎంచుకునే పాత్రల లిస్టులో పెద్దగా చెప్పుకోదగ్గ స్థాయి పాత్ర కాదనిపిస్తుంది ఈ సినిమాలో సుధీర్ పోషించిన పాత్ర. కళ్ల డాక్టర్‌గా ఓ వైపు, రీల్ హీరోయిన్‌గా ఇంకోవైపు కృతిశెట్టికి మంచి స్కోపున్న పాత్ర దొరికింది. తన పాత్రకు పూర్తిగా న్యాయం చేసింది. మిగిలిన పాత్రధారులు తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు.

సాంకేతిక వర్గం పని తీరు:
సినీ నేపథ్యంలోనే ఆల్రెడీ తెరకెక్కించిన ‘సమ్మోహనం’ సినిమాని సరదా సరదాగా తెరకెక్కించి మరీ హిట్టు సినిమా అనిపిచుకోకపోయినా ప్రేక్షకుల మన్ననలు అందుకున్నారు ఇంద్రగంటి. ఆ సినిమా నుంచి వేరియేషన్ చూపించడానికై ఈ సినిమాని సీరియస్ అండ్ సెంటిమెంట్ టోన్‌లో చెప్పే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నమే విఫల ప్రయత్నంగా మారింది. మ్యూజిక్‌లో పెద్దగా మ్యాజిక్ అయితే జరగలేదు. ఎడిటర్ గారు తన కత్తెరకు ఇంకాస్త పదును పెట్టి వుంటే బావుండేది. డైలాగ్స్ కూడా ఓకే అంతే. విజువల్స్ పరంగా పి.జి.విందా పూర్తి న్యాయం చేశారు.  

ప్లస్ పాయింట్స్:
కృతి శెట్టి పర్‌ఫామెన్స్,
ప్లజెంట్‌గా కనిపించే విజువల్స్

మైనస్ పాయింట్స్:
వీక్ స్టోరీ, స్లో నెరేషన్, 
ఆకట్టుకోలేని బ్యాక్ గ్రౌండ్ స్కోర్

చివరిగా:
‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’. ఓటీటీలో చెబితే వింటారేమో. కానీ, ధియేటర్‌లో చెబితే వినడం కొద్దిగా కష్టమే బాస్.!

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com