ప్రతి ఏటా కేంద్రం ఆధ్వర్యంలో అధికారికంగా విమోచన దినం జరుపుతాం: అమిత్ షా

- September 17, 2022 , by Maagulf
ప్రతి ఏటా కేంద్రం ఆధ్వర్యంలో అధికారికంగా విమోచన దినం జరుపుతాం: అమిత్ షా

హైదరాబాద్: ఎందరో మహనీయులు సర్వస్వాన్ని త్యాగం చేసి సాధించుకున్న స్వాతంత్ర్య దినోత్సవాన్ని విమోచన దినోత్సవంగా ఘనంగా జరుపుకునేందుకు తెలంగాణలో అధికారంలో ఉన్న పార్టీ ఎందుకు సంకోచిస్తోందని కేంద్రహోంశాఖ మంత్రి  అమిత్ షా ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో ఓట్లకోసం  ఇక్కడి ప్రజల ఆకాంక్ష అయిన విమోచన  దినోత్సవాన్ని జరుపుతామని డాంభికాలు పలికి ఇప్పుడు రాజకీయ  లబ్ధి కోసం విమోచనాన్ని విస్మరించారన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరుపుకోవాలనేది ఇక్కడి ప్రజల చిరకాల ఆకాంక్ష అని, దీన్ని సాకారం చేసే లక్ష్యంతోనే కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని అమిత్ షా అన్నారు. ప్రతి ఏటా ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవాలను కేంద్రం తరపున అధికారికంగా నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు.
శనివారం, సెప్టెంబర్ 17న హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని పరేడ్ గ్రౌండ్స్ లో కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన విమోచన మహోత్సవాల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అమిత్ షా.. ఈ సందర్భంగా మాట్లాడుతూ, హైదరాబాద్ సంస్థానానికి స్వాతంత్ర్యాన్ని కల్పించేందుకు ఎందరోమంది వీరులు, నిజాం అరాచకాలను, అత్యాచారాలను సహించిన విషయాన్ని నేటి తరం మరిచిపోవద్దన్నారు. వారి త్యాగం, ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ పోలీసు చర్య కారణంగానే హైదరాబాద్ సంస్థానం భారత ప్రభుత్వంలో విలీనం అయిందన్నారు. ప్రాణత్యాగాలు చేసిన వారందరినీ స్మరించుకుంటూ వారి త్యాగాల స్ఫూర్తితో నేటి యువతరం దేశభక్తిని, జాతీయ భావజాలాన్ని అలవర్చుకోవాలని అమిత్ షా సూచించారు.

తెలంగాణ విమోచనం చెందిన 74 ఏళ్ల తర్వాత అధికారికంగా ఈసారి కార్యక్రమాలు నిర్వహించడంపై హర్షం వ్యక్తం చేసిన  అమిత్ షా.. ఉత్సాహభరితంగా ఈ పండగను జరుపుకునే వాతావరణాన్ని కల్పించిన కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డిని, మంత్రిత్వ శాఖ అధికారులను అభినందించారు. పరేడ్ లో పాల్గొన్న వివిధ సాయుధ బలగాలను, సాంస్కృతిక కళాకారులను అమిత్ షా అభినందించారు.  

హైదరాబాద్ సంస్థానంలోని తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల్లో ఈ విమోచనంలో అమరులైన వారి గురించి, సంబంధిత అంశాల గురించి విస్తృతంగా పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉందని అమిత్ షా సూచించారు. అప్పుడే తర్వాతి తరాలకు మన పెద్దలు చేసిన త్యాగాల గురించి తెలియజేసేందుకు వీలుంటుందన్నారు. 

తెలంగాణకు స్వాతంత్ర్యం తీసుకురావడంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ పోషించిన పాత్రను ప్రత్యేకంగా ప్రస్తావించిన అమిత్ షా, పటేల్ లేకపోతే ఈ ప్రాంతం మరిన్ని రోజులు చీకట్లోనే ఉండేదన్నారు.  ఈ సందర్భంగా కొమురం భీం, రాంజీ గొండు, స్వామి రామానంద తీర్థ, విద్యాధర్ గురూజీ, పండిత్ కేశవరావ్ కోరట్ కర్, పీవీ నరసింహారావు, వందేమాతరం రామచంద్రరావు, నారాయణ్ రావ్ పవార్ మొదలైన వారిని అమిత్ షా గుర్తుచేసుకున్నారు. కర్ణాటక, మహారాష్ట్రల్లోనూ నిజాంకు వ్యతిరేకంగా పనిచేసిన ప్రముఖుల పేర్లనూ ప్రస్తావించి, వారిని గుర్తు చేసుకున్నారు. 

