హైదరాబాద్: చిన్నారి పై లైంగిక దాడి.. స్కూలు గుర్తింపు రద్దు..

- October 21, 2022 , by Maagulf
హైదరాబాద్: చిన్నారి పై లైంగిక దాడి.. స్కూలు గుర్తింపు రద్దు..

హైదరాబాద్: హైదరాబాద్‌లో లైంగికి దాడికి గురైన చిన్నారి చదువుతున్న డీఏవీ స్కూలు గుర్తింపును వెంటనే రద్దు చేయాలని సూచిస్తూ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి ఆదేశించారు. ఈ అంశంపై హైదరాబాద్ డీఈవోకు మంత్రి సబిత ఆదేశాలు జారీ చేశారు.

అలాగే ప్రస్తుతం ఈ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు నష్టపోకుండా, మిగతా పాఠశాలల్లో సీట్లు కేటాయించేలా చూడాలని కూడా ఆమె సూచించారు. ఈ విషయంలో విద్యార్థుల సందేహాల్ని తొలగించి, ఎవరికీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని అధికారుల్ని ఆదేశించారు. ఇలాంటి ఘటనలు తిరిగి జరగకుండా చూడాలని ఆమె ఆదేశించారు. పాఠశాలల్లో భద్రతాపరమైన చర్యలపై ప్రభుత్వానికి సూచనలు చేసేందుకు ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తున్నామన్నారు. విద్యాశాఖ కార్యదర్శి నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి సబిత ప్రకటించారు. ఈ కమిటీ వారం రోజుల్లోగా తన నివేదిక అందజేస్తుందని, ఈ నివేదిక ఆధారంగా విద్యార్థుల భద్రతకు సంబంధించి ప్రత్యేక చర్యలు తీసుకోనున్నట్లు ఆమె వెల్లడించారు.

ఈ ఘటనలో ప్రధాన నిందితుడైన ప్రిన్సిపల్ వాహన డ్రైవర్ రజనీ కుమార్‌ను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. తాజాగా స్కూలు ప్రిన్సిపల్ మాధవిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తన డ్రైవర్ ఆకృత్యానికి పాల్పడుతున్నా అడ్డుకోకపోవడం, నిర్లక్ష్యంగా వ్యవహరించడం, ఘటన జరగడానికి కారణమయ్యారనే ఆరోపణలపై ఆమెపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com