ప్రవక్త మహమ్మద్ జన్మదినం సందర్భంగా స్పెషల్ స్టోరీ

- October 09, 2022 , by Maagulf
ప్రవక్త మహమ్మద్ జన్మదినం సందర్భంగా స్పెషల్ స్టోరీ

ఇస్లాం చివరి ప్రవక్త మహమ్మద్ జన్మదినం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలందరూ ఈద్ ఎ మిలాద్ వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు.

దీనినే ఈద్ మిలాద్ ఉన్ నబి అని కూడా పిలుస్తారు. ఇస్లాం మతానికి చెందిన ఆరాధ్య గురువు అయిన మహ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా ఈ వేడుకను జరపుకుటారు. 

ఇస్లామిక్ క్యాలెండర్ లో మూడవ నెలలో ఈ పర్వదినాన్ని చేసుకుంటారు. ఈ రోజు ముస్లిం అనుచరులంతా మసీదులలోకి వెళ్లి పవిత్ర అల్లా  కృపకు  పాత్రులవుతారు. నిష్టతో ప్రార్థనలు చేస్తారు. అక్కడే ఒకరినొకరు ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు చెప్పుకుంటారు. 

మహనీయుడు మహ్మద్ ప్రవక్త

దైవ ప్రవక్త అయిన మహమ్మద్ (అబూ అల్ ఖాసిమ్ మహ్మద్) సౌదీ అరేబియాలోని మక్కా నగరంలో క్రీస్తు శకం 571 ఏప్రిల్ 22న జన్మించారు. ఆయన తండ్రి అబ్దుల్లా. తల్లి బీబీ అమీన్. మహ్మద్ చిన్న వయసులోనే తల్లి పరమపదించారు. వారిది ఇస్లాంలో ప్రసిద్దమైన ఖురైశ్ వంశం. చిన్న వయసులోనే తన బాబాయితో కలిసి వ్యాపార పనుల నిమిత్తం సిరియా వెళ్లిన మహమ్మద్... పాతికేళ్ల వయసులోనే తన కన్నా పదిహేనేళ్లు పెద్దదైన హజ్రత్ ఖదీజాను వివాహం చేసుకుని.. స్త్రీ జనోద్ధరణకు శ్రీకారం చుట్టారు. కానీ మక్కా నగర ప్రజలు మాత్రం ఆయన సందేశాలను, ఉద్యమాలను తీవ్రంగా వ్యతిరేకించారు. ఆయన అనుసరిస్తున్న విధానాలపై, మహ్మద్ అనుయాయులపై దాడులకు సైతం దిగారు. అయినా ప్రవక్త వారిని పల్లెత్తు మాట అనలేదు. అదే ప్రజలు తీవ్రమైన కరువు కోరల్లో చిక్కుకున్నప్పుడు వారికోసం ధన, ధాన్య రాశులను పంపించిన గొప్ప కరుణామయుడాయన.

మహ్మద్ ప్రవక్త చాలా నిరాడంబర జీవితం గడిపారు. అందరితో సమానంగా వ్యవహరించేవారు. తన పనులు తానే చేసుకునేవారు. ముస్లిం మతంలో గొప్ప సంస్కరణలు చేపట్టారు. సమాజంలో అసమానతలను రూపుమాపడానికి ఆయన చాలా కృషి చేశారు. పేద వారి పట్ల ఆయన దయా నిరతితో ఉండాలని చెప్పేవారు. అవసరార్థుల కోసం సేవ చేయడానికంటే మించిన దానం ఏదీ లేదనే వారు. సత్ ప్రవర్తనే మానవాళిని ముక్తి మార్గంలో నడిపిస్తుందని బోధించారు. సాటి మానవుల పట్ల ప్రేమగా వ్యవహరించాలని ఆయన ఉపదేశించేవారు.

సంస్కరణలకు ఆధ్యుడు

తన చిన్నతనం నుంచి మహ్మద్ ప్రవక్తకు దైవచింతన ఎక్కువ. రేయింబవళ్లు దైవ నామస్మరణలోనే గడిపేవారు. ఆయన ఇతర మతాలలోని లోపాలను వెతకలేదు. తాను అనుసరిస్తున్న మతంలో ఏదైనా తప్పులు ఉంటే మాత్రం వాటిని సరిదిద్దుకోవాలని, మానవాళి సంక్షేమం కోసం వాటిని సంస్కరించుకోవాలని బోధించేవారు. మహిళలకు పురుషులతో పాటు సమాన హక్కులుండాలని చెప్పేవారు. తన కుమార్తె అయిన హజ్రత్ ఫాతిమాకు ఉన్నత విద్య అందించారు. అలాగే తల్లిదండ్రులు తమ సంతానాన్ని ప్రేమించి.. వారికి మంచి విద్యాబుద్దులు చెప్పించడం, ఆ పిల్లలను మంచి వ్యక్తులుగా తీర్చిదిద్దడం వారి బాధ్యతగా స్వీకరించాలని ప్రవక్త చెప్పేవారు. పౌర హక్కుల విషయంలో ఏ మతంవారైనా.. అందరూ సమానమే అని కరాకండిగా చెప్పేవారు. ఆ మేరకు ఆయన అవిశ్రాంతంగా పోరాడేవారు.
అంతటి మహోన్నత వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి గనకే.. ఆయన పుట్టిన రోజున ముస్లిం సమాజం వేడుక చేసుకుంటున్నది. కిరీటం లేని చక్రవర్తిగా ఎదిగిన మహమ్మద్ ప్రవక్త.. మరణించిన రోజు ఆయన ఇంట్లో దీపం వెలిగించడానికి నూనె కూడా లేదు. కానీ ఆయన బోధనలు, చూపిన బాట మాత్రం నేడు మానవాళిని నడిపిస్తున్నదనడంలో ఏమాత్రం సందేహం లేదు.

--ఎన్. జాన్సన్ జాకబ్,మచిలీపట్నం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com