నిజాం సమయంలో మన సంస్కృతి, సంప్రదాయాలతోపాటు భాషపరంగానూ ఎన్నో నిబంధనలుండేవని, ఉర్దూలోనే విద్యాభ్యాసం జరిగేలా ఒత్తిడి చేసేవారన్నారు. ఈ సందర్భంగా మూడు రాష్ట్రాల్లోని నిజాం పాలిత ప్రాంతాల్లో జరిగిన కొన్ని హృదయవిదారకమైన, అరాచకమైన ఆకృత్యాలను అమిత్ షా గుర్తుచేశారు. గుండ్రాపల్లిలో తన పర్యటన సందర్భంగా స్థానికులు అక్కడ నిజాం సమయంలో జరిగిన ఆకృత్యాల గురించి చెప్పడం, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు ఆ ఘటనను దక్షిణ భారత జలియన్ వాలబాగ్ గా అభివర్ణించిన విషయాన్నీ అమిత్ షా గుర్తుచేశారు. ఇంతటి అరాచక పరిస్థితుల్లోనుంచి బయటపడిన తెలంగాణలో అధికారికంగా విమోచనం జరగాలని ప్రధానమంత్రి నిశ్చయించారన్నారు.
అంతకుముందు కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. 74 ఏళ్ల క్రితం సర్దార్ పటేల్ తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేస్తే, ఆ తర్వాత ఇంతవరకు అధికారికంగా ఉత్సవాలు జరగలేదననారు. ఇప్పుడు 74 ఏళ్ల తర్వాత అభినవ సర్దార్ పటేల్ అయిన అమిత్ షా జెండాను ఎగురవేయడంపై హర్షణీయమన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన అమిత్ షా, మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే, కర్ణాటక మంత్రి శ్రీ రాములు, కేంద్ర హోంశాఖ కార్యదర్శి శ్రీ అజయ్ భల్లాలకు తెలంగాణ ప్రజల తరఫున స్వాగతం పలికిన కిషన్ రెడ్డి.. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ ప్రజాప్రతనిధులు, స్వాతంత్ర్య సమరయోధులు, వారి కుటుంబసభ్యులకు కూడా పేరుపేరునా స్వాగతం పలికారు. 
తెలంగాణలోని 4 కోట్ల మంది ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న రోజు ఇదన్న ఆయన.. నాటి అమరవీరుల స్వప్నం సాకారమైందన్నారు. 25 ఏళ్లుగా విమోచన దినాన్ని జరపాలంటూ తాము పోరాటాలు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. అధికారికంగా విమోచనం జరిపినపుడే నాటి వీరుల త్యాగాలకు సరైన గుర్తింపు లభించడంతోపాటు కొత్తతరానికి స్ఫూర్తి లభిస్తుందన్నారు. సర్దార్ పటేల్ సైన్యాన్ని పంపి హైదరాబాద్ సంస్థానం ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడారన్నారు. ‘ఈ సందర్భంగా తెలంగాణ విమోచనం కోసం ఆత్మత్యాగాలు చేసిన స్వామి రామానంద తీర్థ, పీవీ నరసింహారావు, కొమురం భీం, నారాయణ్ రావ్ పవార్, వందేమాతరం రామచంద్రరావు..వంటి అనేకమంది మహానుభావులందరికీ కేంద్ర ప్రభుత్వం తరపున సెల్యూ్ట్ చేస్తున్నా’ అని కిషన్ రెడ్డి అన్నారు.కేంద్ర ప్రభుత్వం ఆజాదీకా అమృత్ మహోత్సవ్ లో భాగంగా దేశవ్యాప్తంగా కార్యక్రమాలు చేపడుతోందని ఇందులో భాగంగా ఏడాదిపాటు హైదరాబాద్ సంస్థానం విమోచన మహోత్సవాలను ఏడాదిపాటు నిర్వహించుకోనున్నట్లు ఆయన తెలిపారు. హైదరాబాద్ సంస్థానానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటినుంచి నేటి వరకు రాష్ట్రంలో అధికారంలో పార్టీలన్నీ తెలంగాణ విమోచనాన్ని జరపలేకపోయాయి. రాజకీయ సంతుష్టీకరణకోసం ప్రజల ఆకాంక్షను పణంగా పెట్టాయని ఆయన విమర్శించారు. అమిత్ షా హైదరాబాద్ లో విమోచన దినోత్సవం సందర్భంగా జెండా ఎగురవేస్తున్నారని తెలిసి ఇతర పార్టీలు కూడా వేర్వేరు పేర్లతో జెండా ఎగురవేయాలని నిర్ణయించడం ప్రజా విజయమని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. కేంద్రం సిద్ధమవడంతో వీళ్లంతా దిగొచ్చారన్నారు. నరేంద్ర, బద్దం బాల్ రెడ్డి, బంగారు లక్ష్మణ్, వి.రామారావు వంటి వారు ఈ రోజుకోసం ఎంతగానో ఎదురుచూశారని కిషన్ రెడ్డి అన్నారు. ఏడాదిపాటు జరిగే కార్యక్రమాల్లో ప్రజలు ఉత్సాహంగా పాలుపంచుకోవాలన్నారు.
