దీనదయాళ్ ఉపాధ్యాయ ఉచిత వినికిడి యంత్రాల పంపిణీ ప్రారంభించిన ఏపీ గవర్నర్

- September 25, 2022 , by Maagulf
దీనదయాళ్ ఉపాధ్యాయ ఉచిత వినికిడి యంత్రాల పంపిణీ ప్రారంభించిన ఏపీ గవర్నర్

విజయవాడ: పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ 'సమగ్ర మానవతావాద' సిద్ధాంతం, సాంస్కృతిక జాతీయత విలువల ప్రతిపాదకుడని, 'సర్వోదయ' వంటి గాంధేయ సోషలిస్టు సిద్ధాంతాలను బలంగా పాటించేవారని ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరి చందన్ అన్నారు.భారతీయ జనసంఘ్ సహ వ్యవస్థాపకుడు పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతిని పురస్కరించుకుని దీన్ దయాళ్ శ్రవణ ఫౌండేషన్ ఆదివారం సిద్ధార్థ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వినికిడి లోపంతో బాధపడే బడుగు బలహీన వర్గాలకు చెందిన వారికి ఉచిత వినికిడి పరికరాల పంపిణీని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా గౌరవ హరిచందన్ మాట్లాడుతూ పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ పెట్టుబడిదారీ విధానానికి భిన్నంగా మానవుడు కేంద్రంగా స్వదేశీ ఆర్థిక నమూనాను అభివృద్ధి చేయడం దేశానికి గర్వకారణంగా నిలిచిందన్నారు. 

వినికిడి లోపం ఉన్నవారికి వారి వైకల్యాన్ని అధిగమించడానికి సహాయం చేయాలనే ప్రధాన లక్ష్యంతో దీన్ దయాళ్ శ్రవణ ఫౌండేషన్ ఉచిత వినికిడి పరికరాల పంపిణీని ప్రారంభించటం చాలా సంతోషంగా ఉందని గవర్నర్ అన్నారు.మానవునికి అత్యంత విలువైన ఇంద్రియాలలో వినికిడి శక్తి ఒకటని, వినికిడి లోపాన్ని చిన్న వయసులోనే గుర్తిస్తే చికిత్స చేయవచ్చని పేర్కొన్నారు.ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం, సుమారు 63 మిలియన్ల భారతీయ ప్రజలు శ్రవణ బలహీనతతో బాధపడుతున్నారని, వయస్సు సంబంధిత వినికిడి లోపం క్రమంగా సంభవిస్తుందని, వృద్ధులను ఇది ప్రభావితం చేస్తుందని గవర్నర్ వివరించారు. ముందస్తుగా గుర్తించి చికిత్స చేయడం వలన నష్టాన్ని తగ్గించవచ్చని అన్నారు.

తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఉచితంగా వినికిడి పరికరాలను పంపిణీ చేయడం ద్వారా ఫౌండేషన్ అందిస్తున్న సేవలను గవర్నర్ హరిచందన్ అభినందించారు.కార్యక్రమంలో దీన్ దయాళ్ శ్రవణ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు ఆర్.రామాంజనేయులు, బిజేపి నేత పాతూరి నాగ భూషణం, సిహెచ్. ఆదిత్య, కె.రంగ రాజన్, మల్లిఖార్జునరావు, టి.హనుమంత రావు, షేక్ హసీనా, ఆర్.ధర్మ ప్రచారక్, గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్.పి. సిసోడియా, రాజ్ భవన్ సంయుక్త కార్యదర్శి సూర్య ప్రకాష్ పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com