సామూహిక వివాహాల కార్యక్రమంలో సీఎం చంద్రబాబు
- April 21, 2016
ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిపిస్తాం.. పరిటాల ట్రస్ట్ సేవలు స్ఫూర్తిదాయకం జూన్‌కి హంద్రీ-నీవా ప్రధాన కాల్వ పూర్తి అధికారులు పనిచేయకుంటే సహించను నాణ్యత లోపిస్తే బ్లాక్‌లిస్టులో కాంట్రాక్టర్లు నదుల అనుసంధానంతో శ్రీశైలానికి 100 టీఎంసీలు ఈ ఏడాది 8.75 లక్షల పంటకుంటలు : సీఎం అనంతలో చంద్రబాబు పర్యటన ఉచిత సామూహిక వివాహాలకు హాజరు చెర్లోపల్లి రిజర్వాయర్ పరిశీలన అనంతపురం: పరిటాల కుటుంబం నిర్వహిస్తున్న ఉచిత సామూహిక వివాహాల కార్యక్రమం తనలో స్ఫూర్తినింపిందని, ఇకపై అన్ని మతాల్లోని పేదలకు ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉచిత సామూహిక వివాహాలు జరిపిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. అనంతపురం జిల్లాలో గురువారం ఆయన సుడిగాలి పర్యటన చేశారు. రామగిరి మండలం నసనకోటలో పరిటాల రవీంద్ర మెమోరియల్ ట్రస్టు అధ్వర్యంలో జరిగిన ఉచిత సామూహిక వివాహాలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ఏడు పవిత్ర హిందూ దేవాలయాలతోపాటు పవిత్రమైన మసీదులు, చర్చీలలో ఉచిత సామూహిక వివాహాల కార్యక్రమానికి శ్రీకారం చుడతామన్నారు. పరిటాల పేదల మనిషి అని కొనియాడారు. రవీంద్ర బాటలోనే ఆయన సతీమణి పరిటాల సునీత, కుమారుడు శ్రీరామ్ ముందుకుసాగడం అభినందనీయమన్నారు. పరిటాల కుటుంబం నిర్వహిస్తున్న సామూహిక ఉచిత వివాహాలు తనలో కొత్త శక్తిని నింపాయన్నారు. సామూహిక వివాహాల కార్యక్రమంలో ఒక్కటైన 250 జంటలను చంద్రబాబు స్వయంగా ఆశీర్వదించారు. అన్ని జంటలతో వేర్వేరుగా ఫొటోలు దిగారు. ఒక్కో జంటకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.10 వేలు ఇస్తున్నట్లు ప్రకటించారు. సుమారు రెండు గంటలపాటు ఈ కార్యక్రమంలో గడిపారు. నీటిపారుదల అధికారులకు దిశానిర్దేశం కదిరి సమీపంలోని చెర్లోపల్లి రిజర్వాయర్‌ను సీఎం చంద్రబాబు పరిశీలించారు. అనంతరం నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. హంద్రీనీవా పనులు వేగవంతం చేయాలని, జూన్ నాటికి హంద్రీనీవా ప్రధాన కాల్వ పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రాత్రింబవళ్లు పనిచేసైనా హంద్రీనీవా పనులు సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అధికారులు, కాంట్రాక్టర్లు చిత్తశుద్ధితో పనిచేయకపోతే ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. పనిచేసేవారిని గౌరవిస్తామన్నారు. అలాంటివారే తనకు కావాలన్నారు. పనుల విషయంలో కాంట్రాక్టర్లు ఎవరైనా నాణ్యతకు తిలోదకాలిస్తే అలాంటివారిని బ్లాక్‌లిస్ట్‌లో పెడతానని హెచ్చరించారు. పోతిరెడ్డిపాడు నుంచి జీడిపల్లికి, అటు నుంచి కుప్పం, చిత్తూరుకు నీటిని సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. నదుల అనుసంధానం ద్వారా శ్రీశైలం డ్యామ్‌కు 100 టీఎంసీల నీటిని కేటాయిస్తామన్నారు. ఆ నీటిని అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాలకు తరలిస్తామన్నారు. సీమ జిల్లాలను సస్యశ్యామలం చేయడమే తమ లక్ష్యమన్నారు. వర్షాకాలంలో పడే ప్రతి వర్షపు చుక్కనూ ఒడిసిపట్టాలన్నారు. ఒక్క నీటి బొట్టూ వృథా కాకుండా భూమిలో ఇంకిపోయేలా చర్యలు తీసుకోవాలన్నారు. విమర్శలతో సమస్యలు పరిష్కారం కావని విపక్షాలను ఉద్దేశించి సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. విమర్శకులవి దుర్మార్గపు ఆలోచనలన్నారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా సీమకు నీటిని తీసుకొస్తామన్నారు. భవిష్యత్తులో అనంతపురం జిల్లా చరిత్రను తిరగరాయబోతున్నామన్నారు. జిల్లాకు వ్యవసాయాధారిత పరిశ్రమలు తీసుకొస్తామని తెలిపారు. భూగర్భజలాలు పెరిగితే భవిష్యత్తులో కరువు అనే మాటకే చోటు ఉండదన్నారు. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 8.75 లక్షల పంట కుంటలను తవ్వడం లక్ష్యంగా నిర్ణయించుకున్నామన్నారు. అనంతపురం జిల్లా పర్యటనలో భాగంగా జిల్లా కేంద్రంలో నీరు-ప్రగతిపై సీఎం సమీక్ష నిర్వహించారు. రైతులు, కూలీలు, సాగునీటి సంఘాల సభ్యులతో ముచ్చటించారు. కొడికొండ చెక్‌పోస్ట్ సమీపంలో రాగమయూరి ఎలక్ర్టానిక్స్ పార్క్, బయోటెక్నాలజీ పార్కు ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు.
తాజా వార్తలు
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...