అనంతరం మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే మాట్లాడుతూ ఇంతటి  చారిత్రక కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. మహారాష్ట్ర ప్రజల తరపున అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. పోలీస్ చర్య, అమరవీరుల పోరాటం కారణంగానే దేశం  ముక్కలు కాలేదన్నారు. వారి స్ఫూర్తి మనకు ఎంతో అవసరమని ఆయన అన్నారు. మహారాష్ట్రలో ప్రతి ఏటా సెప్టెంబర్ 17న ఛత్రపతి శంభాజీ నగర్ (ఔరంగాబాద్)లో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా కార్యక్రమం చేపడుతుందని ముఖ్యమంత్రులు అధికారికంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు. ఈసారి ముఖ్యమంత్రి హోదాలో తనకు ఆ అదృష్టం దక్కిందన్నారు. మోదీ, షాల మార్గదర్శనంలో మహారాష్ట్ర ప్రగతి సాధిస్తోందన్నారు. హర్ ఘర్ తిరంగాలో భాగంగా రెండున్నర కోట్ల ఇళ్లపై జాతీయ జెండాలు ఎగరేశామన్నారు. సామాన్యులకు జాతీయ జెండా ఎగురవేసే అవకాశం దాదాపుగా రాదని, అలాంటి వారికి జెండా ఎగరేసే అవకాశం కల్పించేందుకే ప్రధాని మోదీ ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. విమోచన  దిన మహోత్సవాలను ఏడాదిపాటు నిర్వహించాలని కేంద్రం నిర్ణయించడం అభినందనీయమన్న ఏక్ నాథ్ షిండే, క్రూరుడైన నిజాం నుంచి విముక్తి కల్పించిన సర్దార్ పటేల్ కు ధన్యవాదములు తెలిపారు. నాడు పటేల్ దేశాన్ని ఏకం చేసేందుకు కృషిచేస్తే నేడు అమిత్ షా ఆర్టికల్ 370 రద్దు వంటి సాహసోపేత నిర్ణయాల ద్వారా మిగిలిన పని పూర్తిచేస్తున్నారన్నారు. వారి నాయకత్వంలోనే హైదరాబాద్ విమోచనోత్సవం జరగడం అభినందనీయమన్నారు.
కర్ణాటక మంత్రి శ్రీరాములు మాట్లాడుతూ.. విమోచన దినోత్సవాన్ని తమ రాష్ట్రంలో మొదటినుంచీ ఘనంగా నిర్వహిస్తున్నామని, ఈసారి కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందని అన్నారు. హైదరాబాద్ సంస్థానంలో పోరాటయోధులు ఎన్నో త్యాగాలు చేశారని, సర్దార్ పటేల్ సైనిక చర్యకు ప్రజల పోరాట కాంక్ష తోడవడం వల్లే మన ప్రాంతానికి స్వాతంత్ర్యం సిద్ధించిందన్నారు. రజాకార్ల అత్యంత క్రూరమైన వ్యవహారాన్ని ప్రతిబింబించే కొన్ని ఘటనలను శ్రీరాములు పేర్కొన్నారు. ప్రజలను లూటీ చేయడం, బెదిరించడం, చిన్న, పెద్దా తేడాలేకుండా వ్యవహరించడం, మహిళలపై ఆకృత్యాల వంటివెన్నో ప్రజలకు నిత్యం నరకాన్ని చూపించేవన్నారు. నాటి పోరాట యోధుల స్ఫూర్తితో యువత ముందుకెళ్లాలని ఆయన అన్నారు.

అంతకుముందు, అమిత్ షా జాతీయజెండాను ఆవిష్కరించి సాయుధ బలగాల  గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం వివిధ సాయుధ బలగాలు (ఆర్ఏఎఫ్, సీఐఎస్ఎఫ్ మహిళల బృందాలు, సీఆర్పీఎఫ్, సీఐఎస్ఎఫ్, ఎన్సీసీ బృందాల) కవాతును వీక్షించారు. తదనంతరం తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలనుంచి వచ్చిన సాంస్కృతిక కళాకారుల ప్రదర్శన పరేడ్ ను తిలకించారు. తన ప్రసంగంలోనూ కళాకారులను ప్రత్యేకంగా అభినందించారు.

ఈ కార్యక్రమంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, ఆర్మీ అధికారులు, వివిధ సాయుధ బలగాల అధికారులు, స్వాతంత్ర్య సమరయోధులు, వారి కుటుంబసభ్యులు, వివిధ రంగాల ప్రముఖులు, వివిధ పాఠశాలలనుంచి వచ్చిన విద్యార్థులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com